Abn logo
Sep 14 2020 @ 04:55AM

పదేళ్ల మలుపు

తెలుగు సమాజంలో గత రెండు మూడు దశాబ్దాలుగా విప్లవోద్యమంతో పాటు స్త్రీవాద ఆదివాసీ దళిత బహుజన ఆత్మగౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు తెచ్చిన మలుపుల మంచి చెడ్డలను విశ్లేషించు కొనే సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యటం లక్ష్యంగా ‘మలుపు ప్రచురణలు’ ఏర్పడింది. అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా తెలుగు సమాజం నిరంతరం జ్వలించటానికి అవసరమైన ‘ఇంధనం’ సమకూర్చే పుస్తకాల ప్రచురణ కార్యభారం నెత్తికెత్తుకొని మలుపును ఇంటిపేరు చేసుకొన్న బాల్‌ రెడ్డి, ఆయన మిత్రబృందం చేస్తున్న కృషి అభినందనీయం. ఈ ప్రయాణం మరొక పదేళ్లు, అనేక పదేళ్లు ఇలాగే కొనసాగాలి.


ఒక జాతి జ్ఞాన చైతన్యాల వికాసంలో పుస్తక ప్రచురణ సంస్థల పాత్ర చెప్పుకోదగినది. వాస్త వికమూ, హేతుబద్ధమూ అయిన జ్ఞానాన్ని విని మయంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఏర్పడే ప్రచురణ సంస్థలు సామాజిక బాధ్యతను భుజాలకెత్తు కుంటాయి. అందుకనే ఎంపికకు అనితర ప్రాధాన్యత. చదువరుల ఆలోచనా రీతిని, దృక్పథాన్ని విశేషంగా ప్రభావితం చేయగల సత్తా వాటికి ఉంటుంది. తెలుగు సమాజంలో అటువంటి ప్రచురణ సంస్థలు ‘హైదరా బాద్‌ బుక్‌ ట్రస్ట్‌’, ‘పర్‌స్పెక్టివ్స్‌’, ‘మలుపు’. ఒకే ఆలోచనా విధానం కల బాల్‌ రెడ్డి తదితర మిత్రబృందం కలిసి 2010లో ప్రారంభించిన సంస్థ మలుపు. ఈ పదేళ్లలో ముప్ఫయ్‌ అయిదు వరకు పుస్తకాలు ప్రచురింది.


తెలుగు సమాజంలో గత రెండు మూడు దశాబ్దా లుగా విప్లవోద్యమంతో పాటు స్త్రీవాద ఆదివాసీ దళిత బహుజన ఆత్మగౌరవ ఉద్యమాలు, ప్రాంతీయ ఆకాంక్షల ఉద్యమాలు తెచ్చిన మలుపుల మంచి చెడ్డలను విశ్లే షించుకొనే సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యటం లక్ష్యంగా ‘మలుపు ప్రచురణలు’ ఏర్పడింది. అరుంధతీ రాయ్‌ వ్రాసిన మూడు వ్యాసాలతో ‘ధ్వంసమైన స్వప్నం’ ఈ సంస్థ ప్రచురించిన మొదటి పుస్తకం. ఈ పుస్తకానికి ‘తొలిమలుపు’ అనే శీర్షికతో సంపాదకవర్గం వ్రాసిన ముందుమాట అభివృద్ధి పేరిట జరిగే విధ్వం సాన్ని, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రజా పోరాటాలపై ప్రజాస్వామ్యం పేరిట జరుగుతున్న అణచివేతను విశే ్లషించే, నిరసించే స్వరాన్ని వినిపించే రచనల ప్రచుర ణను లక్ష్యంగా ప్రకటించింది. ఎక్కడా చెప్పకుండానే ఈ కాలపు సంఘర్షణాత్మక సమస్యలలో ముఖ్యమైన హిందూ ముస్లిమ్‌ వైరుధ్యాల విశ్లేషణల ప్రచురణ కూడా చేప ట్టింది ‘మలుపు’.


ఈ పుస్తకాలలో ఆరు తప్ప మిగిలినవన్నీ అనువాదాలే. వాటిలో రష్యా దేశపు స్త్రీల అనుభవ కథనాల సంపుటి ఒకటి, గుగి వా థియాంగో రచనలు రెండు తప్ప మిగిలి నవన్నీ భారతదేశపు రచనలే. ముప్ఫయి రచనలలో పన్నెండు స్త్రీలవి. ఇవన్నీ చదివితే వర్తమాన దేశీయ రాజకీయార్థిక పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, అభి వృద్ధి మాయ, అణచివేత విశ్వరూపం, ప్రతిఘటన పోరా టాల గమనం- మొదలైన వాటికి సంబంధించిన సందే హాలు అనేకం తీరుతాయి. అవగహనకు స్పష్టత, సమ గ్రత సమకూడుతాయి. మనం ఒంటరిగా లేం అన్న భరోసా కలుగుతుంది. కల్లోల కాలంలో గుండెదిటవుతో జీవితాన్ని ఎదుర్కొనే ఉత్సాహాన్నిఇస్తాయి.


ఏమైనా సారంలో సామ్రాజ్యవాద పెట్టుబడి అసహ్యకర మైన ముఖాన్ని బట్ట బయలు చేయటం, వామనుడి మూడో పాదంలా సర్వాన్ని ఆక్రమిస్తూ, భిన్న స్వరా లను అణచివేస్తున్న ఫాసిస్టు శక్తి గురించి సమా జాన్ని అప్రమత్తం చేయటం ఈ రచనలు అన్నిటికీ వెనక ఉన్న ఏకైక తాత్విక సూత్రం. కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి, కులమత ఆధిపత్యాలు, అణచివేతలు అందువల్లనే విడదీయరాని అంశాలుగా సామ్రాజ్య వాదంతో కలిపి చర్చకు వస్తుండటం ఈ రచన లలో చూస్తాం. చదువుతుంటే ఇవి ఒక దానికి ఒకటి కొనసాగింపుగానో, పూరకంగానో, మరొక కోణంగానో, ఎడతెగని మానవ మహాప్రస్థానంలో ఉప కథనాలుగానో కనబడతాయి. అర్థమవుతాయి.


అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే బాక్సయిట్‌ తదితర గనుల తవ్వకాల కోసం బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కొనే క్రమంలో రూపొందుతున్న అభివృద్ధి నమూ నాలవల్ల, ప్రభుత్వ విధానాలవల్ల నిర్వాసితు లయ్యే ఆదివాసీల గురించి మాట్లాడకతప్పదు. అడవి, ఆదివాసీ అనగానే విప్లవోద్యమం ప్రస్తా వనకు రాకుండా ఉండదు. మావోయిస్టు రాజకీ యాలతో పూర్తి ఏకీభావంలేకున్నా, దానిపట్ల ఎంత విమర్శనాత్మకంగా ఉన్నా అంతకంటే మించిన ప్రత్యామ్నాయమూ కనబడదు. అరుంధతీ రాయ్‌, సత్నామ్‌, యాన్‌ మిర్డాల్‌, నందితా సుందర్‌ - అందరూ కాస్త అటూఇటుగా ఈ అభిప్రాయా నికే వచ్చారు. వాళ్ళ అనుభవ కథనాలు అందుకు సాక్ష్యాలు. అభివృద్ధి ఆదివాసులకు ప్రాణాంతకం అని పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌ల అనుభవం కూడా చెప్తుంది. ‘‘గోదావరి వచ్చినప్పుడు ప్రజలు చెప్పిన నది చరిత్ర’’ దానిని నిరూపించే రచన. కొందరిని అత్యంత సంపన్నులగా చాలామందిని దరిద్రులుగా మార్చే అభివృద్ధి నమూ నాపై విమర్శలు ‘విధ్వంసక అభివృద్ధి’, మరోకోణం’ అనే రెండు పుస్తకాలు.


అడవే కాదు, దేశంలోని రకరకాల ఆధిపత్యాల నుండి, దోపిడీ నుండి విముక్తిని కోరుకొనే జనావాసాలు అనేకం. అది తెలంగాణ కావచ్చు. కశ్మీర్‌ కావచ్చు. తెలంగాణ విజయం సాధించింది. కశ్మీర్‌ వంచన పాలైంది. తెలంగాణా ఉద్యమ కాలపు దేశీయ రాజకీయాలను, ఘటనలను వ్యాఖ్యానిస్తూ ఘంటా చక్రపాణి వ్రాసిన పత్రికా వ్యాసాల పుస్తకం ‘తెలంగాణ జైత్రయాత్ర’. కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తికి భంగకరంగా ప్రారంభమైన సైనిక జోక్యం 1990 నాటికి భారత ప్రభుత్వానికి వ్యతిరేక కశ్మీరీ గెరిల్లాలలను తయారు చేసిన పరిస్థితులలో పుట్టిపెరిగిన బషారత్‌ పీర్‌ జర్న లిస్టుగా తన జాతి జనం కార్చిన కన్నీటి, నెత్తుటి జాడ లను పట్టుకొంటూ చేసిన రచన ‘కశ్మీర్‌లో నిషిద్ధరాత్రి’. 370 ఆర్టికల్‌ రద్దు అప్రజాస్వామికం అని విమర్శిస్తూ వచ్చిన వ్యాసాల సంకలనం ‘కశ్మీర్‌ బహిరంగ చెరసాల’.


మనుషులు మతం పేరు మీద రెండుగా చీలిపోవటం, ‘మనం’, ‘వాళ్ళు’ అని రెండు శిబిరాలుగా విడిపోవటం సామాన్యుల నుండి సైనిక పోలీసు అధికార వర్గాల వరకు అందరిలోకి వ్యాపించి విధి విధానాలను ప్రభావితం చేస్తున్న విషాదాన్ని తెలుసుకొనటానికి విభూతి నారాయణ్‌ రాయ్‌ వ్రాసిన ‘22, మే హాషింపురా’ చదవాల్సిందే. మనీషా సేఠీ రచన ‘తలకిందుల లోకం’ (జూన్‌ 2017) హాషిం పురాకు మరొక కోణం నుండి కొనసాగింపు. రానా అయ్యూబ్‌ ‘గుజరాత్‌ ఫైల్స్‌’ గుజరాత్‌ మారణకాండ వెనుక హిందూత్వాన్ని స్థిరీకరించటం, మోదీ అమిత్‌ షాల రాజకీయ ఎదుగుదల రెండూ ఉన్నాయని స్పష్టం చేసింది.


ఈ కాలపు మరొక రాజకీయ విషాదం పౌరసత్వ సవరణ చట్టం. దీనిపై సరైన అవగాన కలిగించే రచన మాడభూషి శ్రీధర్‌ వ్రాసిన ‘ఎవడ్రా నన్ను పౌరుడు కాదన్నది’. దీనికి కొనసాగింపు ‘హమ్‌ భీ దేఖేంగే..’ పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన మర్నాటి నుండే నిరసన జెండాలు ఎగరేసిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఆలీ ఘడ్‌ ముస్లిం యూనివర్సిటీ, జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్సిటీలను గురిచూసి జరిగిన దాడులపై నిజ నిర్ధారణ కమిటీల నివేదికల సంకలనం ఇది.


కుల సమస్యపై వచ్చిన ‘ఖైర్లాంజి ఒక చేదు పాట’, ‘భారతదేశంలో కులవ్యవస్థ’, ‘జెండర్‌-కులం’. పుస్తకా లలో మొదటిది ఘటనకు సంబం ధించినది అయితే తరువాతి రెండూ చరిత్రకు, సిద్ధాంతానికి సంబం ధించినవి. ఈ వరుసలో వచ్చిన కార్టూన్ల పుస్తకం ఇ్చట్ట్ఛ ఇ్చుఽఛ్ఛిట (కులం కాన్సర్‌). అంబేడ్కర్‌ సమ కాలికురాలైన బేబి కాంబ్లే స్వీయ చరిత్ర ‘మా బతుకులు’ దళిత మహిళల అనుభవాలతో దేశీయ మహిళా ఉద్యమాన్ని సమగ్రం చేసుకోమంటుంది. ‘యుద్ధ కాలంలో స్వప్నాలు’, ‘సంకెళ్ళ సవ్వడి’ స్వీయ చరిత్రలే.


మలుపు ప్రచురించిన నాలుగు నవ లల్లో మొదటిది మహాశ్వేతాదేవి తొలి నవల ఝాన్సీ చారిత్రిక నవలా రచనకు అనుసరణీయమైన కృషికి ఒక నమూనా. సైనిక తిరుగుబాటుగా తక్కువ చేయబ డిన 1857 తిరుగుబాటును భారత భూభాగం మీద పరాయిపాలనపై ప్రజ్వరిల్లిన జాతీయ తిరుగుబాటుగా నిరూపించటం దీని ప్రత్యేకత. సాధన వ్రాసిన ‘రాగో’ సమకాలీన ఆదివాసీ మహిళల జీవితంలోని ఆరాట పోరాటాలను చిత్రిం చింది. ‘నగరంలో కర్ఫ్యూ’, ‘కన్నీటి కత్తి’ మిగిలిన రెండు నవలలు. గీతాంజలి వ్రాసిన హస్బెండ్‌ స్టిచ్‌ కథలు స్త్రీ శరీరాలుగా, అవయవాల కుప్పలుగా ఇంటా బయటా అత్యాచారాలకు, లైంగిక హింసకు బలి అవుతున్న వర్తమాన భీభత్సాన్ని ప్రతిఫలిస్తాయి.


మలుపు ప్రచురణలలో పాణి వ్రాసిన ‘వ్యక్తిత్వమే కవిత్వం’ విమర్శ విభాగానికి చెందింది. వ్యక్తి అయిన వాడు సమూహంలో భాగంగా కవిత్వం వ్రాస్తాడు కనుక కవిత్వ విశ్లేషణకు వ్యక్తి సమూహాల మధ్య ఉన్న గతితార్కిక సంబంధం ప్రాతిపదిక అన్న అవగాహనతో వరవరరావు కవిత్వాన్ని విశ్లేషిస్తూ వచ్చిన రచన ఇది. పాణి విమర్శకు ఏ వరవరరావు కవిత్వం వస్తువైందో ఆ కవి అప్పుడూ ఇప్పుడూ నిర్బంధంలోనే ఉన్నాడు. ఇప్పుడు అనారోగ్యంతో కూడా ఉన్నాడు. మలుపు పుస్తకాల రచయితలు, అనువాదకులలో వరవరరావుతో పాటు జిఎన్‌ సాయిబాబా, సుధాభరద్వాజ్‌, అరుణ్‌ ఫరేరా, ఆనంద్‌ తేల్తుంబ్దే కూడా జైళ్లలోనే. ఇదీ ఈ నాటి ప్రజాస్వామ్య సాహిత్య సాంస్కృతిక దృశ్యం.


అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా తెలుగు సమాజం నిరంతరం జ్వలించటానికి అవసరమైన ‘ఇంధనం’ సమకూర్చే పుస్తకాల ప్రచురణ కార్యభారం నెత్తికెత్తుకొని మలుపును ఇంటిపేరు చేసుకొన్న బాల్‌ రెడ్డి, ఆయన మిత్రబృందం చేస్తున్న కృషి అభినంద నీయం. ఈ ప్రయాణం మరొక పదేళ్లు, అనేక పదేళ్లు ఇలాగే కొనసాగాలి.


-కాత్యాయనీ విద్మహే

Advertisement
Advertisement
Advertisement