దోష నివారకుడు కమండల గణపతి

ABN , First Publish Date - 2022-04-22T05:30:00+05:30 IST

తొలి వేలుపుగా పూజలందుకొనే గణనాథుడు కమండల గణపతిగా

దోష నివారకుడు కమండల గణపతి

తొలి వేలుపుగా పూజలందుకొనే గణనాథుడు కమండల గణపతిగా కొలువైన క్షేత్రం అది. ఈ ఆలయంలో గణపతికి ముందున్న కుండం నుంచవ పొంగుకొని వచ్చే నీటిని సకల శ్రేయస్సులూ కలిగించే దివ్య జలంగా భక్తులు భావిస్తారు.


కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలోని కేశవె గ్రామంలో ఉన్న కమండల గణపతి ఆలయానికి వెయ్యేళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఆ ఆలయాన్ని సందర్శించి, స్వామిని సేవించినా, ధ్యానించినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మిక. ఇక్కడ ఉన్న కమండల తీర్థం పేరిట... వినాయకుడు కమండల గణపతిగా ప్రసిద్ధి చెందాడు. 


దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయం ఆవిర్భావం గురించి వివరించే కథలు ఎన్నో ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం... శని ప్రభావానికి గురైన పార్వతీదేవి దాని నుంచి విముక్తి కోసం తపస్సు చేయడానికి భూలోకానికి వచ్చింది. ఆమె తపస్సుకు అవరోధాలు ఏర్పడడంతో... వాటిని నివారించాల్సిందిగా విఘ్ననాశకుడైన తన కుమారుడు వినాయకుణ్ణి ఆమె కోరింది. బ్రహ్మచారి రూపంలో... కమండలం ధరించి వచ్చిన వినాయకుడు ఆమె తపస్సు సజావుగా సాగేలా చేశాడు. అనంతరం ఇక్కడ గణపతిని పార్వతీదేవి ప్రతిష్ఠించింది. పవిత్రమైన తీర్థాన్ని సృష్టించింది. దీన్ని ‘కమండల తీర్థం’ అని పిలుస్తారు. ఈ కమండల తీర్థమే బ్రహ్మీ నదికి జన్మస్థానం అంటారు. పార్వతీ దేవి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై, తన కమండలంలోని నీటిని ఆమెపై చిలకరించాడనీ, ఆ దివ్య జలాలే ‘బ్రహ్మీ నది’గా మారాయనీ కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి ప్రయాణించే బ్రహ్మీ నది తుంగా నదిలో సంగమిస్తుంది.


కాగా పూర్వకాలంలో భూలోకం తీవ్ర దుర్భిక్షానికి గురైందనీ, తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడిందనీ, భూలోకవాసుల ప్రార్థనలను ఆలకించిన జగన్మాత పార్వతీదేవి... ఇక్కడ ఒక తీర్థాన్ని సృష్టించిందనీ, దాని ప్రభావంతో భూమి మీద నీటి కొరత తీరిందనీ మరో కథనం. ఈ తీర్థంలో స్నానం చేసి, గణేశుణ్ణి దర్శించుకుంటే సకల కష్టాలు... ప్రధానంగా శనిదోషం తొలగిపోతాయని నమ్మిక. విద్యాప్రదాతగా, సంపత్కారకుడిగా, గ్రహదోష నివారకుడిగా కమండల గణపతి ప్రసిద్ధి చెందాడు.



ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు సుఖాసనంలో... ఒక చేత్తో మోదకంతో... మరో చేత్తో అభయం ఇస్తూ దర్శనమిస్తాడు. స్వామి ఎదుట ఉండే కుండంలో నీరు నిరంతరం ఉంటుంది. వర్షాకాలంలో కుండాన్ని దాటి ప్రవహిస్తూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో సాధారణంగా ఉంటుంది. భక్తులు ఈ నీటిని దివ్య జలంగా భావిస్తారు. దాన్ని ఇళ్ళకు తీసుకువెళ్ళి, పూజా మందిరాల్లో ఉంచుతారు. వ్యాధులను నయం చేసే ఓషధీ గుణాలు ఈ నీటిలో ఉన్నాయని విశ్వసిస్తారు. రోజూ ఉదయం ఏడున్నర నుంచి మఽధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. 


Updated Date - 2022-04-22T05:30:00+05:30 IST