ఉసురు తీసిన అప్పులు

ABN , First Publish Date - 2021-12-06T08:49:44+05:30 IST

సాగు కోసం చేసిన అప్పులు ఆ అన్నదాతల పాలిట శాపమయ్యాయి. వ్యవసాయంలో నష్టం రావడంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం ఎల్కల్‌ గ్రామానికి చెందిన జాల భూమయ్య (55) తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు.

ఉసురు తీసిన అప్పులు

  • రుణాల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
  • విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): సాగు కోసం చేసిన అప్పులు ఆ అన్నదాతల పాలిట శాపమయ్యాయి. వ్యవసాయంలో నష్టం రావడంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం ఎల్కల్‌ గ్రామానికి చెందిన జాల భూమయ్య (55) తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. కూతుళ్ల పెళ్లిళ్లతో పాటు సాగు కోసం అప్పులు చేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో బాకీలు పెరిగిపోయాయి. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూమయ్య శనివారం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన పూదరి సంపత్‌ గౌడ్‌(50).. సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి గ్రామ శివారులో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, పత్తి, వేరుశనగ పంటలు సాగుచేస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల వల్ల పంట దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. అప్పులు తీర్చేదెలా అని మనస్తాపం చెందిన సంపత్‌.. ఆదివారం పొలం వద ్ద పురుగులమందు తాగాడు. స్థానికులు హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.


విద్యుత్‌ షాక్‌తో ఇద్దరి మృతి..

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌ గ్రామానికి చెందిన గూల పండరి(37) ఆదివారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. స్టార్టర్‌ డబ్బాలోని ఫ్యూజును సరి చేస్తుండగా, విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబాబాద్‌ జిల్లా వేంనూరు శివారు రాముతండాకు చెందిన బానోత్‌ బాలు (31) తన బావి వద్ద మోటారు వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు.

Updated Date - 2021-12-06T08:49:44+05:30 IST