అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-01T04:54:05+05:30 IST

మండల కేంద్రమైన లింగాలలో అప్పుల బాధ తాళలేక ప్రభాకర్‌ (45) అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
ప్రభాకర్‌ (ఫైల్‌)

లింగాల, నవంబరు 30: మండల కేంద్రమైన లింగాలలో అప్పుల బాధ తాళలేక ప్రభాకర్‌ (45) అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ హృషికేశ్వరరెడ్డి కథనం మేరకు లింగాల వాసి ప్రభాకర్‌కు మూడున్నరెకరాల పొలం ఉంది. ఈ పొలంలో రెండు బోరు బావులు వేశాడు. నీరు అంతంతమాత్రమే పడింది. దీంతో పొలంలో పలు రకాల పంటు సాగు చేశాడు. అయితే సాగు చేసిన పంటలతో అప్పులే మిగిలాయి. ఇతను గొర్రెల పెంపకం కూడా చేపట్టేవాడు. అయితే ఇటీవల పలు రకాల జబ్బులతో 20 గొర్రెలు మృతి చెందాయి. పంట సాగు కోసం దాదాపు రూ.10 లక్షలు అప్పు చేయడంతో నెల రోజుల నుంచి అప్పు ఇచ్చిన వారు డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేయసాగారు. దీంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య సరస్వతి, కుమార్తెలు లలిత, దీపిక, కుమారుడు లోకేష్‌ ఉన్నారు. పెద్దకుమార్తె లలితకు డిసెంబరులో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇంతలోనే ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2021-12-01T04:54:05+05:30 IST