రుణ గ్రహీతలూ బేఫికర్‌

ABN , First Publish Date - 2020-03-28T06:23:00+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ విధులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితయ్యారు. ఫలితంగా వారి ఆదాయంపై...

రుణ గ్రహీతలూ బేఫికర్‌

క్రెడిట్‌ కార్డు బకాయిలకూ విరామం 


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ విధులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితయ్యారు. ఫలితంగా వారి ఆదాయంపై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో కొంత మందికి ఇళ్లు గడవడమే కష్టంగా మారనుంది. అలాంటిది బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ డీఫాల్ట్‌ అయితే ఎలా? అని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి భయాలను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) చల్లని కబురు వినిపించింది. రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మూడు నెలల మారటోరియంకు అనుమతివ్వాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏయే రుణాలకు ఈ మారటోరియం (విరామం) వర్తిస్తుందో చూద్దాం.. 


కారు, గృహ, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్‌ రుణాల ఈఎంఐలకు మారటోరియం వర్తిస్తుంది. మారటోరియం ప్రకటించిన కాలానికి రుణగ్రహీతలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఈఎంఐల వాయిదా మాత్రమే. ఈఎంఐ రద్దు మాత్రం కాదు. 

ఈ మేరకు మార్చి 1వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య కాలానికి ఈఎంఐ బకాయిలకు సంబంధించి చింతించాల్సిన అవసరం లేదు. 

క్రెడిట్‌ కార్డు బిల్లుల బకాయిలకు కూడా మారటోరియం వర్తిస్తుంది. 

రుణగ్రహీతలందరికీ మారటోరియం ఇవ్వకపోవచ్చు. బ్యాంకులు ఈ మారటోరియానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను వెలువరించనున్నాయి. 

వడ్డీతోపాటు అసలు మొ త్తానికి మారటోరియం వర్తిస్తుంది.

ఈఎంఐ చెల్లించకపోతే సంబంధిత వ్యక్తుల క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఉండకుండా చూడాలని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలను ఆర్‌బీఐ కోరింది. 

ఈ మారటోరియం సదుపాయాన్ని అవసరమైతే రుణగ్రహీత వినియోగించుకోవచ్చు లేదా ఈఎంఐ చెల్లించవచ్చు. 

మారటోరియం కాలానికి సంబంధించిన మొత్తంపై వడ్డీ.. అసలు మొత్తానికి జతయ్యే అవకాశం ఉంది. అప్పుడు మారటోరియం తర్వాత మూడు నెలల కాలానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈఎంఐ చెల్లించే సామర్థ్యం ఉంటే చెల్లించడమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

చాలా మంది తమ రుణ వాయిదాలను ఎలక్ర్టానిక్‌ క్లియరింగ్‌ సిస్టమ్‌ కింద ఆటో డెబిట్‌ను ఎంచుకుని ఉంటా రు. ఇలాంటి సమయంలో ఆటోమేటిగ్గా వారి ఖాతా నుంచి సొమ్ము డెబిట్‌ అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే సంబంధిత రుణగ్రహీతలు బ్యాంకుకు సమాచారం అందించి మారటోరియం ప్రయోజనం కల్పించాలని కోరాల్సి ఉంటుంది. 

ఇక మారటోరియంకు సంబంధించిన విధానాన్ని అమలు చేయడానికి బ్యాంకులు తమ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

అన్ని కాలపరిమితి రుణాలకు (వ్యవసాయ కాలపరిమితి రుణాలు, రిటైల్‌, పంట రుణాలు సహా) మారటోరియం కల్పించేందుకుగాను అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు), కో ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, ఎన్‌బీఎ్‌ఫసీ (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, రుణ వితరణ సంస్థలు)లకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. 

Updated Date - 2020-03-28T06:23:00+05:30 IST