Abn logo
Sep 28 2021 @ 03:44AM

వారంలోపే 50వేల లోపు రుణమాఫీ : హరీశ్‌రావు

హుజూరాబాద్‌, సెప్టెంబరు 27: కేసీఆర్‌ రైతు బాంధవుడయితే.. రైతుల ఉసురు పోసుకునేది బీజేపీ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన రైతులు, విత్తన ఉత్పిత్తిదారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసి రైతు వ్యవస్థను బలోపేతం చేయడానికి రైతుబంధు సమితులను ఏర్పాటు చేశామన్నారు. కరోనా వల్ల ఈసారి రైతు రుణమాఫీ ఆలస్యమైందన్నా రు. వారంలోపే రూ.50వేలలోపు రుణాలను మిత్తితో సహా చెల్లిస్తామని చెప్పా రు. రూ.50వేల నుంచి రూ.లక్షలోపు వారికి మార్చిలోపు మిత్తితోసహా రుణమాఫీ చేస్తామన్నారు.


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడంతో దుక్కులు దున్నే ఖర్చులు పెరిగి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టే.. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మార్కెట్లను రద్దు చేస్తామని, బాయిలకాడ మీటర్లు పెడుతామని బీజేపీ అంటోందని చెప్పారు. తాను హుజూరాబాద్‌కు వచ్చినపుడు.. మహిళా భవనాలు నిర్మించుకుంటామేంటే సాయం చేశానని.. రోడ్లు వేయించానని తెలిపారు.  రైతుకు ఆసరాగా రైతుబంధు ఇస్తుంటే.. డీజిల్‌ ధర పెంచి రూ.2500 రైతు నుంచి బీజేపీ గుంజుకుంటోందన్నారు. ఇనుప కంచెలతో రైతులను ఢిల్లీకి రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని.. దీనిమీద ఈటల రాజేందర్‌ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఎంపీ బండి సంజయ్‌.. పది రూపాయల అభివృద్ధి పని చేశారా అని మంత్రి ప్రశ్నించారు. సీడ్‌ గ్రోవర్స్‌ అసోసియేషన్‌కు ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామన్నారు.  

క్రైమ్ మరిన్ని...