అప్పుల వి(ప)త్తు!

ABN , First Publish Date - 2020-06-03T10:41:28+05:30 IST

జిల్లా రైతులను ముంగారు నిరాశల్లోకి ..

అప్పుల వి(ప)త్తు!

కరువు రైతుకు తప్పని అవస్థల సాగు

ప్రభుత్వ పెట్టుబడి సాయం అరకొరే

కారణాల బూచితో కొందరికి దక్కని వైనం

 సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం ఎదురుచూపులు

వడ్డీలేని రుణాలు ఒట్టిమాటలే

ఎకరా విత్తుకు రూ.18 వేల దాకా ఖర్చు

అప్పు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు

ప్రత్యామ్నాయ పంటల విత్తనాల ఊసేలేదు

విత్తన శుద్ధి పొడిమందు రాయితీ ఎత్తివేత

ప్రతిపాదనల దశలోనే యాంత్రీకరణ పరికరాలు

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమైన రైతన్న


అనంతపురం, జూన్‌2(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులను ముంగారు నిరాశల్లోకి నెడుతోంది. ఈ ఏడాది సైతం అన్నదాత అప్పుల సాగు దిశగానే అడుగులు వేస్తున్నాడు. ప్రభుత్వం పంట సాగు పెట్టుబడి సాయం అందిస్తున్నా.. అది ఏ మూలకూ సరిపోవట్లేదు. బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలిస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలవట్లేదు. సబ్సిడీ విత్తనమూ రైతులందరికీ దక్కట్లేదు. ఇచ్చిన మూడు బస్తాలు ఎకరా సాగుకే సరిపోతున్నాయి. దీంతో బయటి మార్కెట్‌లో అధిక ధర చెల్లించి, విత్తన వేరుశనగ కొనుగోలు చేయాల్సి వస్తోంది. నైరుతి రుతుపవనాల జాడ కనిపిస్తుండటంతోపాటు.. జిల్లాలో రెండుమూడు రోజులుగా వర్షాలు పడుతుండటంతో అన్నదాత పొలం దుక్కిలో నిమగ్నమయ్యాడు.


కాడెద్దులు కరువవటంతో ట్రాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎకరా పొలం దున్నేందుకు రూ.800 దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. కాడెద్దులు బాడుగకు వస్తే.. రూ.1500 చెల్లించాల్సిందే. ఎకరా వేరుశనగ విత్తాలంటే ఎరువులు, కూలీలతో కలిపి రూ.18 వేల వరకూ ఖర్చు చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో రోజురోజుకీ వ్యవసాయం భారమవుతోంది. ఏడాదికేడాదికీ అప్పులు పెరిగిపోతున్నాయి. పొలాన్ని బీడు పెట్టలేక.. తోటి రైతుల్లో చులకన కాలేక.. ఖరీ్‌ఫలో అప్పుల సాగుకు సిద్ధమవుతున్నారనటంలో సందేహం లేదు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవటమే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం బాధిత రైతుల నుంచి వినిపిస్తుండటం గమనార్హం.


ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 6.83 లక్షల హెక్టార్లు

ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 6.83 లక్షల హెక్టార్లుగా నిర్ణయించారు. ఇందులో వేరుశనగ 4.60 లక్షలు, కంది 53 వేలు, పత్తి 47 వేలు, జొన్న 16 వేలు, మొన్నజొన్న 15 వేలు, ఆముదం 13 వేలు, ఉలవ 26 వేల హెక్టార్లు సాగు లక్ష్యం కాగా.. నూనెగింజల పంటలు 4.75 లక్షలు, పప్పు ధాన్యాలు 94 వేలు, చిరుధాన్యాల పంటలు 40 వేల హెక్టార్ల పంటలు సాగు చేయనున్నారు.


సబ్సిడీ విత్తనం కోసం ఎదురుచూపులు

జిల్లాలో 7.30 లక్షల మంది రైతులకుగాను, వీరిలో కౌలు రైతులు 60 వేల మంది ఉన్నారు. ఖరీ్‌ఫలో జిల్లాకు 3.34 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తన వేరుశనగ కేటాయంచారు. రైతుభరోసా కేంద్రాల్లో గ్రామస్థాయిలోనే సబ్సిడీ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినా పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. 3.27 లక్షల మంది రైతులు విత్తన వేరుశనగ కోసం పేర్లు నమోదు చేసుకున్నా.. 2.81 లక్షల మందికి 2.59 లక్షల క్వింటాళ్లకు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించారు. అందులో 2.55 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 46 వేల మంది రైతులు సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు డబ్బు కట్టిన తర్వాతే విత్తన వేరుశనగ పంపుతామని వ్యవసాయాధికారులు మెలిక పెడుతుండటంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.


అందని రైతు భరోసా సొమ్ము

జిల్లాలో 8.17 లక్షల రైతుల ఖాతాలున్నాయి. వీటిలో 5.71 లక్షల మంది అన్నదాతల ఖాతాలకు రైతు భరోసా సొమ్ము జమ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5500 చొప్పున జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని కారణాల బూచితో 73,120 రైతుల ఖాతాలను తిరస్కరించారు. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీ్‌ఫలో విత్తనకాయల కొనుగోలుకు రైతు భరోసా సొమ్ము ఉపయోగపడుతుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. తొలి విడతలో రైతు భరోసా సొమ్ము జమ అయిన రైతుల పేర్లను రెండో విడతలో తిరస్కరణ జాబితాలో ఉంచటం గమనార్హం. వీరికి మరో అవకాశమిచ్చినా పెట్టుబడి సాయం ఏమేర అందుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


‘ప్రత్యామ్నాయ’ విత్తనాల ఊసేదీ?

జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలు మినహా.. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు ఊసే కనిపించటం లేదు. ఇప్పటి వరకూ రాయితీని నిర్ణయించలేదు. కేటాయింపులు మాత్రం చేశారు. మొక్కజొన్న 1582, జొన్నలు 41, సజ్జలు 16, పెసర 67, ధనియాలు 251, రాగి 85, కొర్ర 225, ఊదలు 48, అరికెలు 45, సాములు 30, అండుకొర్రలు 40, వరిగలు 25 క్వింటాళ్లు కేటాయించారు. నేటికీ పంపిణీకి నోచుకోలేదు. తీవ్ర జాప్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


విత్తన శుద్ధి పొడి మందు రాయితీ ఎత్తివేత

ఏటా సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలతో పాటు విత్తనశుద్ధి పొడి మందు రాయితీతో రైతులకు అందజేసేవారు. కిలో ట్రైకో డెర్మావిరిడి విత్తనశుద్ధి పొడి మందు ధర రూ.100 కాగా.. 75 శాతం రాయితీతో రైతులకు అం దించేవారు. రైతు రూ.25 చెల్లిస్తే కిలో విత్తనశుద్ధి పొడి మందు పంపిణీ చేసేవారు. ఆ మందును విత్తనంతో కలిపి విత్తేవారు. ఈ ఏడాది విత్తనశుద్ధి మందుకు రాయితీ ఎత్తివేయటంతో ప్రైవేట్‌ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది.


ప్రతిపాదనల దశలోనే యాంత్రీకరణ పరికరాలు

జిల్లాలో కాడెద్దులు కరువవటంతో పొలం దుక్కి చేసుకునేందుకు యాంత్రీకరణ పరికరాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా గతేడాది యాంత్రీకరణకు రూ.35 కోట్లతో వ్యవసాయశాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే యాంత్రీకరణ పరికరాల అంశం ఉండిపోయింది. పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ యాంత్రీకరణ విషయాన్ని పక్కకు నెట్టిందన్న అభిప్రాయం ఆ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. పరికరాల కోసం ఏడాది నుంచి రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.


ఆర్థికంగా చితికిపోయా.. గోపాల్‌, రైతు, ఐపార్శపల్లి, కంబదూరు మండలం

ఏటా వేరుశనగ సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు వస్తోంది. పంట చేతికొచ్చేసరికి ఏదో రూపంలో దెబ్బతింటోంది. దీంతో దిగుబడి రావట్లేదు. పెట్టుబడి చేతికందట్లేదు. అప్పులే మిగులుతున్నాయి. వ్యవసాయమే జీవనాధారం. ఏడాదికేడాదికీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. ప్రభుత్వం వడ్డీలేని రుణాలిస్తామని చెప్పినా ఆచరణలో అమలు కావటం లేదు. రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావట్లేదు. ప్రైవేట్‌ వ్యక్తులతో అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వస్తోంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఏడాదికేడాదికీ కుదేలవాల్సిందే.


మూడు బస్తాలు సరిపోవు.. బడోళ్ల బయపరెడ్డి, రైతు, చిలమత్తూరు మండలం

నాకు ఐదెకరాల పొలం ఉంది. వర్షాధారంగా ఏటా ఖరీ్‌ఫలో వేరుశనగ సాగుచేస్తా. ప్రభుత్వం నుంచి మూడు బస్తాలే సబ్సిడీ విత్తన వేరుశనగకాయలు అందాయి. గరిష్టంగా మూడు బస్తాలే ఇవ్వటంతో ఎకరా పొలానికి మాత్రమే సరిపోతాయి. మిగిలిన విత్తనాలు బయట కొనుగోలు చేయక తప్పట్లేదు. బయట మార్కెట్‌లో 40 కిలోల బస్తా రూ.2800 వరకు ధర పలుకుతోంది.


అవి నాణ్యతగా ఉండట్లేదు. పంట సాగు కోసం అదనపు భారం పడుతోంది. ఎకరం పొలం దుక్కి చేయాలంటే రూ.10 వేలకు పైగానే పెట్టుబడి పెట్టాలి. పంట విత్తే సమయానికి ఎరువులు ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం రైతు భరోసా కింద చేసిన సాయం దుక్కికే సరిపోతోంది. వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ఐదెకరాలకైనా సబ్సిడీతో విత్తన వేరుశనగ అందించి ఉంటే రైతుకు ప్రయోజనం చేకూరేది.


వడ్డీలేని రుణాలు ప్రకటనకే పరిమితం.. భాస్కర్‌రెడ్డి, రైతు, చిక్కేపల్లి

ప్రభుత్వం వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. బ్యాంకర్లు వడ్డీలేని రుణాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వమిచ్చే సబ్సిడీ విత్తన వేరుశనగ ఎకరాకు సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భూమి దుక్కి కోసం, విత్తనాల కొనుగోలు కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, పంటలు సాగు చేస్తున్నాను. పంటలు పండినా.. గిట్టుబాటు ధర లేకపోవటంతో అప్పులే మిగులుతున్నాయి. పొలాలను బీడు భూములుగా చూడలేక అప్పులు చేసి, గౌరవం కోసం పంట పండిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పరిస్థితి చూసైనా వడ్డీలేని రుణాలతోపాటు సబ్సిడీ విత్తనం పూర్తిగా అందజేయాలి.


ఏటా పంట దెబ్బతింటోంది .. అశ్వత్థప్ప, రైతు, గొల్లపల్లి

ఏటా ఖరీ్‌ఫలో సాగు చేసిన వేరుశనగ పంట ఏదో కారణంగా దెబ్బతింటుండటంతో నష్టపోతున్నాం. పొలాలను పంట పెట్టకుండా వదిలేయలేక, తోటి రైతుల్లో పలుచన కాలేక, పంట సాగుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఏ మూలకూ సరిపోవట్లేదు. విత్తన సబ్సిడీ పరిస్థితీ అంతే. నాకు మూడెకరాల పొలం ఉంది. మూడు బస్తాలే ఇస్తే ఎలా సరిపోతాయి? గత్యంతరం లేక బయటి మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేసి పంట పెడుతున్నాం. రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించట్లేదు.


రూ.3 వడ్డీకి అప్పు తెచ్చా..నాగరాజు, రైతు, కలుగోడు, గుమ్మఘట్ట మండలం

వర్షాలు కురుస్తుండటంతో సేద్యం కోసం రూ.3 వడ్డీతో అప్పు చేశా. నాకున్న ఐదెకరాల పొలంలో గతేడాది వేరుశనగ సాగు చేసి నష్టపోయా. దిగుబడి అంతంతమాత్రంగా రావటంతో ఈసారి బయట అప్పు చేయాల్సి వచ్చింది. సబ్సిడీ రూపేనా విత్తన వేరుశనగ ఇచ్చినా.. పంట పెట్టుబడి సాయం అందించినా.. ఎకరాకు కూడా చాలదు. ఎకరా పంట సాగు చేయాలంటే దాదాపు రూ.20 వేల దాకా ఖర్చు వస్తోంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయట్లేదు. ఏదో కొంత విదిలించి రైతులకు సాయం చేశామని చెప్పుకుంటున్నారు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. బ్యాంకోళ్లు ఏడాదికేడాదికీ రీ షెడ్యూల్‌ పేరుతో ఇచ్చిన మొత్తాన్ని కట్టించుకుంటున్నారు. తిరిగి అదే మొత్తం ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా పెంచట్లేదు. వడ్డీలేని రుణాలు ఒట్టిమాటలే.


సాగు ఖర్చు బాగా పెరిగింది.. శ్రీనివాసచౌదరి, ధర్మాపురం, గుత్తి మండలం

ఈ ఏడు సాగు ఖర్చు బాగా పెరిగింది. దున్నటానికి ఎకరాకు ట్రాక్టరుకు రూ.500 నుంచి రూ.600 తీసుకుంటున్నారు. ఎకరాకు వేరుశనగ వేయాలంటే రూ.20 ఖర్చు వస్తుంది. నేను 35 ఎకరాలు సాగుచేస్తున్నా. వర్షం రావటంతో పొలంలో దుక్కి పనులు చేపట్టా. దాదాపు రూ.7 లక్షలు విత్తటానికే ఖర్చవుతోంది. ఆ పంట మొలిచిన దగ్గర నుంచి కోతకొచ్చే వరకూ.. అదనపు ఖర్చులే. ఇంత కష్టపడి పనిచేసినా.. పంట దిగుబడి వస్తుందో, లేదో అనుమానం. తీరా ఊడలు దిగే సమయంలో వర్షాలు రాకపోతే నా పరిస్థితి అత్యంత దయనీయమవుతుంది. అప్పులతోనే జీవితమంతా గడపాల్సి వస్తోంది.

Updated Date - 2020-06-03T10:41:28+05:30 IST