రుణంపై రణం

ABN , First Publish Date - 2022-05-14T07:49:06+05:30 IST

సీఎం కేసీఆర్‌కు రుణాల సెగ తగిలింది.

రుణంపై రణం

నెలాఖరులోగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

రుణ సమీకరణలో కేంద్రం వివక్షపై చర్చ, తీర్మానం

మోదీ సర్కారుపై ప్రజల్లోకి.. సీఎం కేసీఆర్‌ యోచన


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌కు రుణాల సెగ తగిలింది. ఆర్బీఐ ద్వారా రుణాన్ని సమీకరించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం, నిధుల మంజూరు తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ మేరకు అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచాలని భావిస్తున్నారు. నెలాఖరులోగా ఒకటి లేదా రెండు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వివక్షపై సమగ్ర చర్చ చేపట్టాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఏపీ సహా మరో మూడు రాష్ట్రాలకు ఆర్బీఐ ద్వారా రుణ సేకరణకు అనుమతి ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపడంపై శాసనసభ వేదికగా దునుమాడాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను అతిక్రమించి తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేస్తోందని వాదిస్తున్న కేంద్రం.. ఆర్బీఐ ద్వారా రుణ సేకరణకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. దాంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమయ్యే పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల అమలుతోపాటు జీతభత్యాలకూ కటకటగా మారింది. ఈ నేపథ్యంలోనే, కేంద్రం వివక్షను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రుణాల సేకరణకు అనుమతి ఇవ్వకుండా సంక్షేమ పథకాల అమలునూ కేంద్రం అడ్డుకుంటోందన్న సంకేతాన్ని శాసనసభ వేదికగా ప్రజల్లోకీ పంపే ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 

Read more