దుబాయ్‌ చేరిన దందా డబ్బు

ABN , First Publish Date - 2022-08-06T08:40:38+05:30 IST

దుబాయ్‌ చేరిన దందా డబ్బు

దుబాయ్‌ చేరిన దందా డబ్బు

ఇటీవలే అక్కడకు వసూల్‌ రాజా భార్య

అప్పటికే హవాలా ద్వారా డబ్బు సంచులు

వారంపైగానే దుబాయ్‌లో ఆమె మకాం

అంతర్జాతీయ వ్యాపారానికి సన్నాహాలా?

అధికార వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ


కొద్దిరోజుల క్రితం ఓ ఉదయాన అమరావతి నుంచి భారీ బ్యాగులతో ఉన్న మూడు వాహనాలు సెక్యూరిటీ ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు వెళ్లాయి. అవి కొండాపూర్‌లోని ఓ విల్లాకు చేరాయి. ఆ వాహనాల్లో సంచులు భద్రంగా సర్దుబాటు చేయడానికి 45 నిమిషాలపైనే సమయం పట్టింది. ఇంతకీ ఆ సంచుల్లో ఏమున్నాయో తెలుసా?...నోట్ల కట్టలు. అవును. ఇది నిజమే. మరి ఈ డబ్బు విలువ ఎంత? ఆ సొమ్మును ఎక్కడ దాచారు? ఏం చేశారు.. ఈ వివరాలు తెలియాలంటే దుబాయ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యనేత వద్ద పనిచేస్తున్న ఓ అధికారి... అదేనండీ వసూల్‌ రాజా దుబాయ్‌లో ఏం వ్యాపారం ప్రారంభించారో తెలుసుకోవాలి. అమరావతిలో పనిచేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్న సొమ్మును విశాఖ, భోగాపురం, భీమిలి, హైదరాబాద్‌, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడు లు పెట్టారు. భారీగా భూములు పోగేశారు. ఇది చాలదనుకొని అంతర్జాతీయ స్థాయికి తన సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో వసూల్‌ రాజా ఉన్నారని తెలిసింది. దుబాయ్‌.. సంపన్నులు, విలాసపురుషుల ప్రపం చం. సామాన్యులు టూరిజం కోసం వెళితేనే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అలాంటిది వసూల్‌ రాజా అక్కడ వ్యాపార సామ్రాజ్యం స్థాపించేందుకు అడుగులు వేశారని తెలిసింది. దుబాయ్‌లో వ్యాపారం చేయాలంటే కనీసం రూ.500కోట్లయినా ఉండాలి. ధనాధన్‌ దందాలు చేసే వసూల్‌ రాజా వద్ద అంతకుమించిన సొమ్మే ఉందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే అక్కడ వ్యాపారం చేపట్టేందుకు ప్రణాళిక వేశారని చెబుతున్నారు. ఇందుకోసం ఇటీవల తన భార్యను దుబాయ్‌ పర్యటనకు పంపించారని తెలిసింది. అక్కడ ఆమె వారంపైనే మకాం వేశారని విశ్వసనీయ సమాచారం. అంతకుముందే హవాలా మార్గంలో డబ్బు దుబాయ్‌కి చేరిందని అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యజమాని టీమ్‌ ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆయనకు దుబాయ్‌తోపాటు అరబ్‌ దేశాల్లో జ్యువెలరీ వ్యాపారం, రియల్‌ ఎస్టేట్‌లో కాంటాక్ట్‌లు ఉన్నట్లు తెలిసింది. దుబాయ్‌లో వసూల్‌ రాజా చేసేది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమా లేక షాపింగ్‌ మాల్స్‌ నిర్వహణా అన్న అంశాలపై స్పష్టత లేదు. కానీ వ్యాపారం అనేది పక్కా గా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ఇటీవల అమరావతి నుంచి తరలివెళ్లిన డబ్బు సంచులు దుబాయ్‌ కరెన్సీ దిరామ్స్‌గా మార్చి హవాలా రూపంలో పెట్టుబడి పెట్టబోతున్నట్లు సమాచారం. నగదు మార్పిడి కూడా అధికారికం కాద ని, హవాలా మార్గమే అని తెలిసింది. ఇందుకు ముం బైకు చెందిన ఓ ప్రముఖ వస్త్రవ్యాపారి సహకరించినట్లు తెలిసింది. తనకు నమ్మిన బంటు అయిన ఓ రాష్ట్రేతర అధికారి ద్వారా ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సదరు అధికారి ఏపీలోనే కీలక విభాగంలో ఉన్నారు. ఆయనకు అర్హత లేకున్నా తెచ్చి అందలం ఎక్కించారు. ఇదిలాఉంటే, వసూల్‌రాజా వద్ద పనిచేసే మరో అధికారి విశాఖలో భూములు కొన్న విషయం వెలుగుచూసింది. భోగాపురం సమీపంలో ఆయన ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేశారని అధికారవర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. ఆ భూమి విలువ రూ.80 కోట్లపైనే ఉంటుందని అంచనా. తాను వసూల్‌రాజాగా మారడంతోపాటు తన వద్ద పనిచేసేవారితోనూ అదే పనిగా దందాలు చేయించి భూములు కొనిపించిన ఘనత ఈయనకే దక్కిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సంపాదించుకోవడం, కొనుక్కోవడంలో ఆయన ఈ విధంగా సమానత్వం చాటారని ఓ సీనియర్‌ అధికారి వ్యంగ్యంగా అన్నారు. 

Updated Date - 2022-08-06T08:40:38+05:30 IST