అప్పుల పాలు చేస్తున్న మద్దతు ధరలు

ABN , First Publish Date - 2021-09-16T06:12:09+05:30 IST

దేశవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు వ్యవసాయ ఖర్చులు, మరొకవైపు కుటుంబ ఖర్చులు పెరుగుతుండగా అందుకు అనుగుణమైన ఆదాయం అన్నదాతలకు...

అప్పుల పాలు చేస్తున్న మద్దతు ధరలు

దేశవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు వ్యవసాయ ఖర్చులు, మరొకవైపు కుటుంబ ఖర్చులు పెరుగుతుండగా అందుకు అనుగుణమైన ఆదాయం అన్నదాతలకు లభించడం లేదు. తత్ఫలితంగా రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతుల రుణభారం ఎక్కువగా ఉంది. పాలకులు అనుసరిస్తున్న విధానాలే అన్నదాతల అవస్థలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.


జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే నివేదిక ప్రకారం 2018 నాటికి దేశంలో ఒక్కో రైతు కుటుంబం అప్పు సగటున రూ. 74,121 కి చేరింది. 2013 నాటి రూ.47,000 అప్పుతో పోలిస్తే ఆ పెరుగుదల 57 శాతంగా ఉంది. రైతు కుటుంబాల రుణభారంలో రూ. 2,45,554తో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రూ. 2,42,482తో కేరళ ద్వితీయ స్థానంలో ఉంది. రూ. 2,03,249తో పంజాబ్ మూడో స్థానంలో ఉండగా, రూ. 52,113తో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది. ఆంధ్రాలో 93.2 శాతం, తెలంగాణలో 92.7 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి.


ఏటేటా పెరుగుతున్న పంట ఖర్చులు, దేశీయ విత్తనాలు వినియోగించకుండా విదేశీ సంకరజాతి విత్తనాలు అధిక ధరలకు కొనుగోలు చేయడం, ఎరువులు, పురుగు మందుల వాడకం అధికం కావడం, వాటి ధరలు పెరుగుతూ ఉండడం, డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల, పంట సబ్సిడీల తగ్గుదల, పిల్లల చదువుల ఖర్చు మొదలైన క్లిష్ట పరిస్థితులలో అప్పులు చేయాల్సిన పరిస్థితి రైతులకు అనివార్యమవుతోంది. 


పెరుగుతున్న సేద్యపు ఖర్చులకు అనుగుణంగా రైతులు పండించే పంటలకు అనుకూలమైన ధరలు లభించడం లేదు. వరి ఉత్పత్తి ఖర్చు క్వింటాల్ కు రూ.2,210గా వ్యవసాయ నిపుణుల అధ్యయనాలు, వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంచనా వ్యయానికి 50 శాతం అదనంగా చేర్చి 3,315 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి. కేంద్రప్రభుత్వం మాత్రం నిపుణులు చెప్పిన దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రూ. 1880 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర రైతాంగానికి ప్రయోజనం లేకుండా పోయింది. కౌలు రైతులకు నష్టదాయకమైంది. ఫలితంగానే రైతులు నష్టపోయి అప్పుల పాలవుతున్నారు.


సేద్యం ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని పరిశీలిస్తే రైతులు ఎలాంటి దుస్థితిలో ఉన్నదీ తెలుస్తుంది. వ్యవసాయం ద్వారా ఒక రైతు పొందుతున్న సగటు వార్షిక ఆదాయం 20 వేలు మాత్రమే. రైతు కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ. 1,666 అని 2016 సంవత్సర ఆర్థిక సర్వే తెలిపింది. నాల్గవ తరగతి ప్రభుత్వోద్యోగి నెలసరి ప్రాథమిక ఆదాయం రూ.18 వేలు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆహార పంటలు పండించే రైతులకు సగటు నెలసరి ఆదాయం 1,666 రూపాయలు. ఇలాంటి ఆదాయంతో గ్రామీణ ప్రాంతాలలోని 70 శాతం ప్రజల జీవనం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు 2015లో ప్రచురించిన సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇప్పుడు ఇది ఇంకా తగ్గి ఉంటుందనడంలో సందేహం లేదు.


వ్యవసాయం దండగగా మారి, అప్పుల్లో కూరుకుపోయి దానినుంచి బయటపడే మార్గం కనిపించక, బ్యాంకుల, వడ్డీ వ్యాపారుల వేధింపులు, అవమానాలు తట్టుకోలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లక్షలాది రైతులు ఆ విధంగా ప్రాణాలు కోల్పోయారు. రైతుల మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ పంజాబ్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థ ఒకటి సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన నివేదికలో వ్యవసాయానికి సంబంధంలేని ఇతర కారణాల వలన రైతుల ఆత్మహత్యలు సాగుతున్నాయని పేర్కొంది. అన్నదాతల ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరూ దెయ్యం పట్టినవారని మధ్యప్రదేశ్ హోంమంత్రి ఒక లిఖితపూర్వక సమాధానంలో వ్యాఖ్యానించారు! ఈ వ్యాఖ్యలు గమనిస్తే వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల ఎడల మోదీ ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైంది.


వ్యవసాయం నష్టదాయకంగా మారడానికి, రైతులు అప్పుల్లో కూరుకుపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. దేశ, రాష్ట్ర పాలకులకు రైతాంగ ప్రయోజనాల కన్నా, సామ్రాజ్యవాదుల, వారి బహుళజాతి సంస్థల ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి. వ్యవసాయ రంగంలో వారి ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలు అమలు పరుస్తున్నాయి. సాగునీటి సమస్య పరిష్కరించకపోవడం, పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్‌ సౌకర్యం కల్పించకపోవడం, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు తగ్గే చర్యలు తీసుకోకపోవడం బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసమే. ఇలాంటి విధానాలతో వ్యవసాయాన్ని దండగగా మార్చి చిన్న, సన్నకారు రైతులు సేద్యం నుంచి వైదొలగేలా చేసి, వారి భూములను కార్పొరేట్‌ సంస్థల పరం చేయపూనుకొంటున్నాయి.


పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్‌ సౌకర్యం, ఎరువుల ధరల తగ్గింపు, తగిన విధంగా సంస్థాగత రుణాలు, సబ్సిడీల పెంపుదల జరిగినప్పుడే రైతాంగం అప్పుల నుంచి బయటపడతారు. రైతాంగం ఆ దిశగా ఆందోళన చేయాలి.

బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, రైతు కూలీ సంఘం

Updated Date - 2021-09-16T06:12:09+05:30 IST