అన్నీ బాగుంటేనే అప్పు

ABN , First Publish Date - 2020-09-13T05:59:18+05:30 IST

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ చాలా ముఖ్యం.

అన్నీ బాగుంటేనే అప్పు

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఒక్కటే సరిపోదు.. 

వయసు, ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం తదితర అంశాలూ అంతే కీలకం


బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌  చాలా ముఖ్యం. స్కోర్‌ ఎంత ఎక్కువుంటే.. రుణ మంజూరుకు అవకాశాలు అంతగా మెరుగవుతాయి. అంతేకాదు, చౌక వడ్డీ రేటుకే రుణం లభిస్తుంది. అయితే, మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే వెంటనే రుణం ఇచ్చేస్తారని అనుకుంటే మాత్రం పొరపాటే. క్రెడిట్‌ స్కోర్‌తో పాటు మరిన్ని కీలకాంశాలను పరిశీలించాకే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. ఆ వివరాలు.. 


వయసు 

రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ప్రస్తుత వయసుతో పాటు రుణ కాలపరిమితి తీరే సమయానికి వయసు ఎంతనేదీ ముఖ్యమే. రుణ అర్హతకు నిర్దేశించే కనీస, గరిష్ఠ వయసు శ్రేణిలో ఉండే వారికే రుణం మంజూరు చేస్తారు. సాధారణంగా పదవీ విరమణ వయసుకు దగ్గరవుతున్న వారికి దీర్ఘకాలిక రుణాలు లభించడం కష్టమే. రుణగ్రహీత పదవీ విరమణ నాటికే తామిచ్చే రుణం కాలపరిమితి పూర్తవుతుందా..? లేదా..? అని బ్యాంకులు గమనిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో యుక్త వయసులో ఉండి, స్థిరమైన ఆదాయం కలిగిన వ్యక్తిని సహ-దరఖాస్తుదారుగా చేర్చడం వల్ల రుణ అర్హత, మంజూరు అవకాశాలు మెరుగుపడతాయి. 


ఆదాయం 

కనీస ఆదాయ నిబంధనల్లో అర్హత సాధించని వారికి బ్యాంకులు రుణాన్ని తిరస్కరిస్తాయి. రుణ దరఖాస్తుదారు ప్రాంతాన్ని (మెట్రో, చిన్న నగరం, పట్టణాలు, గ్రామం), రుణ  మొత్తాన్ని బట్టి కనీస ఆదాయ స్థాయిని నిర్దేశిస్తాయి. ఇది బ్యాంక్‌ను బట్టి మారుతుంటుంది. ఈ విషయంలో మీరు అర్హులా కాదా అని తెలుసుకోవడంతో పాటు ఆయా బ్యాంకుల కనీస అర్హత స్థాయిలను పోల్చి చూసుకునేందుకు ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించవచ్చు. 


ఉద్యోగం 

రుణగ్రహీత వయసు, ఆదాయంతో పాటు చేస్తున్న ఉద్యోగం, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? ఉద్యోగ స్థిరత్వం సైతం ముఖ్యమే. ఉదాహరణకు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్‌, ఎంఎన్‌సీల్లో పనిచేసేవారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఎక్కువగా మొగ్గు చూపుతాయి. చిన్నాచితకా కంపెనీల ఉద్యోగులకు, చేస్తున్న పనిలో రిస్క్‌ ఎక్కువగా ఉన్న వారికి రుణం లభించే అవకాశాలు తక్కువ. తరుచూ ఉద్యోగం మారుతుండే వారికీ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఇష్టపడవు. 


ఎఫ్‌ఓఐఆర్‌ 

ఫిక్స్‌డ్‌ ఆబ్లిగేషన్‌ టు ఇన్‌కమ్‌ రేషియో (ఎఫ్‌ఓఐఆర్‌) మరో కీలకాంశం. ఎఫ్‌ఓఐఆర్‌ అంటే.. నెలవారీ ఆదాయంలో ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లుల కోసం జరిపే చెల్లింపుల వాటా. ఎఫ్‌ఓఐఆర్‌ 40-50 శాతం మించని వారికే బ్యాంకులు రుణాలిస్తాయి. అంటే, మీ ఆదాయంలో ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లుల వాటా సగానికి మించకుండా ఉండేటట్లయితేనే రుణమిస్తాయి. ఒకవేళ ఎఫ్‌ఓఐఆర్‌ పరిమితి దాటుతుందని మీకన్పిస్తే, రుణ మంజూరు అవకాశాలను మెరుగుపర్చుకునేందుకున్న ప్రత్యామ్నాయాలు.. 

అంతక్రితమే తీసుకున్న రుణాన్ని పాక్షికంగా లేదా  మొత్తంగా చెల్లించేయండి. 

దీర్ఘకాల రుణాలను ఎంచుకోవడం లేదా తక్కువ ఈఎంఐని ఎంపిక చేసుకోవడం 


రుణ హామీ 

ఇతరుల రుణానికి హామీదారు (గ్యారెంటర్‌)గా ఉన్నారంటే, ఆ అప్పు భారం మీపైనా ఉన్నట్టే లెక్క. ఒకవేళ రుణగ్రహీత డిఫాల్ట్‌ అయితే, ఆ అప్పు మీరు తీర్చాల్సి వస్తుంది. మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎవరికైనా హామీదారుగా ఉన్నారా..? అని బ్యాంక్‌లు పరిశీలిస్తాయి. మీ భవిష్యత్‌ ఆర్థిక అవసరాలు, రుణం తీసుకునే సంభావ్యతను జాగ్రత్తగా సమీక్షించుకున్న తర్వాతే ఇతరులు తీసుకునే రుణాలకు గ్యారెంటీ ఇవ్వడం మేలని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఎవరికైనా హామీదారుగా ఉంటే, వారు ఈఎంఐలు సక్రమంగా కడుతున్నారా..? లేదా..? అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. వారు సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోయినా లేదా డిఫాల్ట్‌ అయినా మీ క్రెడిట్‌ స్కోర్‌ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 


క్రెడిట్‌ స్కోర్‌ ముఖచిత్రం 


స్కోర్‌ శ్రేణి 300-900 పాయింట్లు 

300 పాయింట్లు పేలవం, ప్రతికూలం 

అత్యుత్తమం 900 పాయింట్లు

650-700 పాయింట్లు బ్యాంకుల రుణాలకు కనీస అర్హత 


బ్యూరోను బట్టి స్కోరు మారున్‌ 

క్రెడిట్‌ బ్యూరో కంపెనీని బట్టి  స్కోర్‌ మారుతుంటుంది. ఈ వ్యత్యాసం మహా అయితే, 100 పాయింట్ల లోపే ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే, ఈ విషయంపై బ్యాంకులకూ అవగాహన ఉంటుంది. కాబట్టి, మీరు క్రెడిట్‌ స్కోర్‌ పొందిన బ్యూరోను బట్టి రుణదాతలు మీ పరపతి స్థాయిని అంచనా వేయగలరు. 


ఈ తప్పులతో తగ్గేను స్కోర్‌ 

మీ రాబడి, సంపదకు క్రెడిట్‌ స్కోర్‌తో సంబంధం లేదు. బాగానే ఆర్జిస్తున్నప్పటికీ.. క్రెడిట్‌ స్కోర్‌ మాత్రం ఇంకా తక్కువగానే ఉండవచ్చు. మిత ఆదాయం ఉన్నవారిలోనూ కొందరు మెరుగైన స్కోర్‌ కలిగి ఉండవచ్చు. అంతేకాదు, ఈ రోజు మెరుగ్గా ఉన్న క్రెడిట్‌ స్కోర్‌.. భవిష్యత్‌లోనూ అదే స్థాయిలో కొనసాగుతుందనేం లేదు. మీరు చేసే కొన్ని తప్పులు స్కోర్‌పైనా ప్రభావం చూపుతాయి. మీ పరపతి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.


నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపులను తరచుగా జాప్యం చేస్తే, మీ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని రుణాల విషయంలో క్రెడిట్‌ స్కోర్‌ తగ్గితే మీపై వడ్డీ భారం పెరిగే అవకాశమూ ఉంటుంది. 

రుణ భారం మీ సహేతుక  స్థాయిని మించిన పక్షంలోనూ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. ఎందుకంటే, రుణ భారం పెరిగే కొద్దీ తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గుతుంది. డిఫాల్ట్‌ రిస్క్‌ పెరుగుతుంటుంది. 

తరచుగా మీ క్రెడిట్‌ కార్డును పూర్తి లిమిట్‌ వరకు ఉపయోగిస్తున్నారంటే, మీకు ఆర్థిక ఇబ్బందులున్నట్లు అర్ధం. ఉదాహరణకు, మీ క్రెడిట్‌ కార్డు లిమిట్‌ రూ.లక్ష అనుకుందాం. ప్రతినెలా రూ.50 వేలకు పైగా కార్డు ద్వారా వెచ్చిస్తున్నారంటే.. మీ పరపతిని 50 శాతానికి పైగా ఉపయోగిస్తున్నట్లు లెక్క. ఇది క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుదలకు దారితీయవచ్చు. పరపతి సామర్థ్యంలో 30 శాతానికి మించి వినియోగించడమంటే, బ్యాంక్‌ల దృష్టిలో ఆర్థిక క్రమశిక్షణ కట్టు తప్పినట్లే. 

డిఫాల్ట్‌ అయిన పక్షంలో బ్యాంక్‌లతో చేసుకునే సెటిల్‌మెంట్‌ కూడా క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు, భవిష్యత్‌లో మళ్లీ రుణాలు లభించడమూ కష్టమే. 

Updated Date - 2020-09-13T05:59:18+05:30 IST