రణం వెనక రుణం!

ABN , First Publish Date - 2022-07-26T08:07:55+05:30 IST

ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శల తీవ్రత పెంచడానికి కారణం ఏమిటి!? రాష్ట్రం ఎడాపెడా అప్పులు చేయకుండా ఆంక్షలు విధించడమేనా

రణం వెనక రుణం!

తెలంగాణ అప్పులపై ప్రధాని మోదీ ఆంక్షలు.. సీఎం కేసీఆర్‌ ఆర్థిక వనరులపై ఉక్కుపాదంకొందరు కాంట్రాక్టర్లపై ఈడీ, సీబీఐ దాడులు.. కేసీఆర్‌కు దూరమైన మరికొందరుఎడాపెడా అప్పులిచ్చిన బ్యాంకులపైనా ఆగ్రహం.. ఆంక్షలతో పరిమితమైన ఆదాయ వనరులుజీతాలూ, పథకాలకు నిధుల్లేని పరిస్థితి.. అందుకే మోదీపై కేసీఆర్‌ వ్యక్తిగత దాడిబీజేపీ వరుస విజయాలతో ఆత్మరక్షణ


న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శల తీవ్రత పెంచడానికి కారణం ఏమిటి!? రాష్ట్రం ఎడాపెడా అప్పులు చేయకుండా ఆంక్షలు విధించడమేనా!? గ్యారంటీ అప్పులను కూడా బడ్జెట్‌ అప్పులతో లింక్‌ పెట్టడమేనా!? అప్పులు, చెల్లింపులు, బకాయిలు తదితర వివరాలను కేంద్రానికి సమర్పించాలని నిర్దేశించడమేనా!? తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించడమేనా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వంలోని అధికార వర్గాలు! కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పేరిట తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా తప్పించుకోవడం ప్రధాని మోదీ దృష్టికి వచ్చిందని, దాంతో, అప్పులకు కళ్లెం వేయాలని ఆయన

నిర్ణయించారని, అప్పటి నుంచే మోదీపై కేసీఆర్‌ విమర్శల తీవ్రతను పెంచారని కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు అయితే..

ప్రస్తుతం ఈ మొత్తం రూ.4 లక్షల కోట్లకుపైగా పెరిగిపోవడాన్ని మోదీ సీరియ్‌సగా తీసుకున్నారని వివరించారు. నిజానికి, తెలంగాణలో ఎన్నికల వ్యయం భారీగా పెరిగిపోవడానికి కారణం ఏమిటి!? అధికార పార్టీ ఇంత పెద్దఎత్తున నిధులను ఏవిధంగా ఖర్చు పెట్టగలుగుతోంది? అన్న సందేహాలు మోదీకి వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు. దాంతో, కాళేశ్వరం నిధుల పేరిట కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టు కార్పొరేషన్‌, మిషన్‌ భగీరథ కోసం తెలంగాణ నీటిపారుదల సరఫరా కార్పొరేషన్‌, ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల కోసం తెలంగాణ జల వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి యూనియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, నబార్డ్‌, రూరల్‌ ఎలక్ర్టిఫికేషన్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థల ద్వారా భారీఎత్తున రుణాలు చేసిన విషయాన్ని వారు మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర రుణాలపై పరిమితి విధించే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం నుంచి వచ్చిన ఒక అధికారి సలహా మేరకు కేసీఆర్‌ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేయడం ప్రారంభించిందని, రిజర్వ్‌ బ్యాంకుకు కూడా తెలియకుండా బ్యాంకుల నుంచి ఈ అప్పులు చేసిందని వివరించినట్లు సమాచారం. వారు చెప్పిన వివరాల మేరకే తెలంగాణ అప్పులపై పరిమితి విఽధించాల్సిందిగా ప్రధాని మోదీ ఆదేశించారని తెలుస్తోంది. రాష్ట్రాల మితిమీరిన అప్పులకు కళ్లెం వేయడంలో భాగంగా కార్పొరేషన్ల పేరిట చేసే గ్యారంటీ అప్పులను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కిందకు తీసుకొచ్చారు. వాటిని బడ్జెట్‌ అప్పులతో లింకు పెట్టారు. ఈ మేరకు అప్పులపై ఆంక్షలు విధిస్తూ ఈ ఏడాది మార్చి 31న తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ పంపింది. అప్పులు, బకాయిలు, చెల్లింపుల వివరాలను కేంద్రానికి సమర్పించాలని అందులో పేర్కొంది. నిజానికి, అప్పులపై పరిమితి విధిస్తూ కేంద్రం విధించిన ఆంక్షలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయి. గ్యారంటీ అప్పులను బడ్జెట్‌ అప్పులతో కలుపుతున్నట్లు ఇతర రాష్ట్రాలకు కూడా కేంద్రం లేఖలు పంపింది. అయితే, తెలుగు రాష్ట్రాలు మినహా చాలా వరకూ ఇతర రాష్ట్రాల్లో కార్పొరేషన్ల ద్వారా గ్యారెంటీ అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకున్నా అవి పరిమితమే. దాంతో, కేంద్రం ఆంక్షలతో వాటికి పెద్దగా ఇబ్బంది కలగలేదు.


కానీ, కార్పొరేషన్ల పేరిట భారీఎత్తున అప్పులు చేయడంతో తెలంగాణకు మింగా కక్కలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే, ప్రాజెక్టులు లాభసాటి అవుతాయా కాదా? అన్నది కూడా చూడకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందన్న కారణంతో అనేక బ్యాంకులు అప్పులు ఇవ్వడంపైనా కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో, ఆర్బీఐ ప్రమేయం లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయకుండా చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది. ఆర్బీఐతో కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్న తర్వాతే బ్యాంకులు అప్పులు ఇవ్వాలని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది. అప్పులపై ఆంక్షల చట్రం బిగియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు పరిమితమైపోయాయి. అప్పటి నుంచే ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బకాయిలతోపాటు డ్వాక్రా రుణాలపై వడ్డీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను అమలు చేయలేని స్థితిలో పడిందని తెలుస్తోంది. కొందరు కాంట్రాక్టర్లపై ఈడీ, సీబీఐ దాడులు జరగడం, కొందరు కేసీఆర్‌కు దూరం కావడంతో పరిస్థితి ఇంకా విషమించిందని, అప్పటి నుంచే కేసీఆర్‌ మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించడం ప్రారంభించారని అధికార వర్గాలు వివరించాయి. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఆయన మరింత ఆత్మ రక్షణలో పడ్డారని, అందువల్ల పరిస్థితి మరింత విషమించకముందే మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరులోపే తెలంగాణలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తారని భావిస్తున్నట్లు బీజేపీ నేత ఒకరు చెప్పారు.


మార్చి 31న తెలంగాణకు రాసిన లేఖలో పేర్కొన్న ఆంక్షల్లో ప్రధానమైనవి ఇవీ..

2022-23 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన జీఎ్‌సడీపీ రూ.12,20,804 కోట్లు. అందులో తెలంగాణ అప్పుల పరిమితి 3.5ు అంటే.. రూ.42,728 కోట్లు.

విద్యుత్తు రంగంలో నిర్దేశించిన సంస్కరణలను అమలుచేస్తే మరో0.5ు అనుమతించే చాన్స్‌ ఉంది.

ఓపెన్‌ మార్కెట్‌ అప్పులు, ఆర్థిక సంస్థల నుంచి రు ణాలు, ఎన్‌ఎ్‌సఎస్‌ నిధి రుణాలు, కేంద్ర ప్రభుత్వ రుణాలు, ఇతర అప్పులకూ పరిమితి వర్తిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర సంస్థల ద్వారా బడ్జెట్‌తో సంబంధం లేకుండా అప్పులు చేసి వాటిని నికర రుణ పరిమితి పరిధిలోకి రాకుండా చేస్తున్నారు. తద్వారా, ఎఫ్‌ఆర్‌బీఎం లక్ష్యాలను నీరుగారుస్తున్నారు. కనక, ఆ రుణాలను కూడా బడ్జెట్‌లోనే చూపించాలి. 

Updated Date - 2022-07-26T08:07:55+05:30 IST