డెబిట్‌ కార్డు దొంగల అరెస్ట్‌.. లక్షా పదివేలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-27T12:46:13+05:30 IST

ఇద్దరు ఏటీఎం కార్డు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు....

డెబిట్‌ కార్డు దొంగల అరెస్ట్‌.. లక్షా పదివేలు స్వాధీనం

హైదరాబాద్ సిటీ/హైదర్‌నగర్‌ : ఇద్దరు ఏటీఎం కార్డు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏటీఎం సెంటర్ల వద్ద  మర్చిపోయిన కార్డులను తస్కరించి స్వైపింగ్‌ మెషిన్‌ద్వారా వారి ఖాతాల్లో నగదు కాజేస్తున్న ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లి సాయిప్రశాంత్‌నగర్‌కు చెందిన  రెడ్డి ఫణీంద్ర ఈనెల 3న హెచ్‌ఎంటీ హిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో నగదు డ్రా చేసుకొని కార్డు మర్చిపోయాడు. అదే రోజు ఆ కార్డు నుంచి మూడు దఫాలుగా రూ. 10,472 డెబిట్‌ అయినట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వచ్చాయి. 


బాధితుడు వెంటనే కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్డును ఎక్కడ ఉపయోగించారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టి ఎల్లమ్మబండలో నివాసముంటున్న పోతురాజు కమల్‌ రాజు, కొంపల్లి మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వైఫై ఉన్న కార్డులను స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా నగదు డ్రా చేసి జల్సాలు చేస్తున్నట్టు తేలింది. ఆ ఇద్దరి నుంచి రూ.1,10,00 నగదు, 54 డెబిట్‌ కార్డులు, స్వైపింగ్‌ మిషన్‌ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు ఎక్కడైనా మర్చిపోయినా వెంటనే బ్లాక్‌ చేసుకోవాలని సీఐ లక్ష్మీనారాయణ సూచించారు. వీరిపై కేపీహెచ్‌బీలో ఒకటి, బాచుపల్లి పీఎస్‌ పరిధిలో రెండు కేసులు నమోదైనట్టు తెలిపారు.

Updated Date - 2021-07-27T12:46:13+05:30 IST