తగ్గిన మామిడి దిగుబడి

ABN , First Publish Date - 2022-05-15T05:55:56+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతులను వాతావరణం బాగా దెబ్బతీసింది.

తగ్గిన మామిడి దిగుబడి
కాపు లేని మామిడి తోటలు

- మంచు దెబ్బకు పడిపోయిన మామిడి కాపు

- రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా రాని వైనం

చోడవరం, మే 14: జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతులను వాతావరణం బాగా దెబ్బతీసింది. మంచు దెబ్బకు జిల్లాలో ఈ ఏడాది మామిడి కాపు బాగా పడిపోయింది. జిల్లాలో 35 వేల 625 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం మండలంలోని అడ్డూరు, మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ, కె.కోటపాడు తదితర ప్రాంతాల నుంచి ఏటా వివిధ రాష్ట్రాలకు భారీగానే మామిడి ఎగుమతి అవుతుంటుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన పూత చాలా వరకు ఆలస్యమైంది,. ఆ తరువాత పూత బాగానే వచ్చినప్పటికీ, ఆ సమయంలో భారీగా పడిన మంచు వల్ల  మామిడి పూత కాయ కట్టకుండానే రాలిపోయింది.  కాపు లేకపోవడంతో సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చులు, కౌలు డబ్బులు కూడా కలిపి ఈ ఏడాది తమకు నష్టం తప్పితే లాభం లేదని మామిడి రైతులు వాపోతున్నారు. 

తగ్గిన దిగుబడి

జిల్లాలో మామిడి దిగుబడి భారీగా పడిపోవడంతో మార్కెట్‌లో మామిడి పండ్లు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏ మామిడి తోటలో చూసినా కాయలు కనిపించని పరిస్థితి. వాతావరణం అంతా అనువుగా ఉండి కాపు బాగా ఉంటే హెక్టారు మామిడి తోటకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. ఏడాదికి జిల్లాలో సుమారుగా లక్షా 50 వేల టన్నుల మామిడి వరకు  దిగుబడి ఉంటుందని అంచనా. అయితే ఈ ఏడాది దిగుబడి సగానికి పైగా పడిపోవడంతో తోటల్లో కాపు లేకపోవడంతో కనీసం 50 వేల టన్నులు కూడా దిగుబడి కూడా లేదని రైతులు వాపోతున్నారు. 


పెట్టుబడి ఖర్చులు పోయినట్టే..

5 ఎకరాల మామిడి తోటకు సుమారుగా రూ.30 వేలు వరకూ ఖర్చయింది. తీరా చూస్తే తోటలో ఒక్కటంటే ఒక్క కాయ కూడా కాయలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. కనీసం కొద్దిగానైనా కాయలు ఉండేవి. ఈ ఏడాది మాత్రం వాతావరణం పూర్తిగా మమ్మల్ని దెబ్బతీసింది.  తోటపై పెట్టిన రూ. 30వేలు ఖర్చులో ఒక్క రూపాయి కూడా ఈ ఏడాది లేనట్టే. మామిడి తోటపై వచ్చిన ఆదాయం పోగా, ఈ ఏడాది పెట్టుబడి డబ్బులు కూడా పోవడం వల్ల నష్టం తప్పడం లేదు. 

- - దండా జగదీశ్‌, మామిడి  రైతు, చోడవరం



వ్యాపారాలు లేక మామిడీలా!

- దిగుబడి తగ్గి, ధరలు పెరగడంతో వ్యాపారులు కుదేలు

నక్కపల్లి, మే 14: చినదొడ్డిగల్లు సెంటర్‌ నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు రోజుకు 80 నుంచి 100 వాహనాలు, ట్రక్కులు, లారీల్లో మామిడి కాయలను ఎగుమతులు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. దీంతో మామిడి కాయల లోడింగ్‌, అన్‌లోడింగ్‌తో కళకళలాడే మామిడి ఎగుమతి కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడి దిగుబడి బాగా తగ్గింది. దీంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ బంగినపల్లి రకం మామిడి కాయలు టన్ను సుమారు రూ.19 వేల నుంచి రూ.20 వేలు, సువర్ణరేఖ రకం టన్ను రూ. 21 వేల నుంచి రూ.22 వేలు, కలెక్టర్‌ రకం మామిడికాయలు టన్ను రూ.6 వేలకు విక్రయించేవారు. అయితే ఇప్పుడు దిగుబడి లేక బంగినపల్లి రకం ధర టన్ను రూ. 40 వేల నుంచి రూ.45 వేలు, సువర్ణ రేఖ ధర టన్ను రూ.50 నుంచి రూ.55 వేలు, కలెక్టర్‌ రకం కాయలు టన్ను రూ.20 వేలు ధర పలుకుతుందని వ్యాపారులు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ నుంచి రోజుకు సగటున 10 వాహనాల్లో మాత్రమే మామిడి కాయలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. తుఫాన్‌ కారణంగా గత నాలుగు రోజుల నుంచి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి అనేక మంది వ్యాపారులు ట్రక్కులు, వ్యాన్లలో చినదొడ్డిగల్లు మామిడి వ్యాపార కేంద్రాల వద్దకు వచ్చారు. కానీ ఇక్కడ మామిడి కాయలు అందుబాటులో లేకపోవడం, తుఫాన్‌ కారణంగా వారు నాలుగు రోజుల నుంచి ఇక్కడే వుండిపోయారు.

దేశ వ్యాప్తంగా ఎగుమతులు

చినదొడ్డిగల్లు జంక్షన్‌ నుంచి బిహార్‌, పశ్చిమ బెంగాళ్‌, ఒడిశా, మహరాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, అసోం, హిమాచల ప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు మామిడి ఎగుమతులు జరిగేవి. ఈ ప్రాంతానికి చెందిన వ్యాపారులు తూర్పుగోదావరి జిల్లా, విశాఖ జిల్లాల్లోలోని పలు ప్రాంతాల్లో రైతుల నుంచి మామిడి కాయలు కొని చినదొడ్డిగల్లు కేంద్రాలకు తీసుకువచ్చేవారు. ఇక్కడి నుంచి నేరుగా గ్రేడింగ్‌ చేసి ఇండెంట్లపై కొందరు, డైరెక్ట్‌ సేల్‌ పద్ధతిలో మరికొందరు విక్రయించేవారు. అయితే ఈ ఏడాది కనీస స్థాయిలో  కూడా వ్యాపారం లేదని, ఎగుమతులు పడిపోయాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-----

ఈ ఏడాది వ్యాపారం బాగోలేదు 

కరోనా సమయంలో కూడా కొంత మేర వ్యాపారం సాగించాం. కానీ ఈ ఏడాది వ్యాపారం బాగోలేదు. నేను 20 ఎకరాల్లో మామిడి తోటలపై పెట్టుబడులు పెట్టాను. ఎకరానికి కనీసం రూ.10వేలు చొప్పున ఖర్చయింది. కానీ ఎకరానికి 3 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించలేదు. షెడ్ల నిర్మాణాలకు, నిర్వహణ, విద్యుత్‌ చార్జీలు, సిబ్బందికి కూలీ ఇతర ఖర్చులన్నీ బోలెడు అవుతున్నాయి. 

- - వెలగా బాబ్జీ, మామిడి వ్యాపారి


కేంద్రాల నిర్వహణ కష్టంగా ఉంది 

ఇక్కడి నుంచి ఇతర రాష్ర్టాలకు వంద లోడుల మామిడి కాయలను ఎగుమతి చేసేవాళ్లం. ఈ సంవత్సరం అందులో కనీసం 25 శాతం కూడా లేదు. కేంద్రాల నిర్వహణ చాలా కష్టంగా వుంది. మా కేంద్రానికి మామిడి కాయలు కొనేందుకు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వ్యాపారులు కూడా ఇక్కడే వుండిపోయారు. రోజంతా సేకరించినా ఒక లోడు మామిడి కాయలు రావడం లేదు. 

- తోట సత్తిబాబు, మామిడి వ్యాపారి 








Updated Date - 2022-05-15T05:55:56+05:30 IST