Abn logo
Sep 19 2021 @ 00:29AM

పింఛన్ల తొలగింపుపై కౌన్సిల్‌లో రగడ

మేయర్‌ పోడియం వద్ద ఆందోళన చేస్తున్న విపక్షాలు

జీవీఎంసీ సమావేశంలో చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

ససేమిరా అన్న మేయర్‌ 

పోడియాన్ని ముట్టడించిన ప్రతిపక్ష సభ్యులు

నినాదాలతో దద్దరిల్లిన కౌన్సిల్‌ హాల్‌

జీరో అవర్‌లో చర్చిద్దామని హామీ ఇవ్వడంతో శాంతించిన కార్పొరేటర్లు

పారిశుధ్యలోపం, దోమలు, డెంగ్యూ విజృంభణపై అధికారులను నిలదీసిన ‘పల్లా’

అన్ని వార్డుల్లో డెంగ్యూ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: గంగారావు

నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల లీజుల కొనసాగింపు: మూర్తియాదవ్‌

కుక్కలకు పార్కులుకాదు... రోడ్లు బాగుచేయండి: స్టాలిన్‌

శ్మశానాన్ని కబ్జా చేసిన ఎంపీపై చర్యలు తీసుకోండి: జగన్నాథం

28 అంశాలకు ఆమోదం


విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ కౌన్సిల్‌ సాధారణ సమావేశం అధికార, విపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాల మధ్య శనివారం వాడీవేడీగా జరిగింది. సమావేశం ప్రారంభమైన వెంటనే అజెండాలోని అంశాలపై చర్చకు ఒక్కో అంశాన్ని సభ్యులకు చదివి వినిపించాలని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి.. అధికారులను ఆదేశించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లు అభ్యంతరం చెబుతూ నగరంలో చాలా మందికి పింఛన్లు రద్దుకావడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై చర్చించిన తర్వాతే అజెండాలోని అంశాలపై చర్చకు వెళ్లాలని పట్టుబట్టారు. ఇందుకు మేయర్‌ ససేమిరా అనడంతో విపక్ష సభ్యులంతా  పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో గందరగోళం ఏర్పడడంతో పింఛన్ల అంశాన్ని జీరో అవర్‌లో చర్చిద్దామని మేయర్‌ హామీ ఇచ్చారు. దీంతో విపక్ష సభ్యులు శాంతించారు.

పారిశుధ్యలోపం, దోమలు, డెంగ్యూపై నిలదీత

మలేరియా విభాగంలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 35 మంది హెల్త్‌ అసిస్టెంట్‌లు, 50 మందికిపైగా ఫీల్డ్‌ వర్కర్లను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించేందుకు వీలుగా తీర్మానం ప్రవేశపెట్టగానే విపక్ష సభ్యులతోపాటు అధికార పార్టీ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో దోమల నియంత్రణకు 450 మందిని అవుట్‌ సోర్సింగ్‌లో నియమించారని, వారంతా ఎక్కడ పనిచేస్తున్నారని టీడీపీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. నగరంలో అర్బన్‌ హెల్త్‌సెంటర్లలో సిబ్బంది లేరని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పుడో వాహనాలు వస్తాయని చెప్పి, ఉన్న చెత్త వాహనాలను ఆపేయడంతో చెత్త తరలింపు జరగడం లేదన్నారు. దీని వల్ల దోమలు పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా విజృంభిస్తోందని ఆరోపించారు. తన వార్డులోనే రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు డెంగ్యూతో మృతి చెందారని మేయర్‌కు వివరించారు. దీనికి కమిషనర్‌ సృజన సమాధానమిస్తూ డెంగ్యూ నిర్ధారణ కేజీహెచ్‌లో మాత్రమే చేస్తారని, ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీఎం కార్పొరేటర్‌ బి.గంగారావు మాట్లాడుతూ డెంగ్యూ నిర్ధారణ కోసం కేజీహెచ్‌కి ప్రతి  గంటకు 145 మంది వెళుతున్నారని, నగరవాసులంతా కేజీహెచ్‌కు వెళితే అక్కడ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రతి వార్డులో ఒక డెంగ్యూ నిర్ధారణ, చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలపై అన్నిరకాల పన్నులు వేస్తున్నప్పుడు దోమల నియంత్రణకు స్పెషల్‌డ్రైవ్‌ పెట్టి చెత్తను తొలగించాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.4.5 కోట్లతో చెత్త డబ్బాలు కొనుగోలుపై జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ అభ్యంతరం తెలిపారు. నగర పరిధిలోని అనేక కంపెనీలు, పరిశ్రమలకు జీవీఎంసీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందున, కమిషనర్‌ చొరవ తీసుకుంటే సీఎస్‌ఆర్‌ కింద చెత్త డబ్బాలను సమకూర్చుతారు కాబట్టి 15వ ఆర్థిక సంఘం నిధులను అభివృద్ధి పనులకు వెచ్చించాలని సూచించారు. నాడు-నేడు కింద పాఠశాలలకు రంగులు వేస్తున్నారే తప్ప తరగతి పైకప్పుల గురించి పట్టించుకోవడంలేదని, శ్లాబ్‌ పెచ్చులూడి పడిపోతున్నాయని, అలాంటివాటిపై దృష్టిపెట్టాలని టీడీపీ సభ్యుడు గంధం శ్రీనివాసరావు మేయర్‌కు సూచించారు. దీనిపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతోపాటు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెండు రోజుల కిందట గుంటూరులో చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించడం, రామ్‌నగర్‌లోని అతని భవనానికి ప్లాన్‌ లేనందున కూల్చివేయాలని అనడంతో సభలో గందరగోళం ఏర్పడింది. 

కుక్కలకు పార్కులా!

పెందుర్తి ప్రాంతంలోని 95వ వార్డులో కుక్కల పార్కు నిర్మాణం చర్చ సందర్భంగా సీపీఐ కార్పొరేటర్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ, నగరంలో కుక్కలు నడిచేందుకు పార్కు నిర్మించడం కంటే ముందు మనుషులు నడిచే రోడ్ల మరమ్మతులపై దృష్టిపెట్టాలని కోరారు. సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు మాట్లాడుతూ, నగరంలో ఆరు పార్కులనే ఎంపిక చేయడానికి ప్రాతిపదిక ఏమిటని, అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి చేయాలని కోరారు. దీనికి వైసీపీ సభ్యులు మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచన మేరకు కమిషనర్‌, మేయర్‌ ఆరు పార్కులను అభివృద్ధికి ఎంపిక చేశారని సమాధానం ఇచ్చారు. దీనికి జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ఆరు పార్కులను జీవీఎంసీ నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పడం కంటే... తన నిధులతో లేదా తన పలుకుబడి ఉపయోగించి నిధులను సమకూర్చి అన్ని వార్డుల్లో వున్న 1200 ఓపెన్‌ స్పేస్‌లను అభివృద్ధి చేస్తే బాగుంటుందని అన్నారు. 

బీజేపీ కార్పొరేటర్‌ గంకల కవిత మాట్లాడుతూ కార్పొరేటర్లకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని, ఏమైనా మాట్లాడితే ‘మీరు ఒకరే కదా... ఏం చేస్తారంటూ’ వైసీపీ సభ్యులు హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కో-ఆప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు మాట్లాడుతూ కో-ఆప్షన్‌ కేటగిరీలో అనుభవజ్ఞులమని తమను ఎన్నుకుని, సభలో చివరన కూర్చోబెట్టి అగౌరవపరుస్తున్నారని, తమకు ముందు వరుసలో కూర్చొనే అవకాశం కల్పించాలని కోరారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, వార్డుల్లో జరిగే అభివృద్ధిలో కార్పొరేటర్లకు సమాచారం ఉండడం లేదని, అలాకాకుండా వార్డులో జరిగే కార్యక్రమాలకు కార్పొరేటర్‌ను కలుపుకుని వెళ్లడం ద్వారా వారికి గౌరవం పెంచాలని కోరారు. ఒకే శ్మశానాన్ని అభివృద్ధి చేయడం కంటే 98 వార్డుల్లోని శ్మశానాలను అభివృద్ధి చేయాలని వైసీపీ సభ్యుడు పీవీ సురేశ్‌ డిమాండ్‌ చేశారు. 

వడ్లపూడి సమీపంలోని శ్మశానాన్ని అధికారపార్టీ ఎంపీ కబ్జా చేసి 12 ఎకరాల్లో భారీ నిర్మాణం చేపడుతున్నారని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడానికి ఆంతర్యమేమిటని 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్నాథం మేయర్‌ను ప్రశ్నించారు. బీచ్‌లో గజ ఈతగాళ్లకు జీతాల చెల్లింపు అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యురాలు స్వాతీరాణి మాట్లాడుతుండగా, టీడీపీ సభ్యురాలు నొల్లి నూకరత్నం అభ్యంతరం చెప్పారు. రెండు నెలల కిందట కమ్యూనిటీ గార్డులుగా నియమించినవారికి ఈత రాదని, వారికి జీతాలు ఇవ్వొద్దని స్వాతీరాణి అభ్యంతరం చెప్పారని, ఇప్పుడు వారికి జీతాలు ఇవ్వండంటూ ఆమె అడగడం ఏమిటని ప్రశ్నించారు. బాధితులు మిమ్మల్ని కలిసేసరికి వారికి సముద్రంలో ఈదడం వచ్చేసిందా అంటూ ఎద్దేవా చేశారు. జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ మాట్లాడుతూ, పోలీస్‌శాఖ నియమించినవారికి జీవీఎంసీ ఎందుకు జీతాలు చెల్లిస్తున్నదని, దీని వల్ల జీవీఎంసీకి ఏడాదికి రూ.కోటి వరకూ భారం పడుతున్నందున దీనిపై ఆలోచన చేయాలని మేయర్‌ను కోరారు. దీనిపై మేయర్‌ స్పందిస్తూ 2022 మార్చి తర్వాత కమ్యూనిటీ గార్డులకు జీవీఎంసీ జీతాలు చెల్లించడం ఆపేస్తుందని స్పష్టంచేశారు. 

దుకాణాల లీజుల కొనసాగింపుపై అభ్యంతరం

లీజు బకాయిలు, మూడేళ్లకు పైగా కొనసాగుతున్నారనే కారణంతో 143 దుకాణాలను జీవీఎంసీ సీజ్‌ చేసి ఇప్పుడు తిరిగి తెరిచేందుకు వీలుగా తయారుచేసిన అంశాన్ని టేబుల్‌ అజెండాగా చర్చకు పెట్టారు. దీనిపై జనసేన, బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదానికి దారితీసింది. దుకాణాల లీజుల కొనసాగింపుపై ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 113 దుకాణాలను జీవో నంబర్‌ 56 ప్రకారం తెరిపించేందుకు అనుమతిస్తామని మేయర్‌ ప్రకటించడంతో జనసేన కార్పొరేటర్లు మూర్తియాదవ్‌, దల్లి గోవిందరాజు, భీశెట్టి వసంతలక్ష్మి, బీజేపీ కార్పొరేటర్‌ గంకల కవిత మేయర్‌ పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరం తెలిపారు. మునిసిపల్‌ చట్టం-1955 ప్రకారం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలంటే సభలో 2/3 వంతుల మెజారిటీ ఆమోదం ఉండాలని, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అంశంపై ముందుకెళ్లాలని పట్టుబట్టడంతో మేయర్‌ అప్పటికప్పుడు కమిటీ ఏర్పాటుపై ఎన్నిక నిర్వహించి మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో కమిటీని ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ సభ్యుడు రాపర్తి కన్నా మాట్లాడుతూ, దుకాణాల లీజు వ్యవహారంలో జీవీఎంసీ ఆదాయానికి గండి పడుతున్నదని అన్ని పార్టీల సభ్యులు మాట్లాడుతున్నారని, బాధ్యులైన రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జోన్‌-8లో జరిగిన అసెస్‌మెంట్ల జారీ కుంభకోణం, దుకాణాల లీజుల కుంభకోణంపై పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయని, వాటిపై ఇంతవరకూ ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశం సందర్భంగా అజెండాలోని 24 అంశాలతోపాటు టేబుల్‌ అజెండాగా పెట్టిన నాలుగు అంశాలు ఆమోదం పొందాయి.