ఏపీ స్థానిక ఎన్నికలు.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనా..?

ABN , First Publish Date - 2020-05-30T09:36:34+05:30 IST

హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదట నుంచి ప్రారంభమవుతుందా, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పాత ప్రక్రియనే

ఏపీ స్థానిక ఎన్నికలు.. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందేనా..?

మళ్లీ మొదలవుతుందా?

హైకోర్టు తీర్పు నేపథ్యంలో  స్థానిక ఎన్నికల ప్రక్రియపై చర్చ

ఆగస్టులో లేకపోతే, వర్షాకాలం తర్వాతే ఎన్నికలు

తాజాగా ప్రక్రియ మొదలు పెడతారంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు

ఎంపీటీసీ, జడ్పీటీసీ,  మున్సిపల్‌ నామినేషన్లు చెల్లకపోవచ్చు?


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదట నుంచి ప్రారంభమవుతుందా, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పాత ప్రక్రియనే ప్రారంభిస్తారా అనేది చర్చనీయాంశ మైంది. రాజకీయ, అధికార వర్గాల్లో ఇదే అం శంపై చర్చ జరుగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. మార్చి 7న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రకియ కూడా ప్రారంభమైంది. అనేకచోట్ల నామినేషన్ల ప్రకియ సజావుగా జరగలేదని, అధికార వైసీపీ అప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని, చాలా మంది నామినేషన్లు కూడా దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయినా ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోయింది. ఒక దశలో అధికార యం త్రాంగం కూడా ప్రభుత్వం చెప్పినట్టు వ్యవహ రిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల తరపున పోటీ చేయడానికి కూడా చాలామంది భయపడ్డారు. నామినేషన్ల ప్రక్రియలోనే ఇలా ఉంటే, పోలింగ్‌ రోజు పరిస్థితి ఏంటనే  భయాలు, అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.


కానీ ఆకస్మికంగా కరోనా ప్రభావం అధికంగా ఉంటుందనే కారణంతో ఎన్నికల కమిషన్‌ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నిర్ణయాన్ని మెజా ర్టీ వర్గాలు ఆమోదించాయి. కానీ ప్రభుత్వం ఎన్నికల సంఘం మీద విరుచుకుపడింది. తర్వాత అనేక పరిణామాలు జరగడం, చివరకు శుక్రవారం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మళ్లీ ప్రక్రియ మొదటి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌  జారీ అయిన మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి కాకపోతే, మళ్లీ ప్రకియ మళ్లీ మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు. ఎన్నికల ప్రకియ మొదలైన 45 రోజుల్లో ఎన్నికలు పూర్తి కాకపోయినా, మళ్లీ మొదలు కావలసిందేనని, దీనిబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ల ప్రకియ నుంచే మొదలవుతాయనే వాదన ఉంది. నిజానికి ఎన్నికల సంఘం  స్థానిక ఎన్నికలను వాయిదా వేసేసరికి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పోలింగ్‌ మాత్రమే జరగవలసి ఉంది. మున్సిపల్‌ నామినేషన్ల ప్రకియ చివరకు వచ్చింది. ఈ దశలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.


జిల్లాలో  సుమారు 1100లకు పైగా సర్పంచ్‌ పదవులు, 1300 వరకూ ఎంపీటీసీ పదవులు, 60 దాకా జడ్పీటీసీ పదవులు ఉన్నాయి. వీటిలో సర్పంచ్‌ల ఎన్నికలకు మాత్రం షెడ్యూల్‌ మొదలు కాలేదు. మిగతా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్ల అభ్యర్థులను ఆయా పార్టీలు ఎంపిక చేయడం, వారు నామినేషన్లు  కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పాత ప్రక్రియ కొనసాగితే, వీరి నామినేషన్లు భద్రమే. కానీ గడువు దాటిపోవడం, పైగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ నామినేషన్ల ప్రకియ మొదలు కావల్సిందేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల్లో హర్షం వ్యక్తమవుతుండగా, అధికార వైసీపీ అభ్యర్థుల్లో భయం మొదలైంది. మళ్లీ అప్పటి అభ్యర్థులకే టికెట్లు ఇస్తారా, లేదా అనుమానాలు కూడా మొదలయ్యాయి. 


 ఇక ఎన్నికల విషయానికి వస్తే ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల లాక్‌డౌన్‌ ఉన్నా, ఎత్తేసినా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఈనెల 31తో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ గడువు పూర్తి కానుంది. మరో 14 రోజుల పాటు పెంచే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక జూన్‌ నెలలో నైరుతీ రుతుపవనాలు రావడం, ఖరీఫ్‌ సీజన్‌ మొదలు వల్ల ఎన్నికలు జరిగే అవకాశం తక్కువ. కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికే కరోనా ప్రభావం అధికంగా ఉంటే, ఇక వర్షాకాలం వెళ్లిన తర్వాతే స్థానిక ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-30T09:36:34+05:30 IST