19 రాష్ట్రాల్లో మరణాలు నిల్‌

ABN , First Publish Date - 2021-02-25T06:58:35+05:30 IST

దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు.

19 రాష్ట్రాల్లో మరణాలు నిల్‌

కరోనాతో ఇతర రాష్ట్రాలన్నింట్లో  మరో 104 మంది మృతి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో కరోనా మరణాలు ఒక్కటి కూడా చోటుచేసుకోలేదు. అయితే ఇతర రాష్ట్రాలన్నింట్లో కలిపి 104 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,56,567కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా మరో 13,742 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు, వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1.10,30,176కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కాగా, 14,037 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్లు, వీరితో కలిపి రికవరీల సంఖ్య 1,07,26,702గా నమోదైనట్లు తెలిపింది. మొత్తంగా దేశంలో రికవరీ శాతం 97.25కు పెరగగా.. మరణాల శాతం 1.42గా ఉన్నట్లు వివరించింది.


కాగా మహారాష్ట్రలో మరోసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు కన్నా మరో 298  కేసులు పెరిగి 6,218 నమోదయ్యాయి. కేరళలో మాత్రం 803 కేసులు తగ్గి.. 4,034 పాజిటివ్‌లు వచ్చాయి. తమిళనాడు 442 కేసులతో మూడో స్థానంలో ఉంది. మరణాల్లోనూ మహారాష్ట్రే ప్రథమస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఒకేరోజు 51 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు అధిక మరణాల సంఖ్యలో తరువాతి స్థానాల్లో కేరళ(14), పంజాబ్‌(10) ఉన్నాయి. రికవరీల్లోనూ మహారాష్ట్ర ముందుంది. ఆ  రాష్ట్రంలో ఒకే రోజు రికార్డు స్థాయిలో 5,869 మంది కోలుకున్నారు. కేరళలో 4,823 మంది కోలుకోగా.. ఆ తరువాత తమిళనాడులో 453 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. 



10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు


దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అత్యున్నత స్థాయి నిపుణుల బృందాల్ని పంపింది. ప్రతి బృందానికి సంయుక్త కార్యదర్శి (జాయింట్‌ సెక్రెటరీ) స్థాయి అధికారి ఒకరు నేతృత్వం వహిస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులను పెంచాలని వాటికి నిర్దేశించింది.


కాగా, రష్యా తయారీ స్పుత్నిక్‌ వి టీకాకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ పెట్టుకున్న దరఖాస్తును డీసీజీఐకి చెందిన విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) తిరస్కరించింది. కాగా, తెలంగాణ సహా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 




కేంద్ర మంత్రులు డబ్బులిచ్చి టీకా వేయించుకుంటారు: రవిశంకర్‌ప్రసాద్‌


కేంద్రమంత్రులు డబ్బులు చెల్లించి టీకా వేయించుకోవాలని భావిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. 60 ఏళ్లకు పైగా వయసున్నవారు, 45 ఏళ్లకుపైగా వయసుండి.. వివిధ అనారోగ్య సమస్యలున్న వారందరికీ మార్చి 1 నుంచి ఉచితంగా వాక్సిన్‌ ఇవ్వనున్నట్లు, వ్యాక్సిన్‌కు డబ్బు చెల్లించి ప్రైవేటులోనూ తీసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


కాగా, దేశంలో ఇప్పటివరకు 1,21,65,598 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. తొలి డోసు తీసుకొని 28 రోజులు దాటిన వారికి రెండో డోసును ఈ నెల 13న ప్రారంభించింది.


Updated Date - 2021-02-25T06:58:35+05:30 IST