కరోనాతో బాధితుడు 30 రోజుల్లోగా మృతి చెందితే అది కోవిడ్ డెత్!

ABN , First Publish Date - 2021-09-12T14:39:07+05:30 IST

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది.

కరోనాతో బాధితుడు 30 రోజుల్లోగా మృతి చెందితే అది కోవిడ్ డెత్!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. కరోనాతో చాలా మంది మరణించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. కోవిడ్-19 పాజిటివ్‌తో బాధితుడు 30 రోజుల్లోపు ఆసుపత్రిలో లేదా ఇంటిలో మరణిస్తే... సంబంధిత వ్యక్తి మరణ ధృవీకరణ పత్రంలో ఈ మరణానికి కారణం కోవిడ్ -19 గా నిర్ధారిస్తారని ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 


ఇంతకుముందు సుప్రీంకోర్టు... తన ఆదేశంలో ఆసుపత్రిలో లేదా మరెక్కడైనా కరోనాతో మరణించిన వారిని కోవిడ్ -19 కారణంగా మరణించినట్లుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై స్పష్టమైన విధివిధానాలు తయారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అనుసరించి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)  సంయుక్తంగా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం కరోనా బాధితుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటికీ, 30 రోజుల్లోగా మరణిస్తే దానిని కోవిడ్ మరణంగా భావిస్తారు. అలాగే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ లేదా యాంటిజెన్ టెస్ట్ లేదా క్లినికల్ పద్ధతిలో కోవిడ్ నిర్ధారణ అయితేనే దానిని పరిగణలోకి తీసుకుంటారు.

Updated Date - 2021-09-12T14:39:07+05:30 IST