మృత్యువు గురించి, అతిశయోక్తులు లేకుండా

ABN , First Publish Date - 2020-06-01T05:49:47+05:30 IST

అది హాస్యోక్తికి నవ్వదు, ఒక నక్షత్రాన్ని కనిపెట్టదు, ఒక వంతెనా కట్టదు. నేయడం, గని తవ్వకం, ద్యం, నౌకలు నిర్మించడం, లేదా రొట్టె....

మృత్యువు గురించి, అతిశయోక్తులు లేకుండా

అది హాస్యోక్తికి నవ్వదు, 

ఒక నక్షత్రాన్ని కనిపెట్టదు, ఒక వంతెనా కట్టదు.

నేయడం, గని తవ్వకం, సేద్యం,

నౌకలు నిర్మించడం, లేదా రొట్టె కాల్చడం వంటివేవీ దానికి తెలియదు. 

రేపటి గురించిన మన ప్రణాళికలో

ఎప్పుడు గానీ అసలు విషయంతో సంబంధం లేని 

దానిదే తుదిమాట.


గొయ్యి తవ్వడం, 

శవ పేటిక తయారు చేయడం,

తన తర్వాత శుభ్ర పరచడం... 

తన సొంత వ్యవహారానికి చెందిన

పనులు సైతం అది చేయించుకోలేదు.


చంపడంలో నిమగ్నమై వున్న అది

అసంబద్ధంగా చేస్తుంది తన పని.

అందులో ఒక పద్ధతి లేదా నేర్పు వుండదు- 

మనలో ఒక్కొక్కరు తన మొదటి వేట అయినట్టు.


దాని విజయాలు దానికున్నయ్‌, 

కానీ లెక్కకుమించిన దాని అపజయాలవైపూ చూడు;

గురి తప్పిన దెబ్బలు,

మళ్ళీ మళ్ళీ చేసే ప్రయత్నాలు!


ఒక్కొక్కసారి అది ఎంత చాతకానిదంటే 

గాలిలోని ఈగను అరచేత్తో చరచ లేదు.

దాని బారి నుంచి తప్పించుకుని 

ప్రాకిన గొంగడి పురుగులు కోకొల్లలు.


మొలక దుంపలు, గింజ కాయలు,

స్పర్శాంగాలు, రెక్కలు, వాయునాళాలు, 

యౌవన దశ ఈకలు, శీతాకాలపు ఉన్ని చర్మం...

ఉత్సాహం లోపించిన తన పనిలో అది 

వెనకబడిపోయిందని రుజువు చేస్తాయి.


దుష్ట సంకల్పం పనికి రాదు-

యుద్ధాలకు, సైనిక తిరుగుబాట్లకు మన చేయూత సైతం 

ఇప్పటి వరకైతే సరిపోలేదు.


అండాల్లోపల గుండెలు కొట్టుకుంటాయి.

శిశువుల అస్థిపంజరాలు ఎదుగుతాయి.

దృఢచిత్తంతో మొలకెత్తే బీజంలోంచి రెండు లేతాకులు చివురిస్తాయి,

ఒక్కొక్కసారి పొడవాటి చెట్లు కూడా కూలిపోతాయి.


అది అంతటా ఉందన్న వాడే 

ఆ మాట నిజం కాదనడానికి సజీవ రుజువు.


క్షణ భంగురమే కావచ్చు--

అమర్త్యం కాని జీవితం లేనే లేదు.


మృత్యువు 

ఎల్లప్పుడూ ఆ క్షణమే వస్తుంది, మరీ ఆలస్యంగా.


నిష్ప్రయోజనంగా 

కనపడని తలుపు గడియ లాగుతుంది.

నువ్వు వచ్చేసినంత మేరకు

తొలగించడం కుదరదు. 


పోలిష్‌ మూలం: విస్లావా జింబోర్స్కా (1996 నోబెల్‌ ప్రైజ్‌ గ్రహీత)

ఆంగ్లానువాదం: స్టానిస్లా బరాన్జాక్‌ & క్లేర్‌ కావనాఘ్‌

తెలుగు అనువాదం ఆడెపు లక్ష్మీపతి

Updated Date - 2020-06-01T05:49:47+05:30 IST