సత్తు పిండిలిట్టీ ఉలవల పరోటా

ABN , First Publish Date - 2021-07-31T05:44:20+05:30 IST

వీకెండ్‌ వచ్చిందంటే చాలు... వెరైటీ ఫుడ్‌ను టేస్ట్‌ చేయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు సత్తు పిండితో చేసే లిట్టీలు, ఉలవలతో చేసే పరోటా, మసాలా తమలపాకుల వడలు, బ్లాక్‌ సోయాబీన్స్‌తో చేసే భట్వానీ కర్రీ.

సత్తు పిండిలిట్టీ ఉలవల పరోటా

వీకెండ్‌ వచ్చిందంటే చాలు... వెరైటీ ఫుడ్‌ను టేస్ట్‌ చేయాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు సత్తు పిండితో చేసే లిట్టీలు, ఉలవలతో చేసే పరోటా, మసాలా తమలపాకుల వడలు, బ్లాక్‌ సోయాబీన్స్‌తో చేసే భట్వానీ కర్రీ...వంటి రెసిపీలను ట్రై చేయండి. ఆ వంటల తయారీ విశేషాలు ఇవి...


ఉలవల పరోటా

కావలసినవి: ఉలవలు - 25 గ్రాములు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - మూడు రెబ్బలు, గోధుమపిండి - అరకేజీ.

తయారీ విధానం: ఉలవలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని కాసేపు ఉడికించాలి.

తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉలవలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి.

గోధుమపిండిని మెత్తగా కలుపుకొని ఉలవల మిశ్రమాన్ని కూరి పరోటాలు తయారుచేసుకోవాలి. 

స్టవ్‌పై పెనంపెట్టి పరోటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. 


లిట్టి

కావలసినవి: సత్తు పిండి - పావుకిలో, ఉల్లి విత్తనాలు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, వాము - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం - అంగుళం ముక్క, ఎండుమిర్చి - రెండు, ఆవాలనూనె - రెండు టేబుల్‌స్పూన్లు, గోధుమపిండి - ఒక కేజీ, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం:  ఒక పాత్రలో ఉల్లివిత్తనాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాము, మామిడికాయపొడి, దంచిన వెల్లుల్లి, అల్లం, వేగించిన ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. తరువాత అందులో ఆవాలనూనె, సత్తుపిండి వేసి కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి.

మరొక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. 

గోధుమపిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాస్త వెడల్పుగా కప్పు ఆకారంలో ఒత్తుకోవాలి. మధ్యలో సత్తుపిండి మిశ్రమం పెట్టి చివరలు దగ్గరకు ఒత్తుకోవాలి. అరచేతులతో బాల్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు అప్పం పాత్ర(పనియారకల్‌, పొంగణాల ప్లేట్‌)లో కొద్దిగా నూనె వేసి లిట్టిలు పెట్టి ఉడికించాలి. ఏదైనా కర్రీతో లేదా చట్నీతో వేడివేడిగా తింటే ఇవి రుచిగా ఉంటాయి. 


భట్వాని

కావలసినవి: బ్లాక్‌ సోయాబీన్‌ - పావుకేజీ, రైస్‌ స్టార్చ్‌ - ఒక కప్పు, వేగించిన ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పసుపు - ఒక టీస్పూన్‌, గరంమసాల - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఆవాల నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం:  స్టవ్‌పై పాన్‌ పెట్టి ఒక టేబుల్‌స్పూన్‌ ఆవాల నూనె వేయాలి. కొద్దిగా వేడి అయ్యాక సోయాబీన్స్‌ వేసి వేగించాలి. చిటపటమని వేగే వరకు ఉంచి దింపుకోవాలి. కాస్త వేడిగా ఉండగానే బీన్స్‌ను క్రష్‌ చేసుకోవాలి. తరువాత రైస్‌ స్టార్చ్‌ కలపాలి. 

స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల ఆవాల నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తరువాత సోయాబీన్స్‌, రైస్‌ స్టార్చ్‌ వేసి కలుపుకోవాలి. పసుపు, గరంమసాల, తగినంత ఉప్పు వేయాలి. వేగించిన ఎండుమిర్చితో గార్నిష్‌ చేసి, అన్నంతో సర్వ్‌ చేసుకోవాలి.


మసాలా తమలపాకుల వడలు

కావలసినవి: మసాలా తమలపాకులు - పన్నెండు, బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్‌, శనగపిండి - 4 టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, వాము - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - రుచికి సరిపడా, పసుపు - చిటికెడు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా తమలపాకులను శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నువ్వులు, వాము, కారం, తగినంత ఉప్పు, కొద్దిగా నూనె వేయాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్టులా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తమలపాకుపై లేయర్‌లా వేసి రోల్‌లా చుట్టాలి. రోల్‌ విడిపోకుండా పుల్లతో గుచ్చాలి. 

ఈ రోల్స్‌ను స్కిల్లెట్‌పై టోస్ట్‌ చేసుకోవాలి. తరువాత ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


మునగకాయ థోరన్‌

కావలసినవి: మునగకాయలు - ఆరు, శనగపప్పు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, ఉల్లిపాయలు - ఎనిమిది, కొబ్బరినూనె - ఒక టేబుల్‌స్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, పసుపు - అర టీస్పూన్‌, ఆవాలు - ఆర టీస్పూన్‌, జీలకర్ర - అర టీస్పూన్‌, కొబ్బరితురుము - అరకప్పు. 


తయారీ విధానం:  శనగపప్పును శుభ్రంగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. 

మునగకాయలను కట్‌ చేసి పొట్టు తీయాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉప్పు వేసి వాటిని ఉడికించాలి.

పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. ఈ పేస్టును ఉడికించిన మునగకాయల్లో కలపాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొబ్బరినూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగించాలి.  తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత మునగకాయలు, ఉడికించిన శనగపప్పు కలపాలి.  కాసేపు ఉడికించి దింపుకోవాలి. కొబ్బరి తురుముతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-07-31T05:44:20+05:30 IST