తొలి కరోనా మరణం

ABN , First Publish Date - 2020-06-07T10:17:09+05:30 IST

కరోనా వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో ఆ వ్యాధి కారణంగా తొలి మరణం నమోదైంది. హుజూరాబాద్‌ మండలం

తొలి కరోనా మరణం

కోవిడ్‌తో కాట్రపల్లివాసి మృతి

జిల్లాలో భయాందోళనలు 

పాజిటివ్‌ వ్యక్తుల కుటుంబసభ్యులకు హోం క్వారంటైన్‌

ప్రైమరీ కాంట్రాక్టులకు కూడా క్వారంటైన్‌ 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌) :కరోనా వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో ఆ వ్యాధి కారణంగా తొలి మరణం నమోదైంది. హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లికి చెందిన ఒకరు (65) తీవ్ర అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం  వరంగల్‌ ఎంజీఎంలో చేరారు. అక్కడి సిబ్బంది అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. శనివారం ఉదయం ఆయన మరణించడంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. శుక్రవారమే గంగాధర మండలానికి చెందిన ఒక ఏఎన్‌ఎంకు, చొప్పదండి మండలం భూపాలపట్నానికి చెందిన మరొకరికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. కాట్రపల్లిలో ఒకరు ఆ వ్యాధి బారిన పడి మరణించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 


ప్రైమరీ కాంటాక్టులపై ఆరా

కాట్రపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కరోనా మృతుని కుటుంబసభ్యుల నుంచి అతను ఎవరెవరిని కలిశారన్న విషయాన్ని సేకరిస్తున్నారు. హుజూరాబాద్‌ మండలం రాంపూర్‌కు చెందిన ఒక వ్యక్తి, బోర్నపల్లికి చెందిన మరో వ్యక్తి వరంగల్‌లో ఒక మిత్రుడికి జ్వరం వస్తే ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో వీరిద్దరిని హోంక్వారంటైన్‌లో ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశించారు. ఈ వరుస ఘటనలు కరోనా వ్యాధి విజృంభణ నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గంగాధర మండలంలో కరోనా సోకిన ఏఎన్‌ఎం కుటుంబసభ్యులు నలుగురిని, ఆమె ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న 10 మందిని గుర్తించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. భూపాలపట్నంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులు ముగ్గురిని, అతను కలిసిన మరో ఐదుగురిని కూడా క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో రేపటి నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుస్తుండడంతో వ్యాధి తీవ్రత పెరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. 


నాలుగు యాక్టివ్‌ కేసులు

జిల్లాలో మార్చి 17న తొలి కరోనా కేసు రిపోర్టు కాగా తొలి మరణం జూన్‌ 6న నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 23 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మినహా అందరు చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారు.  గంగాధర ఏఎన్‌ఎం, భూపాలపట్నం వ్యక్తికి కరోనా రావడంతో నాలుగు యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అయింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం విషయంలో అజాగ్రత్తగా ఉంటూ సాధారణ రోజుల్లో వ్యవహరించిన విధంగానే వ్యవహరిస్తుండడంతో వ్యాధి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని తెలుస్తున్నది.  ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు జరిగిన రోజుల్లో ఉన్నట్లు ఉండక పోతే కేసులు పెరిగి పోవచ్చని హెచ్చరిస్తున్నారు.   


Updated Date - 2020-06-07T10:17:09+05:30 IST