కూర్మాన్ని కాపాడండి

ABN , First Publish Date - 2022-07-19T05:20:47+05:30 IST

అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లు తీరంలో నిత్యం మృత్యువాత పడుతున్నాయి. ఈ తాబేళ్ల పునరుత్పత్తికి జిల్లాలోని తీరం అనువైన ప్రాంతం. అందుకే వేలకిలోమీటర్ల దూరం నుంచి ఈ తాబేళ్లు గుడ్లు పెట్టి పొదిగేందుకు తీరప్రాంతానికి చేరుకుంటున్నాయి. కాగా, సముద్రంలో చేపలవేట కోసం మత్స్యకారులు విసిరిన వలలో చిక్కుకోవడం, కాలుష్యం బారిన పడడంతో ఏటా వందల సంఖ్యలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి.

కూర్మాన్ని కాపాడండి
గెడ్డూరులో ఆలివ్‌రిడ్లే గుడ్లను సంరక్షించి పొదిగించి పిల్లలను సముద్రంలోకి విడిచిపెడుతున్న యువత(ఫైల్‌)

- గుడ్లు పెట్టేందుకు వచ్చి ఆలివ్‌రిడ్లే తాబేళ్ల మృత్యువాత
- కానరాని సంరక్షణ కేంద్రం ఏర్పాటు
(హరిపురం)

అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లు తీరంలో నిత్యం మృత్యువాత పడుతున్నాయి. ఈ తాబేళ్ల పునరుత్పత్తికి జిల్లాలోని తీరం అనువైన ప్రాంతం. అందుకే వేలకిలోమీటర్ల దూరం నుంచి ఈ తాబేళ్లు గుడ్లు పెట్టి పొదిగేందుకు తీరప్రాంతానికి చేరుకుంటున్నాయి. కాగా, సముద్రంలో చేపలవేట కోసం మత్స్యకారులు విసిరిన వలలో చిక్కుకోవడం, కాలుష్యం బారిన పడడంతో ఏటా వందల సంఖ్యలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి. సస్యరక్షణ చర్యలు చేపట్టడంలో అటవీ, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఇండోనేషియా దీవులు, మలేషియా, ఽథాయిలాండ్‌ తీరప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశించే ఆలివ్‌రిడ్లే తాబేళ్లు జిల్లా తీర ప్రాంతానికి వస్తున్నాయి. ఏటా నవంబరు నుంచి మార్చి వరకు వేల సంఖ్యలో ఈ తాబేళ్లు అధికంగా ఉద్దానంలోని కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాలో తీర ప్రాంతాలకు వస్తాయి. ఇసుక దిబ్బల్లో గుడ్లు పెట్టి పొదిగి వెనుదిరిగిపోతాయి. మురుగు కాలువలు, వాగులు, గెడ్డలు, నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో ఎక్కువగా ఇవి గుడ్లు పెడుతుంటాయి. ఈ క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కి కొన్ని.. కాలుష్యం బారిన పడి మరికొన్ని తాబేళ్లు మృతి చెందుతున్నాయి. ఈ రకం తాబేళ్లను రక్షిత జంతువుల జాబితాలో చేర్చారు. కానీ ఈ ప్రాంతాల్లో సంరక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో తాబేళ్ల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. తాబేళ్లు వలలో చిక్కినా చనిపోకుండా ఉండేందుకు టెడ్‌ వంట పరికరాలను అమర్చుకోవాలని మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. తాబేళ్లు నివాసం ఉండే స్థలాలను రక్షిత ప్రాంతంగా ప్రకటించి వాటి మరణాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.

ఉత్సవాలు జరిపినా..
ఐదేళ్ల్ల కిందట తాబేళ్ల రక్షణ కోసం జిల్లాలోని అరసవల్లి దేవాలయంలో తాబేళ్ల ఉత్సవం నిర్వహించారు. నక్షత్ర తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ దిశగా చర్యలు లేవు. దీంతోపాటు అరుదైన ఆలివ్‌రిడ్లేలు గత నెల రోజులుగా వందల సంఖ్యలో మృత్యువాత పడుతూ.. వన్యప్రాణులకు ఆహారంగా మారుతున్నాయి. తీరంలో ఎక్కడ చూసిన ఆలివ్‌రిడ్లే తాబేళ్ల కళేబారాలే కనిపిస్తూ.. దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ఆయా తీరప్రాంత ప్రజలు వీటిని పూడ్చి పెడుతున్నారు.

సంరక్షిస్తున్నాం
ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అరుదైన జాతి. మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో యువత భాగస్వామ్యంతో వీటిని సంరక్షిస్తున్నాం. తీరంలో ప్రతి పది కిలోమీటర్లుకు ఒక ప్రాంతంలో సంరక్షణ చేపడితే మంచి ఫలితాలు వస్తాయి. వీటిపై మత్స్యకారులకు మరింత అవగాహన పెంచేలా.. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం.
కె రవి, మత్స్యశాఖాధికారి, మందస.


ఆదుకోవటం మన బాధ్యత
విదేశీ పక్షులకు మన ప్రభుత్వం సంరక్షించేలా చర్యలు చేపడుతున్నాం. విదేశీ తాబేళ్లు కూడా అదే కోవకు చెందినవి. వీటిని రక్షించుకోవటం మనందరి బాధ్యత. ఆదుకోవటంలో యువత భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం కూడా వీటి సంరక్షణకు చర్యలు తీసుకోంటోంది.  
- వీవీఎస్‌ఎన్‌ రాజు, డీప్యూటీ అటవీశాఖాధికారి
 

Updated Date - 2022-07-19T05:20:47+05:30 IST