Abn logo
May 22 2020 @ 12:20PM

వలసకూలీ కుటుంబం డెత్ మిస్టరీ.. బావిలో మృతదేహాలు.. అసలేం జరిగిందంటే..

గీసుగొండ (వరంగల్ జిల్లా): బావిలోంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్న మృతదేహాలు.. పొట్టకూటి కోసం వలస వచ్చి.. పాతికేళ్లుగా వరంగల్‌లోనే ఉంటున్న ఓ కుటుంబంలో జరిగిన ఘోర విషాదమిది.. గురువారం ఈ బావిలోంచి నాలుగు మృతదేహాలు బయటపడగా.. శుక్రవారం మరో ఐదు మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మొత్తంగా ఇప్పటికే తొమ్మిది మృతదేహాలు బావిలోంచి బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా చంపి ఆ బావిలో పడేశారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.. కరోనా లాక్‌డౌన్‌తో వలసకూలీల కష్టాలు కడగండ్లు కన్నీళ్లు పెట్టిస్తున్న నేపథ్యంలో వరంగల్‌ నగరంలో జరిగిన ఈ దుర్ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది..


పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మక్సూద్‌ (50) కుటుంబం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి 25 ఏళ్ల క్రితం వలస వచ్చింది. మక్సూద్‌కు భార్య నిషా, ఇద్దరు కుమారులు, కుమార్తె బూస్రా ఉన్నారు. కుమార్తెకు ఒక కొడుకు కూడా ఉన్నారు. వారంతా స్థానికంగా ఉంటున్నారు. మక్సూద్‌ కుమార్తెకు ఢిల్లీకి చెందిన వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భార్యాభర్తలు విడాకులు తీసుకోవడంతో ఆమె తన మూడేళ్ల బాబుతో కలిసి పుట్టింటివద్దే ఉంటోంది. వీరంతా గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రీయల్‌ ఏరియాలో గల సాయిదత్తా బారదాన్‌ ట్రేడర్స్‌లో పాత గన్నీ సంచులను కుడుతూ జీవిస్తున్నారు. మక్సూద్‌ పెద్ద కుమారుడు సోహెల్‌ వరంగల్‌ ములుగురోడ్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ డిప్లొమా చేస్తుండగా, చిన్న కుమారుడు ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నట్టు తెలిసింది. బూస్రా కూడా తండ్రి దగ్గరే ఉంటూ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  


అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో కరీమాబాద్‌ నుంచి పనిచేసేందుకు గొర్రెకుంటకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో మక్సూద్‌ కుటుంబం ఇబ్బందులు పడుతుండేది. ఈ క్రమంలో తమ గోడును యాజమానికి విన్నవించుకోగా స్పందించి సాయిదత్తా ట్రేడర్స్‌లోని షెడ్స్‌లో ఉండేందుకు తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించాడు. ఆ భవనంలోనే మరో గదిలో బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు శ్రీరాం, శ్యామ్‌లు కూడా నివసిస్తున్నారు. బుధవారం నుంచి మక్సూద్‌ కుటుంబంతోపాటు ఆ బీహార్ యువకులు కూడా కనిపించకపోవడంతో సాయిదత్తా ట్రేడర్స్‌ యజమాని సంతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ట్రేడర్స్‌ సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో మసూద్‌తోపాటు అతడి భార్య, కూతురు, మనవడు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. దీంతో యజమాని సంతోష్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి గీసుగొండ సీఐ శివరామయ్య, ఎస్సై రహీం చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నాలుగు మృతదేహాలను వెలికితీసి ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని అదనపు డీసీపీ వెంకటలక్ష్మి పరిశీలించారు. కాగా శుక్రవారం మధ్యాహ్నంలోపు మరో ఐదు మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. వీరిలో ఇద్దరు మక్సూద్ కుమారులేనని, మరో ఇద్దరు బీహార్ యువకులు కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వ్యక్తి ఎండీ షకీల్ అని తెలుస్తోంది..


మృతులు: మసూద్, నిషా, బూస్రా ఆలం, షోయబ్ ఆలం, సోహిల్ ఆలం, మూడేళ్ల బాబు, శ్రీరాం (బీహార్), ఎండీ షకీల్, శ్యామ్ (బీహార్)


నలుగురు మిస్సింగ్ అనుకున్నారు.. కానీ.. 

బావిలో మక్సూద్‌, అతడి భార్య నిశా, కుమార్తె బూస్రా, మనువడి మృతదేహాలను పోలీసులు గురువారం రాత్రి వెలికి తీశారు. మక్సూద్‌ ఇద్దరు కుమారులతో పాటు, వారితోపాటే ఉన్న బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు కనిపించకపోవడంతో పోలీసుల్లో అనుమానాలు రేకెత్తాయి. బిహార్‌కు చెందిన శ్యామ్‌, శ్రీరాంలకు చెందిన గదిలో వారి ఆధార్‌ కార్డులు, నగదు, పర్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకవేళ వీరు అఘాయిత్యానికి పాల్పడితే వారి సమాచారం చిక్కకుండా చేసేవారని పోలీసులు భావించి.. మరోసారి బావిలో గజఈతగాళ్లతో వెతికించారు. దీంతో మరో ఐదు మృతదేహాలు శుక్రవారం బయటపడ్డాయి. 


హత్యా..? ఆత్మహత్యా..?

మక్సూద్‌ కుటుంబ సభ్యులు పాడుబడిన బావిలో శవాలై తేలడం కలకలం రేపుతోంది. ప్రమాదవశాత్తూ వారు బావిలో పడ్డారా.. లేక నిద్రిస్తున్న సమయంలో వారిని ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతిపై స్పష్టత వచ్చే అవకాశముంది. బావి వద్ద బట్టలు పిండిన మూటలు లభించాయి. మక్సూద్‌కు ఆర్థిక ఇబ్బందులు లేవని యజమాని చెబుతున్నారు. కాగా, మక్సూద్‌ కుటుంబం మృతితో వారు నివాసమున్న కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో విషాదచాయలు అలుముకున్నాయి. గత 25 ఏళ్లుగా వారు బారదాన్‌లు కుడుతూ ఇక్కడే జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ గదిలో గర్భనిరోధక సాధనాలను క్లూస్‌ టీం గుర్తించింది. పోలీసులు మాత్రం వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.


కూతురి అక్రమ సంబంధం.. మనవడి బర్త్ డే పార్టీలో గొడవ

కొద్ది రోజుల క్రితం మక్సూద్‌ మనవడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.. ఈ కార్యక్రమంలోనే బీహార్ యువకులు.. స్థానిక యువకుల మధ్య గొడవ జరిగింది.. మక్సూద్ కుమార్తె విషయంలోనే వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ వల్లే వీరిపై విష ప్రయోగం జరిగిందా..? అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇది ఆత్మహత్యగా కనిపించడం లేదని.. మర్డర్‌గానే కనిపిస్తోందని స్థానికులు అనుమానిస్తున్నారు. యాకూబ్ పాషా అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్సూద్ కూతురితో యాకూబ్ పాషాకు అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. పాఠశాల వయసు నుంచే వీరికి పరిచయం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఘటన అతడి పనే అయి ఉంటే.. అంతమందిని ఇతడొక్కడే చంపలేడనీ.. మరింకొందరి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోస్ట్‌మార్టన్ రిపోర్టు బయటకు వస్తేనే అసలు విషయం తేలుతుందని స్థానికులు చెబుతున్నారు. 


ఆత్మహత్యలుగానే భావిస్తున్నాం: వెంకటలక్ష్మి, అడిషనల్‌ డీసీపీ

మక్సూద్‌ కుటుంబం మృతిపై ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాలేవీ లేవు. అందరివీ ఆత్మహత్యలే అనుకుంటున్నాం.

Advertisement
Advertisement