‘చావు’ ప్రయాణం.. చాలా భారం

ABN , First Publish Date - 2022-04-28T05:06:48+05:30 IST

రోడ్డు ప్రమాదాల్లోనో, అనారోగ్యానికి గురయ్యో ఆస్పత్రిలో తనువు చాలిస్తే ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం పెద్ద భారంగా మారింది.

‘చావు’ ప్రయాణం.. చాలా భారం
మదనపల్లె ఆస్పత్రి ప్రహరీ వద్ద నిలిపి ఉంచిన అంబులెన్స్‌లు

ఆస్పత్రుల వద్ద అంబులెన్స్‌ల దందా

మాఫియాగా అంబులెన్స్‌ల నిర్వాహకులు 

కడపలో ఓ పార్టీ అనుబంధ సంస్థ నేతదే హవా 

ఆయన గుప్పెట్లోనే అంబులెన్సులు 

ప్రధాన ఆస్పత్రుల వద్ద మకాం

బయటి అంబులెన్సులు వస్తే దాడులు


ల్యాండ్‌, భూమాఫియా, మట్టి మాఫియా తరహాలో అంబులెన్స్‌ మాఫియా కూడా రాజ్యమేలుతోంది. అనారోగ్యంతోనో.. రోడ్డుప్రమాదంలో గాయపడో ఆస్పత్రికి వస్తే అయ్యే వైద్యానికి ఖర్చు తడిసిమోపెడంత. ఒక వేళ ఆ వ్యక్తి చనిపోతే.. అంబులెన్స్‌ నిర్వాహకుల మాఫియాతో మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లడం మరింత భారంగా మారుతోంది. రెండురోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన మరోసారి జిల్లాలోని ఆస్పత్రుల వద్ద అంబులెన్స్‌ యజమానుల దందాను తెరపైకి తెచ్చింది. 


(కడప-ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లోనో, అనారోగ్యానికి గురయ్యో ఆస్పత్రిలో తనువు చాలిస్తే ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడం పెద్ద భారంగా మారింది. ఆస్పత్రిలో వైద్యానికి చెల్లించినంతగా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బు గుంజుతుండడం పేద, మద్య తరగతి వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. కడప సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)లో కొంత మంది సిబ్బంది  అంబులెన్స్‌ నిర్వాహకులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలున్నాయి. ఇక కడప నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల వద్ద ఓ పార్టీకి చెందిన అనుబంధ విభాగం నాయకుని హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులు ఆస్పత్రి వద్ద మకాం వేసి బయటి అంబులెన్సులు రాకుండా చూస్తారని అంటున్నారు. ఎవరైనా వస్తే దాడులకు పాల్పడుతుండడంతో బయటి అంబులెన్స్‌ నిర్వాహకులు రాలేకపోతున్నారని సమాచారం. జిల్లాలో కడప సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌), ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. ఇక కడప, ప్రొద్దుటూరు పట్టణాల్లో పలు ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యానికి గురైతే కడప, ప్రొద్దుటూరులకు వైద్యసేవలకు వస్తుంటారు. 


రిమ్స్‌ సర్వజన ఆస్పత్రిలో

ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా ప్రజలకు వైద్యానికి సర్వజన ఆస్పత్రే వరప్రసాదినిగా ఉంది. రహదారి, ఘర్షణల్లో గాయపడ్డ వారిని చాలా మటుకు ఇక్కడికే తీసుకొస్తుంటారు. ఇక పేదలు, మధ్యతరగతి వారు అనారోగ్యానికి గురైనా, కాన్పుల కోసం సర్వజన ఆస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ ఎవరైనా చికిత్సపొందుతూ మృతిచెందితే మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకెళ్లాలంటే దూరాన్నిబట్టి కొందరు అంబులెన్సు నిర్వాహకులు భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 18 అంబులెన్సులు ఉన్నాయి. ఆస్పత్రి నుంచి కడప నగరంలోకి మృతదేహాన్ని తీసుకురావాలన్నా కొందరు రూ.4వేల నుంచి 6 వేలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇక పోరుమామిళ్ల, కలసపాడు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలులాంటి దూర ప్రాంతాలకైతే రూ.10వేల నుంచి 20 వేల దాకా వసూలు చేస్తారని అంటున్నారు. అంత డబ్బు పెట్టుకోలేక బయటి అంబులెన్స్‌ వ్యక్తులను ఎవరినైనా తెచ్చుకుంటే వారితో ఘర్షణకు దిగుతున్నారు. ఇక్కడ మృతదేహాల తరలింపులో వచ్చే సొమ్ములో కొంత శాతం ఆస్పత్రి సిబ్బందికి ఇస్తున్నట్తు తెలుస్తోంది. రెండు మహాప్రస్థానం వాహనాలు ఉన్నప్పటికీ అవి రాత్రి సమయంలో వెళ్లవు. సర్వజన ఆస్పత్రిలో చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలన్నా కూడా పేదలకు మరింత కష్టంగా ఉంటోంది.


కడపలో దందా

కడప నగరంలో అంబులెన్స్‌ దందా నడుస్తోంది. ఓ పార్టీ అనుబంధం సంఘంలో నేతగా ఉన్న ఒకాయన ఆధీనంలో సుమారు 13 అంబులెన్స్‌లు ఉన్నాయి. కడప ముఖ్యనేతలతో ఆయనకు సంబంధాలు ఉండడంతో పాటు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నగరంలో ఫ్లెక్సీలు వేస్తుంటాడు. కడపలో ఉన్న ప్రముఖ ఆస్పత్రుల నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా... రెఫర్‌ చేయాలన్నా... ఆయన వాహనాల్లోనే వెళ్లాలట.. బయట వారు ఎవరైనా వస్తే దాడులకు తెగబడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో బయట వారు ఎవరూ రారంటారు. దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంబులెన్స్‌ దందాపై గతంలో పలువురు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వారి తీరు మారలేదు. ప్రముఖ ఆస్పత్రుల వద్ద ఆ బండ్లే ఉంటాయంటారు. 


అంబులెన్స్‌ల రవాణా చార్జీలు ఆస్పత్రి పరిఽధిలోకి రావు

- రాజేశ్వరమ్మ, ఆర్‌ఎంవో, సర్వజన ఆస్పత్రి (రిమ్స్‌)

అంబులెన్స్‌ల రవాణా ధరల విషయం సర్వజన ఆస్పత్రి పరిధిలోకి రాదు. అవి గేటు బయటే ఉన్నాయి. ఆస్పత్రిలో చనిపోతే మహాప్రస్థానం ద్వారా ఉచితంగా పంపిస్తాం. నేను కొత్తగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జరిగే విషయాలు నాకు పూర్తిగా తెలియదు.



మదనపల్లెలోనూ..

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 27: మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ప్రైవేటు అంబులెన్స్‌ వాహన డ్రైవర్ల దందా నడుస్తోంది. అధిక అద్దె వసూలు చేస్తూ.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రిలో తిష్టవేసి రోగుల జేబులకు చిల్లు పెడుతున్నారు. రోగుల తరలింపులో పోటీపడుతూ గతంలో అనేకసార్లు గొడవపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మదనపల్లెకు చెందిన ప్రైవేటు అంబులెన్స్‌ వాహన నిర్వాహకులు కొంతకాలంగా ఆస్పత్రిని అడ్డాగా మార్చుకున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు అంబులెన్స్‌లు పెట్టుకున్నారు. ముఖ్యంగా బయట వాహనాలను ఆస్పత్రి లోనికి అనుమతించకుండా అడ్డుపడుతున్నారు. రోగుల తరలింపులో పెద్ద మొత్తంలో అద్దె వసూలు చేస్తున్నారు. ఆస్పత్రి ప్రహరీ వద్ద, బెంగళూరు రోడ్డులో 10 నుంచి 15 అంబులెన్స్‌లు ఉన్నాయి. వాహన నిర్వాహకులు, డ్రైవర్లు ఆస్పత్రిలో తిరుగుతూ బాడుగల కోసం వేచి చూస్తుంటారు. ఆ సమయంలో ఏదైనా అత్యవసర కేసు వస్తే దానిని తిరుపతి, బెంగళూరుకు తరలించేందుకు పోటీపడుతూ వాహనాలు తీసుకొచ్చి ఒకదాని వెనుక మరొకటి నిలుపుతున్నారు. బాధితులు ఏ వాహనంలో వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఒక వాహనంలో ఎక్కితే.. మరో వాహనదారుడు గొడవకు వస్తున్నాడు. ఇలా ఐదారుగురు తమ వాహనాలను అడ్డంగా పెట్టి వాగ్వాదానికి దిగి గొడవలకు పాల్పడుతున్నారు. దీంతో కేసుల తరలింపులో బాగా ఆలస్యమవుతోంది. ఇక అత్యవసర కేసులైతే దారిలో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక రాత్రిపూట అయితే మద్యం తాగి ఆస్పత్రిలో తిరుగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో ఔట్‌పోస్టు పోలీసులు ఉన్నా.. వారి మాటలను లెక్కచేయడం లేదు. వీరి ఆగడాలకు ఆస్పత్రిలోని కింది స్థాయి సిబ్బంది వంత పాడుతున్నారు. పేషెంట్ల తరలింపులో డ్రైవర్లకు సమాచారం అందిస్తూ.. వారి నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు కమీషన్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆస్పత్రి అధికారులు పలుమార్లు మందలించినా ఉద్యోగుల్లో మార్పు రాలేదు.


కొన్ని ఉదాహరణలు..

- మదనపల్లె పట్టణంలోని టౌన్‌ బ్యాంకు సర్కిల్‌లో కొద్దిరోజుల కిందట రోడ్డు ప్రమాదం జరిగి దంపతులు గాయపడ్డారు. బాధితులను జిల్లా ఆస్పత్రి నుంచి తిరుపతికి తరలించే క్రమంలో డ్రైవర్ల మధ్య గొడవ జరిగింది. ఎవరెన్ని చెప్పినా వినకుండా గొడవపడుతూ క్షతగాత్రులను ఆలస్యంగా తరలించారు. దీంతో వారి కుటుంబీకులు డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డ్రైవర్లను చెదరగొట్టారు. 

- ఇటీవల ఓ రోగి ఆస్పత్రిలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు రూ.6 వేలు బాడుగ అడిగారు. అంత ఇచ్చుకోలేమని, రూ.3 వేలు ఇస్తామని బాధితులు అనడంతో వారిపై గొడవకు వెళ్లారు. తమకు తెలిసిన వాహన డ్రైవర్‌ ఉన్నాడని, డీజల్‌ పట్టించి రూ.వెయ్యి అద్దె ఇస్తే ఊరు చేరుస్తాడని మృతుడి బంధువులు అనడంతో ఎవరినీ ఆస్పత్రి లోపలికి రానివ్వమంటూ డ్రైవర్లు తెగేసి చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన డ్రైవర్‌ పట్ల అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా అతడిని ఆస్పత్రి నుంచి పంపేశారు. తమ వాహనంలోనే వెళ్లాలంటూ మార్చురీ వద్ద అంబులెన్స్‌ను అడ్డంగా నిలిపి ఉంచారు. దీంతో బాధితులు అప్పుచేసి రూ.4 వేలు అద్దె ఇస్తే.. అప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లారు. 

- నాలుగు రోజుల కిందట ఓ స్కూటరిస్టు రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జిల్లా ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించేందుకు రూ.8 వేలు అద్దె అడిగారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు ఓ తండ్రి పడిన బాధ వర్ణణాతీతం. అలాంటి ఘటనలు మదనపల్లెలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల మాఫియాకు హద్దు లేకుండాపోతోంది. దీనికి అడ్డుకట్ట వేయకుంటే డ్రైవర్లు రాబందుల్లా మారే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.


డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం..

ఆస్పత్రిలో గొడవలకు పాల్పడే డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం. రోగుల తరలింపులో పోటీ పడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడడం చట్టరీత్యా నేరం. నిర్దేశిత అద్దె మాత్రమే వసూలు చేయాలి. అంతకుమించి ఎక్కువ చేస్తే వాహనాలను సీజ్‌ చేస్తాం. డ్రైవర్ల ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. పలుమార్లు స్టేషన్‌కు రప్పించి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చాం. డ్రైవర్ల దందా ఇలాగే కొనసాగితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే శిక్ష తప్పదు.

- కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె





Updated Date - 2022-04-28T05:06:48+05:30 IST