Abn logo
Jul 1 2020 @ 01:37AM

అయ్యా, ఈ అంశాలు ఆలోచించండి!

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్నది. ఇందులో ప్రభుత్వ తప్పిదం ఉన్నదా అంటే, ఉద్దేశ్యపూర్వకంగా చేశారని అనలేము. పరీక్షల సంఖ్య విషయంలో ఎందుకో మొదటినుంచి మొండిపట్టుతో ఉన్నారు కానీ, తక్కిన అన్ని విషయాలలో ప్రభుత్వం, అధికారులు, వైద్యసిబ్బంది తమ శాయశక్తులా విధినిర్వహణ చేస్తున్నారు. అయినా, దురదృష్టకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇట్లాగే కొనసాగితే, ఎదుర్కొనడానికి ప్రభుత్వం వద్ద వైద్య సదుపాయాలూ లేవు, సిబ్బందీ లేరు. ప్రజలలో భయం పెరుగుతున్నది. ప్రభుత్వం మీద, ఆస్పత్రుల మీద అపనమ్మకం పెరుగుతున్నది. ఈ పరిస్థితులలో ఇప్పటికైనా ఈ కింది సూచనలను పాటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.


1. ప్రజలతో మాట్లాడండి, మీడియా ద్వారా వారు చెప్పేది వినండి: కేంద్రప్రభుత్వం మాదిరిగా ఎవరో ఒకరు ప్రతిరోజూ సాయంత్రం కరోనా పరిస్థితిని టెలివిజన్‌ ద్వారా ప్రజలకు వివరించండి. ప్రజల సందేహాలను నివృత్తి చేయండి. బాగా కోలుకుంటున్నారంటే, అదే చెప్పండి. లేదూ, మరణాలు పెరుగుతున్నాయంటే అదే చెప్పండి. ప్రజలు ఏం జాగ్రత్త తీసుకోవాలో సూచనలు చేయండి. దయచేసి, ముఖం చాటేయకండి. 


2. ప్రజల సహకారం తీసుకోండి: వలసకార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు తమ డబ్బు, శ్రమ, సమయం ఇచ్చిన పరోపకారులు ఎందరో ఉన్నారు. వారు కరోనా విషయంలో సమాజంలో చైతన్యాన్ని అందించలేరా? అవసరమైన సహకారాన్ని రాబట్టలేరా? పరీక్షా కేంద్రాల దగ్గర, ఆస్పత్రివార్డుల దగ్గరా ఈ వలంటీర్లు పేషంట్ల కుటుంబసభ్యులకు, వైద్యసిబ్బంది, అధికారులకు మధ్య వారధిలా పనిచేస్తారు. అట్లాగే, బస్తీల్లో, కాలనీల్లో కూడా వీరు ప్రజలలో జాగ్రత్తల గురించిన ప్రచారం చేస్తారు. ప్రజలకు అప్పటికప్పుడు అందవలసిన సహాయంపై సమన్వయం చేస్తారు. ఎందుకు ప్రజాభాగస్వామ్యాన్ని వద్దనుకుంటున్నారు? వివిధ పార్టీల సం ఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, వృత్తి సంఘాలు- తమ తమసభ్యులకు ప్రభుత్వ సందేశాన్ని, పాటించవలసిన మార్గదర్శకాలను ప్రచారం చేయలేవా? వారి సాయం ఎందుకు కోరరు? 


3. వైద్యసహాయకులను వెంటనే నియమించుకోండి: వైద్యులు ఏ విభాగానికి చెందినవారు అని చూడకుండా, అందరు డాక్టర్లనూ కరోనాసేవలోకి తీసుకోండి. కొద్దిపాటి వైద్య పరిజ్ఞానం, వ్యక్తిగత సేవల అనుభవం ఉన్నవారిని వలంటీర్లుగా తీసుకుని కరోనా ప్రొటోకాల్స్‌పై సత్వర శిక్షణ ఇవ్వండి. చాలామంది యువకులు, ఔత్సాహికులు, పేరామెడికల్స్‌ ముందుకు వస్తారు. 


4. విస్తృతంగా పరీక్షలు చేయండి. రేపిడ్‌ పరీక్షలైనా సరే. ప్రజలలో వైద్యసిబ్బంది తిరిగి, నమూనాలు సేకరించడం, ప్రజలతో మాట్లాడడం చేస్తూ ఉంటే, విశ్వాసం పెరుగుతుంది. ధైర్యం కలుగుతుంది. 


5. మనం ఎదుర్కొంటున్నది చిన్న విపత్తు కాదు. ఆదమరిస్తే జరిగే నష్టం అపారమయినది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే, అరాచకం, హింస, అభద్రతాభావం పెరిగిపోతాయి. ముందే మేల్కొనండి. మేధావులతో నిపుణులతో మాట్లాడండి. భేషజాలకు పోకండి. 

డాక్టర్‌ అలమాల నాగేశ్వరరావు, హైదరాబాద్‌

Advertisement
Advertisement
Advertisement