నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం

ABN , First Publish Date - 2022-05-18T05:19:24+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే దుకాణదారుల డీలర్‌షిప్‌ లైసెన్సులు రద్దుచేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
హుస్నాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌

రైతుకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలి

ఆయిల్‌పామ్‌ తోటల పెంపకంపై రైతును ప్రోత్సహించాలి

జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ 

హుస్నాబాద్‌రూరల్‌, మే 17: జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే దుకాణదారుల డీలర్‌షిప్‌ లైసెన్సులు రద్దుచేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ హెచ్చరించారు. మంగళవారం హుస్నాబాద్‌ పట్టణంలోని రైతువేదికలో హుస్నాబాద్‌, అక్కన్నపేట, బెజ్జంకి మండలాలకు చెందిన డీలర్లకు వానాకాలం వ్యవసాయ సాగు విధానం, ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లైసెన్సులు లేకుండా ఎవరైనా విత్తనాలు గానీ, ఎరువులు గానీ అమ్మితే తమకు సమాచారం అందించాలన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం తమ వద్దకు వచ్చే రైతులకు నాణ్యమైనవి అందించి వారికి బిల్లులు ఇవ్వాలన్నారు. ఎక్కువశాతం వ్యవసాయ భూముల్లో భాస్వరం నిలువలు పేరుకుపోయి దిగుబడి తగ్గుతుందని, కావున భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వాడే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పచ్చిరొట్ట పైర్లు వంటి జనుము, జీలుగ వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. యూరియా వాడకాన్ని తక్కువ మోతాదులో వాడేవిధంగా తగు సలాహాలు, సూచనలు రైతులకు ఇవ్వాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇస్తున్న ఆయిల్‌పామ్‌, మల్బరీ తోటల పెంపకంపై రైతుల దృష్టి మళ్లించే విధంగా సాగు మెళకువలు అందించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యకరమంలో మండల వ్యవసాయ అధికారి నాగరాజు, మూడు మండలాలకు చెందిన ఎరువులు, విత్తనాల డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:19:24+05:30 IST