Abn logo
Sep 23 2021 @ 03:29AM

సర్వర్‌తో ప‘రేషాన్‌’

  • అనంత, కర్నూలులో డీలర్ల ఆందోళన..
  • సమస్య పరిష్కరించాలని డిమాండ్‌
  • రెండు జిల్లాల్లో దుకాణాలు బంద్‌
  • అనంతలో ఈ పోస్‌ యంత్రాల అప్పగింత 


అనంతపురం/కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రేషన్‌ డీలర్లు ఆందోళన బాట పట్టారు. ఏపీ డీలర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దుకాణాలు బంద్‌ చేసి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎఫ్‌పీ షాపులకు డీలర్లు తాళాలు వేశారు. ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ఈ పోస్‌ యంత్రాలతో నిరసన చేపట్టారు. అనంతరం వీటిని అధికారులకు అప్పగించారు. బియ్యం కోసం దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారని, సర్వర్లు మొరాయిస్తుండటంతో పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. సర్వర్ల సమస్య తీర్చే దాకా మీ వద్దనే ఈ పోస్‌ యంత్రాలు ఉంచుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సర్వర్ల సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 


కర్నూలు జిల్లాలో.. 

సర్వర్‌ సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లాలో డీలర్లు దుకాణాలు బంద్‌ చేసి నిరసన తెలిపారు. ఏపీ డీలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ ఖాద్రీ ఆధ్వర్యంలో కర్నూలులో పౌరసరఫరాల విభాగం ఏఎ్‌సవో రామాంజినేయులుకు డీలర్లు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సయ్యద్‌ ఖాద్రీ మాట్లాడుతూ.. మూడు రోజులుగా సర్వర్‌ పని చేయడం లేదని, కార్డుదారులకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరవేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,548 రేషన్‌ దుకాణాలు ఉన్నాయని, 9 లక్షల మందికి నిత్యావసర సరుకులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వెంటనే సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...