‘డీల్‌’ కుదిరింది?

ABN , First Publish Date - 2020-06-04T10:18:04+05:30 IST

‘డీల్‌’ కుదిరింది?

‘డీల్‌’ కుదిరింది?

  • 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ‘ఆ’ ఇద్దరికి వాటా..?
  • అధికార పార్టీ కార్యకర్తల ఆక్రోశం!

కడప, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్లకు.. ఆ ఇద్దరు కీలక నేతలకు మధ్య డీల్‌ కుదిరిందా..? ఆర్థిక సంఘం నిధుల్లో పది శాతం కమిషన్‌ ఇచ్చేందుకు కాంట్రాక్టర్లు ఒకే అన్నారా..? ఆ ఐదుగురి కమిటీ కాంట్రాక్టరును రింగ్‌ చేసి గ్రీన్‌సిగ్నల్‌ ఇప్పించిందా.. అంటే ఔననే సమాధానం పలువురు కాంట్రాక్టర్ల నుంచి వినిపిస్తోంది. 


కేంద్ర ప్రభుత్వం కడప కార్పొరేషన్‌కు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.32.46 కోట్లు  కేటాయించింది. కార్పొరేషన్‌ పరిధిలో రహదారులు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, తాగునీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తం 221 పనులు చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులు అంచనాలు తయారు చేసి గురువారం టెండరు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నిధులపై కన్నేసిన కొందరు కాంట్రాక్టర్లను రింగ్‌ చేసి 10శాతం కమీషన్‌ తీసుకునేలా వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెస్తూ బుధవారం ‘వాటాల గోల’ అనే కథనం ప్రచురించింది. ఈ వార్త కార్పొరేషన్‌ పరిధిలోని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇద్దరి సూచనల మేరకు ఆ కమిటీ కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి 10 శాతం కమీషన్‌ ఇచ్చేలా డీల్‌ కుదిర్చినట్లు ప్రచారం సాగుతోంది. డీల్‌ ఒకే కావడంతో గురువారం జరగనున్న టెండర్లలో కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉండకపోవచ్చని అంటున్నారు.


అయితే.. పార్టీ కోసం కష్టపడ్డ తాము కూడా పనుల కోసం పర్సంటేజీలు ఇవ్వాల్సి రావడం ఏంటి అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అభివృద్ధి పనులు మంజూరైతే వాటిని ఆయా డివిజన్ల ప్రతినిధులకు కేటాయించే వారు. ఈసారి అంతా రివర్స్‌లో జరుగుతుండడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

Updated Date - 2020-06-04T10:18:04+05:30 IST