లాక్‌డౌన్‌లో డెడ్‌లైన్లా?

ABN , First Publish Date - 2020-08-04T10:35:26+05:30 IST

లాక్‌డౌన్‌లో బయటికెళ్తే ఏ పనీ సరిగా పూర్తవట్లేదు. చిన్న పని కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.

లాక్‌డౌన్‌లో డెడ్‌లైన్లా?

 ఉపాధ్యాయులను కలవర పెడుతున్న ఈ-ఎ్‌సఆర్‌!

ఆన్‌లైన్‌లో నమోదుకు అష్టకష్ట్టాలు

తెరుచుకోని నెట్‌ సెంటర్లు

 కొందరు ఎంఈఓలు ఎస్‌ఆర్‌లలో ఎంట్రీలే వేయని వైనం

మంగళవారంలోగా 100 శాతం చేయాలంటున్న డీఈఓ

25 వరకు అవకాశమిచ్చిన కమిషనరేట్‌ వర్గాలు

అయోమయంలో టీచర్లు


అనంతపురం విద్య, ఆగస్టు 3: లాక్‌డౌన్‌లో బయటికెళ్తే ఏ పనీ సరిగా పూర్తవట్లేదు. చిన్న పని కోసం కూడా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌, అదీ గంటల కొద్దీ సమయం తీసుకునే పని అంటే అంతే సంగతులు. ఇక అయినట్లే. అలాంటి పనినే అత్యవసరంగా చేయాలంటున్నారు విద్యాశాఖ ఉన్నతాధికారులు. ఏకంగా డెడ్‌లైన్‌ పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయులు అయోమయంలో పడుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎలా చేయగలమంటూ ఆవేదన చెందుతున్నారు. జిల్లా విద్యా శాఖాధికారి మాత్రం మంగళవారానికి వంద శాతం పూర్తి కావాల్సిందేనంటున్నారు. కమిషనరేట్‌ వర్గాలు మాత్రం ఈనెల 25వ తేదీ వరకు గడువిస్తున్నాయి. అప్పట్లోగా కూడా పూర్తి చేసే మార్గం కానరాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.


ఉపాధ్యాయ, ఉద్యోగులకు అత్యంత ప్రధానమైన సర్వీసు రిజిస్టర్‌ను ఈ-ఎ్‌సఆర్‌గా అప్‌డేట్‌ చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇది మంచి నిర్ణయమే. కానీ కరోనా నేపథ్యంలో నెట్‌సెంటర్లు లేని, ఇంటి నుంచి బయటకు అడుగేయలేని, కార్యాలయాలు సైతం అరకొరగా నడిచే సమయంలో ఉపాధ్యాయులను ఈ-ఎ్‌సఆర్‌ అప్‌డేట్‌ చేయాలంటూ డెడ్‌లైన్లు పెడుతుండటంతో.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.


కీలకమైనా.. ప్రస్తుతం కష్టమే..!

ఉద్యోగి జీవితంలో ఎస్‌ఆర్‌ అత్యంత ప్రధానం. పుస్తకరూపంలో ఉన్న ఎస్‌ఆర్‌ కాలిపోయినా.. తడిసి పాడైనా.. పోగొట్టుకున్నా తిరిగి పొందాలంటే గగనమే. దానిని డిజిటలైజ్‌ చేసే క్రమంలో ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు ప్రభుత్వం పూనుకుంది. టీడీపీ హయాంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వైసీపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న విద్యాశాఖాధికారులు కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో చేయాలంటూ నెలరోజుల క్రితం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జూలై చివరికి పూర్తి చేయాలంటూ డెడ్‌లైన్‌ విధించారు. తరువాత పొడిగించారు. మళ్లీ డెడ్‌లైన్‌ పెట్టడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు చాలా సమయం పడుతుందంటున్నారు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు.


విద్యార్హత సర్టిఫికెట్ల నుంచి ఉద్యోగం చేస్తున్న ప్రస్తుత స్థితి వరకూ ఎస్‌ఆర్‌లోని వివరాలు, ఉద్యోగి ఆస్తులు, ఆధార్‌, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పైగా 60 నుంచి 70 సర్టిఫికెట్ల కాపీలు స్కాన్‌చేసి, అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ-ఎ్‌సఆర్‌ నమోదు ప్రక్రియలో ఏకంగా 12 రకాల అంశాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. పైగా టీచర్లు అన్నీ రెడీ చేసి, సబ్‌మిట్‌ చేస్తే మండల పరిషత్‌ టీచర్లకు ఎంఈఓలు ఓకేచేయాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులకు వారు అంతా రెడీ చేసి, సబ్‌మిట్‌ చేస్తే డీవైఈఓ ఓకేచేయాల్సి ఉంటుంది. ఒకేమండలంలో 200 నుంచి 300 మంది టీచర్లు ఉంటే.. వారంతా ఎంఈఓతో హార్డ్‌ కాపీలపై ఆమోదం పొందాల్సి ఉంటుంది. కొవిడ్‌ పరిస్థితుల్లో ఎలా సాధ్యమంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు.


సదుపాయాలేవీ?

ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు సదుపాయాల్లేవ్‌. టీచర్లను సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటున్నారు. కొవిడ్‌, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో నెట్‌సెంటర్లు తెరవట్లేదు. ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు కనీసం 3 నుంచి 5 రోజులు పడుతుందని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. నెట్‌ సదుపాయం బాగా ఉండి, కంప్యూటర్‌ పరిజ్ఞానం తెలిసి, అన్నీ సిద్ధంగా ఉంటే పూర్తవుతుంది. ఉదయం 11 గంటల వరకే నెట్‌ సెంటర్లు ఓపెన్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఎస్‌ఆర్‌ నమోదు చేయగలమని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ అంతమయ్యాక పూర్తి చేసేలా అవకాశమివ్వాలని కోరుతున్నారు.


చాలా సమయం పడుతోంది:నారాయణస్వామి, రాష్ట్ర కార్యదర్శి, ఆపస్‌

సర్వీసు రిజిస్టర్‌ ఆన్‌లైన్‌ చేయాలనుకోవటం మంచిదే. ఇందుకు చాలా సమయం తీసుకుంటుంది. చాలామంది ఉపాధ్యాయులు రెడ్‌, కంటైన్మెంట్‌ జోన్లలో ఉంటున్నారు. నెట్‌సెంటర్లు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కాకుండా తర్వాత ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు అవకాశమివ్వాలి.


త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తాం:వెంకటస్వామి, ఎంఈఓ, అనంతపురం

ఈ-ఎ్‌సఆర్‌ ఉద్యోగులకు చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే ఉపాధ్యాయులను అప్రమత్తం చేసింది. వారు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. గడువులోగా పూర్తి చేసేలా చూస్తాం.


గడువు పొడిగించాలి:రమే్‌షబాబు, పాఠశాలల సూపర్‌వైజర్‌

కొవిడ్‌ నేపథ్యంలో నెట్‌ సెంటర్లు అందుబాటులో లేవు. పెద్దగా కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని కొందరు టీచర్లు నెట్‌సెంటర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఈ-ఎ్‌సఆర్‌ నమోదుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు పొడిగించాలి.

Updated Date - 2020-08-04T10:35:26+05:30 IST