మరో 3 రోజులే!

ABN , First Publish Date - 2022-08-13T05:24:59+05:30 IST

జిల్లాలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వస్తున్నా ప్రక్రియ సజావుగా ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. ఇప్పటివరకూ కేవలం 54.19 శాతమే పూర్తయ్యింది. పీఎం కిసాన్‌ నిధి పథకం కింద రైతులకు సాగు ప్రోత్సాహం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6

మరో 3 రోజులే!

పీఎం కిసాన్‌ ఈకేవైసీకి గడువు

పూర్తయినది కేవలం 54.19 శాతమే

మల్లగుల్లాలు పడుతున్న అధికారులు

(గజపతినగరం)

జిల్లాలో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ వస్తున్నా  ప్రక్రియ సజావుగా ముందుకు సాగడం లేదు. రైతుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. ఇప్పటివరకూ కేవలం 54.19 శాతమే పూర్తయ్యింది. పీఎం కిసాన్‌ నిధి పథకం కింద రైతులకు సాగు ప్రోత్సాహం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు సాయమందిస్తోంది. అయితే ఆధార్‌, బ్యాంకు ఖాతా అనుసంధానం, ఈకేవైసీ నమోదు వంటి సాంకేతిక సమస్యలతో చాలామంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకిసాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు అందజేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో సాయం విడుదల చేసింది. కాగా, రైతులు అధికంగా ఉన్నా.. సాంకేతిక కారణాలు చూపి అర్హులకు డబ్బులు అందజేయడం లేదు. మరోవైపు ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యోగులు, మృతుల పేరిట వారి కుటుంబ సభ్యుల్లో కొందరికి సాయం అందుతోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. జూలై 31వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. కానీ సగం కూడా పూర్తికాకపోవడంతో ఆగస్టు 15 వరకూ గడువు పెంచింది. ఈ సారి కూడా లక్ష్యం పూర్తయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.   

 ఇదీ పరిస్థితి

జిల్లాలో 2 లక్షల 69 వేల 327 మంది రైతులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ 1,45,945 మంది మాత్రమే ఈకేవైసీ పూర్తిచేసుకున్నారు. ఇంకా 1,44,388 మంది చేయించుకోవాల్సి ఉంది. ఇంకా 3 రోజులే ఉండడంతో లక్ష్యం అసాధ్యమని అధికారులు భావిస్తున్నారు. మరోసారి గడువు పెంచక తప్పదని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం గడువులు పెంచుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి గడువు పెంచక తప్పదని తెలుస్తోంది. 

 నమోదు తప్పనిసరి

అర్హులు తప్పకుండా ఈకేవైసీపీ నమోదు చేసుకోవాలి. లేకుంటే కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి దూరమవుతారు. గడువు సమీపిస్తుండడంతో ప్రతిఒక్కరూ ప్రక్రియ పూర్తిచేయాలి. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. 

-కె.మహరాజన్‌, ఏడీఏ, వ్యవసాయ శాఖ



Updated Date - 2022-08-13T05:24:59+05:30 IST