మృత్యుదారులు!

ABN , First Publish Date - 2022-06-08T05:30:00+05:30 IST

మృత్యుదారులు!

మృత్యుదారులు!
మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ప్రమాదకరంగా జాతీయ రహదారి


  • ప్రమాదకరంగా హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే
  • సూచిక బోర్డులు లేకుండా డేంజర్‌గా మూలమలుపులు 
  • మృత్యువాతపడుతున్న వాహనదారులు
  • పట్టించుకోని అధికారులు, పాలకులు 

హైవేలు మృత్యు కుహరాలుగా తయారయ్యాయి. పేరుకు జాతీయ రహదారులే కానీ.. ఇరుకు రోడ్లు, ప్రమాదకర మూల మలుపులతో ప్రయాణికులను బలికొంటున్నాయి. రహదారులపై ఎలాంటి సూచికలూ లేకపోవడంతో రోజూ భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.

మొయినాబాద్‌ రూరల్‌, జూన్‌ 8 : మొయినాబాద్‌, చేవెళ్ల మండలాల మీదుగా వెళ్లే హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. అనేక మూలమలుపులతో కూడిన ఈ రోడ్డుపై వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నగర శివారు ప్రాంతం కావడంతో వాహనాలతో ఈరోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. పలువురు ప్రముఖులు ఈ ప్రాంతం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన లైట్లు సైతం వెలగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై వాహనాలు ఇష్టానుసారంగా అతివేగం, అజాగ్రత్తతో నడిపిస్తుండడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రోడ్డు విస్తరణకు మోక్షం లభించిందని సంబరపడిన ప్రజలకు రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు. విస్తరణ పనులకు తామంటే తాము కృషి చేసినట్లు ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పనులు మాత్రం నేటికీ ప్రారంభం కాకపోవంతో ఈ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. 

నగరంలోని లంగర్‌హౌస్‌ టిప్పుఖాన్‌ వంతెన నుంచి మొయినాబాద్‌, చేవెళ్ల మండలాల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ వరకు ఈ రహదారిని అప్పట్లో రెండు వరుసలుగా నిర్మించారు. అనంతరం వాహనాల రద్దీ దృష్ట్యా రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించారు. ఈ జాతీయ రహదారిపై అనేక మూలమలుపులు ఉన్నాయి. దీంతో నిత్యం అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాతీయరహదారిపై చేవెళ్ల సమీపంలో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మండలంలోని అజీజ్‌నగర్‌ చౌరస్తా సమీపంలోని మూలమలుపు వద్ద ఇటీవల కాలంలో 10 ప్రమాదాలు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది ఈప్రాంతంలోనే ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. గతంలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి దర్శనార్ధం వచ్చిన గవర్నర్‌ కాన్వయ్‌లోని వాహనం ఇదే మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై ఓ గన్‌మెన్‌ మృతి చెందాడు. అయినా నేటికీ అక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఈ జాతీయ రహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఈ రహదారి ఆర్‌అండ్‌బీ హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. అయినా అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

మూలమలుపులు ఉన్నది ఇక్కడే.. 

మొయినాబాద్‌ మండలంలో బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి దాదాపు 25 కిలోమీటర్ల మేర ఉన్నది. అయితే ఈ రోడ్డుపై అనేక ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. మండలంలోని హిమాయత్‌నగర్‌ రెవెన్యూపరిధిలోని గండిపేటచౌరస్తాలో మూలమలుపు అతి ప్రమాదకరంగా ఉంది. డీలెక్యు రిసార్టుకు వెళ్లే రహదారి వద్ద మూలమలుపు కూడా డేంజర్‌గా ఉంది. అంతేకాకుండా అజీజ్‌ నగర్‌, ఎన్కేపల్లి, హిమాయత్‌నగర్‌, ఆమ్డాపూర్‌ చౌరస్తాలు, మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట, కనకమామిడి, చిన్నషాపూర్‌, తోలుకట్ట చౌరస్తాల వద్ద బీజాపూర్‌-హైదరాబాద్‌ రహదారిపై  తీవ్రమైన మూల మలుపులున్నాయి. ఆ ప్రాంతాల్లోనే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. 

ఇటీవల కాలంలో జరిగిన ప్రమాదాలు

కేతిరెడ్డిపల్లి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రెడ్డిపల్లికి చెందిన ఇద్దరు యువతులు తాజ్‌డ్రైవ్‌ సమీపంలో వాహనం ఢీకొని మృతి చెందారు. పోలీ్‌సస్టేషన్‌ సమీపంలో ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. తాజాగా సోమవారం రాత్రి చేవెళ్లమండలానికి చెందిన పరాంధామము(23) హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో తన ద్విచక్ర వాహనాన్ని యూ టర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి ప్రైవేటు బస్సు ఢీకొనడం అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే స్థలంలో పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి(35) తన ద్విచక్ర వాహనాన్ని మంగళవారం తెల్లవారు జామున వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలా వారంలో ఈ రోడ్డుపై రెండు మూడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా ఎంతమంది ప్రాణాలను పోతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఈ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. 

ప్రమాదాలను అరికట్టాలి

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం, ఆర్‌ఎండ్‌బీ అధికారులు వీటి నివారణకు కృషి చేయడం లేదు. ప్రాణాలు గాలీలో కలుస్తున్న పట్టించుకునే వారే లేరు. కనీసం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు లేవు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద భారీ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి. 

                                            - గోపీకాంత్‌, చిలుకూరు గ్రామం, మొయినాబాద్‌ మండలం

అధికారులు చర్యలు తీసుకోవాలి

మొయినాబాద్‌, చేవెళ్ల మండలాల పరిధిలో ఉన్న హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ఉన్న ప్రమాదకర మూలమలుపుల వద్ద సూచికబోర్డులు ఏర్పాటు చేయాలి. అజాగ్రత్తగా వాహనం నడపడం, మూలమలుపులను గుర్తించకపోవడం వలన అనేకమంది వాహనదారులు మృత్యువాత పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలి. ఇప్పటికైనా అధికారులు జాతీయ రహదారిని పర్యవేక్షించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలి. 

                               - మహేందర్‌ ముదిరాజ్‌, బాకారం గ్రామం, మొయినాబాద్‌ మండలం.   

ప్రజల్లో మార్పు రావాలి

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కృషి చేస్తు న్నాం. నిత్యం పలు చౌరస్తాల వద్ద తనిఖీలు చేపడుతున్నాం. అంతేకాకుండా గ్రామాల్లో ట్రాఫిక్‌ సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు హెల్మెట్‌ లేకుండా అజాగ్రత్తగా వాహనాలను నడుపుతున్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తుండడంతో వారు ఇష్టానుసారంగా రోడ్లపై వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజల్లో మార్పు రావాలి. ఉన్నతాధికారుల ఆదేశాలకనుగుణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాం.

                                         - లవకుమార్‌ రెడ్డి, సీఐ, రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌

Updated Date - 2022-06-08T05:30:00+05:30 IST