హైవే సర్వీస్‌ రోడ్డులో మృతదేహం

ABN , First Publish Date - 2022-09-30T04:04:27+05:30 IST

జాతీయ రహదారిలో సింగరాయకొండ వైపు నుంచి కొండపి రోడ్డులోకి ప్రవేశించే సర్వీస్‌ రోడ్డులో మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు.

హైవే సర్వీస్‌ రోడ్డులో మృతదేహం
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై, పోలీసులు

టంగుటూరు, సెప్టెంబరు 29 : జాతీయ రహదారిలో సింగరాయకొండ వైపు నుంచి కొండపి రోడ్డులోకి ప్రవేశించే సర్వీస్‌ రోడ్డులో మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. సిమెంటు బండల చాటున ఎవరికీ కనిపించకుండా పడి ఉన్న ఈ మృతదేహం నుంచి దుర్గంధం రావడంతో అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాషా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో దొరికిన చిన్న పుస్తకంలో ఉన్న ఫోన్‌ నెంబర్ల వ్యక్తులకు ఫోన్‌చేసి సమాచారం చేరవేశారు. సాయంత్రానికి మృతుని బంధువులు టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని మృతుని వివరాలు తెలియజేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వారిలో సోదరుడు శ్రీనివాసరావు, బావ శ్రీధర్‌ ఇతర బంధువులున్నారు. పోలీసులకు వారు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మృతుని పేరు వంకాయల శేషగిరిరావు(54), అతని స్వగ్రామం చిన్నగంజాం మండలంలోని పెదగంజాం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.  15 ఏళ్ల క్రితమే భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యాపిల్లలు అద్దంకిలో నివాసం ఉంటున్నారు. వారితో ఆయనకు సంబంధాలు లేవు. భార్య నుంచి విడిపోయిన దగ్గర నుంచి  స్వగ్రామం పెదగంజాంలో ఉండడం లేదు. ఊరు వదలి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామం వచ్చి వెళ్తుంటాడు. మతిస్థిమితం కూడా అంతగా లేదని వారు చెప్పారు. సుమారు 15 రోజుల క్రితం ఊరు నుంచి వెళ్లిపోయాడని, టంగుటూరు ఏవిధంగా చేరుకున్నాడు, ఎలా మృతిచెందాడన్నది స్పష్టం కాలేదు. శేషగిరిరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సంఘటనపై ఎస్సై బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Updated Date - 2022-09-30T04:04:27+05:30 IST