హమ్మయ్య..అన్‌లాక్‌-1 సడలింపులతో ఊరట

ABN , First Publish Date - 2020-06-02T09:08:09+05:30 IST

కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా జారీ చేసిన నిబంధనలు

హమ్మయ్య..అన్‌లాక్‌-1 సడలింపులతో ఊరట

పలు కంటైన్మెంట్‌ జోన్ల డీ నోటిఫికేషన్‌

నేటి నుంచి పలు ప్రాంతాల్లో దుకాణాలకు అనుమతి

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలకు అంగీకారం

రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకు కర్ఫ్యూ 

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా జారీ చేసిన నిబంధనలు పాటిస్తూ మంగళవారం నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తూ కలెక్టర్‌  ఆనంద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, వ్యాపార వర్గాలతో సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. గుంటూరులో పాజిటివ్‌ కేసులున్న 18 ఎలక్షన్‌ వార్డుల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వ్యాపార దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు. ప్రతీ రోజు రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. వరుసగా ఉన్న దుకాణాలలో ఒక రోజు 1, 3, 5, తర్వాత రోజు 2, 4, 6 దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.


మాస్కులు ధరించకుండా వచ్చే వారికి ఎలాంటి సరుకులు, వస్తువులు విక్రయించరాదన్నారు. రాత్రి ఏడు గంటలకల్లా దుకాణాలు మూసేశాలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్బన్‌ డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా దుకాణాల వద్ద భౌతిక దూరం, ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత దుకాణదారులపై ఉందన్నారు. షాపింగ్‌ మాల్స్‌ తెరవడానికి వీలు లేదని, బహుళ అంతస్తులున్న దుకాణాలు మాత్రం కేవలం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మాత్రమే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని, అలానే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధి కోసం స్థానిక మునిసిపల్‌, పోలీసు అధికారులను సంప్రదించాలన్నారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 


గుంటూరులోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు ఇవే..

కంటైన్‌మెంట్‌ జోన్‌-1: ఇజ్రాయిల్‌పేట మెయిన్‌ రోడ్డు(ఒకటో లైను, గవర్నమెంట్‌ స్కూల్‌ రోడ్డు, మద్రాసు - గుంటూరు రోడ్డు, రైల్వే ట్రాక్‌), కుమ్మరిబజార్‌ చంద్రయ్యనగర్‌(నందివెలుగురోడ్డు, పాతగుంటూరు పార్కు రోడ్డు, చంద్రయ్యనగర్‌, మాచరాజువారి వీధి శివాలయం రోడ్డు). ఆనందపేట(శుద్ధపల్లి డొంకరోడ్డు, ఆనందపేట, గుంటూరు తెనాలి రోడ్డు, 5వ లైను)లు ఉన్నాయి. 


కంటైన్‌మెంట్‌ జోన్‌-2: రామిరెడ్డితోట(రైల్వేట్రాక్‌, మద్రాసు - గుంటూరు రోడ్డు, 8వ లైను, ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు), గుంటూరు వారితోట(పువ్వాడ వారి వీధి, మద్రాసు - గుంటూరు రోడ్డు, మూడో లైను, పొత్తూరు వారితోట రోడ్డు), సీతారాంనగర్‌(మెయిన్‌రోడ్డు, మద్రాసు - గుంటూరు రోడ్డు, రైల్వేట్రాక్‌, నెహ్రూనగర్‌ గేటు).


కంటైన్‌మెంట్‌ జోన్‌ 3: పవర్‌పేట(చినమసీదు వీధి, రామాలయం వీధి, లాంచెస్టర్‌ రోడ్డు, మంత్రివారి వీధి), అహ్మద్‌నగర్‌(గుంటూరు - తెనాలి రోడ్డు, పొన్నూరు రోడ్డు, ఐదో లైను, చినబజార్‌ ఏడో లైను), హుస్సేన్‌నగర్‌(గుంటూరు - తెనాలి రోడ్డు, చంద్రబాబునాయుడు కాలనీ, ఒకటో లైను, ఎక్స్‌టెన్షన్‌ ఏరియా).


కంటైన్‌మెంట్‌ జోన్‌ 4: శ్రీనివాసరావుతోట మెయిన్‌ రోడ్డు(గ్రాండ్‌ ట్రంక్‌రోడ్డు, 8, 9, 8/1 అడ్డరోడ్డు, అఖిల్‌ ఆర్కేడ్‌), కేవీపీ కాలనీ(కోదండరామయ్యనగర్‌ మెయిన్‌రోడ్డు, మునిసిపల్‌ స్కూల్‌ రోడ్డు, మూడో అడ్డరోడ్డు, గాయత్రీనగర్‌), జోసఫ్‌ నగర్‌(ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ మెయిన్‌ రోడ్డు, చుట్టుగుంట లాలుపురం రోడ్డు, పారిశ్రామికవాడ), ఏటీ అగ్రహారం(నాల్గో లైను, మెయిన్‌రోడ్డు, రామిరెడ్డినగర్‌ మెయిన్‌ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు), కన్నావారితోట(మెడికల్‌ కళాశాల రోడ్డు, రెండో లైను, నగరంపాలెం రెండో అడ్డరోడ్డు), శ్యామలానగర్‌(స్కైలార్క్‌ అపార్టుమెంట్‌, రెడ్డి బాలిక హాస్టల్‌ రోడ్డు, నల్లపాడు రైల్వేస్టేషన్‌ రోడ్డు, శ్యామలానగర్‌ మెయిన్‌ రోడ్డు, లోగోస్‌ పబ్లిక్‌ స్కూల్‌ రోడ్డు).


కంటైన్‌మెంట్‌ జోన్‌ 5: రెడ్డిపాలెం(శివారెడ్డిపాలెం మెయిన్‌ రోడ్డు, రామాలయం రోడ్డు, టెలికం నగర్‌ మెయిన్‌ లైను, ఆర్‌కే రోడ్డు), గోరంట్ల(కుమ్మర్ల బజార్‌, తూర్పుబజార్‌, శ్రీలక్ష్మీనగర్‌, కోరుమళ్ల బజార్‌).


కంటైన్‌మెంట్‌ జోన్‌ 6: ఎస్‌వీఎన్‌ కాలనీ(తారకరామనగర్‌ మెయిన్‌రోడ్డు, ఎస్‌వీఎన్‌ కాలనీ 6/2వ రోడ్డు, 6/5వ రోడ్డు, 5/2వ రోడ్డు), జేకేసీ కళాశాల రోడ్డు(విజయపురి కాలనీ ఏడో లైను, రెండో అడ్డరోడ్డు, ఒకటో అడ్డరోడ్డు, నాల్గో లైను). 

Updated Date - 2020-06-02T09:08:09+05:30 IST