వంకను పూడ్చి.. రోడ్డు వేసేందుకు డీఈ యత్నం

ABN , First Publish Date - 2022-01-21T05:09:46+05:30 IST

వాగులు వంకల ఆక్రమణను అడ్డుకోవాల్సిన ఓ అధికారి తన స్వలాభం కోసం ఏకంగా వంకనే రహదారిగా మార్చేందుకు ప్రయత్నించారు. ఎక్స్‌కవేటర్‌, పోలీ్‌స బందోబస్తుతో వచ్చి మరీ రోడ్డు వేసే ప్రయత్నం చేస్తుండగా రైతులు, గ్రామస్థులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన సంఘటన గురువారం మైదుకూరు మండలంలోని సోమయాజులపల్లె వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

వంకను పూడ్చి.. రోడ్డు వేసేందుకు డీఈ యత్నం
వక్కిలేరు వంకలో పనులు చేయిస్తున్న డీఈ

అడ్డుకున్న రైతులు, గ్రామస్థులు

మైదుకూరు, జనవరి 20: వాగులు వంకల ఆక్రమణను అడ్డుకోవాల్సిన ఓ అధికారి  తన స్వలాభం కోసం ఏకంగా వంకనే రహదారిగా మార్చేందుకు ప్రయత్నించారు. ఎక్స్‌కవేటర్‌, పోలీ్‌స బందోబస్తుతో వచ్చి మరీ రోడ్డు వేసే ప్రయత్నం చేస్తుండగా రైతులు, గ్రామస్థులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన సంఘటన గురువారం మైదుకూరు మండలంలోని సోమయాజులపల్లె వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 

మైదుకూరు మండలం అన్నలూరు పంచాయతీలోని సోమయాజులపల్లె సమీపంలో వక్కిలేరు వంక ప్రవహిస్తోంది. ఈ వంక వర్షాకాలం ఏరులా పారుతూ రైతులకు ఉపయోగపడుతోంది. ఆ వంకలో రోడ్డువేసేందుకు గురువారం పంచాయతీరాజ్‌ డీఈ మల్లేశ్వరరెడ్డి తన స్వంత తమ్ముడైన ఖాజీపేట పంచాయతీరాజ్‌ ఇన్‌చార్జ్‌ ఏఈ మల్లారెడ్డితో కలసి పోలీస్‌ బందోబస్తుతో అక్కడకు చేరుకున్నారు. రహదారిని నిర్మించేందుకు గ్రావెల్‌ తోలించి ఎక్స్‌కవేటర్‌తో  పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు, గ్రామస్థులు  అక్కడికి వెళ్లి వంకను అక్రమించి రోడ్డు ఎలా వేస్తారంటూ వారితో వాదనకు దిగారు. ఇది తహసీల్దారు ఉత్తర్వుల మేరకే చేస్తున్నామంటూ వారు చెప్పారు. ఉత్తర్వులు చూపాలని రైతులు ప్రశ్నించడంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. వంకను ఆక్రమిస్తే వర్షాకాంలో పొలాల్లోకి నీళ్లు వచ్చి పంటలకు నష్టం వాటిల్లుతుందని, అయినా వంకలో రోడ్డు ఎలా వేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మైదుకూరు పంచాయతీరాజ్‌ డీఈకి బంధువులైన కొంతమంది వైసీపీ నాయకులకు వ్యవసాయ భూములు, తోటలున్నాయని అందుకే కొత్త రోడ్డు వేసుకుంటున్నారని ఆరోపించారు. వారి పొలాలకు చేరుకునేందుకు పాత రోడ్డు ఉందని, కొన్నేళ్ల క్రితం రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో మరమ్మతులు కూడా చేశారన్నారు. అయితే భూములు, తోటల విలువ పెంచుకునేందుకు రోడ్డు వెడల్పులో భాగంగా వంకను ఆక్రమించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై మైదుకూరు తహసీల్దారు ప్రేమంతకుమార్‌ను వివరణ కోరగా వంకలో రోడ్డు ఎందుకు వేయిస్తామని అన్నారు. తాము ఎవ్వరికీ ఉత్తర్వులు ఇవ్వలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బందోబస్తుపై సీఐ చలపతిని వివరణ కోరగా, పంచాయతీరాజ్‌ డీఈ బందోబస్తు కల్పించాలని రాతపూర్వకంగా దరఖాస్తు పెట్టుకోవడంతో పోలీసులను పంపించామని అన్నారు. ఇదే విషయంపై డీఈ మల్లేశ్వరరెడ్డిని ఫోనలో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా ఓ ఉన్నత స్థాయి అధికారే ఏకంగా వంకను ఆక్రమించుకొని రహదారి వేసేందుకు పూనుకోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.



Updated Date - 2022-01-21T05:09:46+05:30 IST