ఎస్‌బీఐ వివాదాస్పద ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-29T21:37:22+05:30 IST

మూడు నెలల గర్భంతో ఉన్నవారు తాత్కాలికంగా ఉద్యోగానికి అనర్హులంటూ భారతీయ స్టేట్ బ్యాంకు జారీ చేసిన

ఎస్‌బీఐ వివాదాస్పద ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం

న్యూఢిల్లీ: మూడు నెలల గర్భంతో ఉన్నవారు తాత్కాలికంగా ఉద్యోగానికి అనర్హులంటూ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.


మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఎస్‌బీఐ ఇటీవల ఉత్తర్వులు జారీ చేస్తూ.. నియామక సమయానికి మూడు నెలల గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులు అవుతారని పేర్కొంది. వారు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత మాత్రమే ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంది.


గత నెల 31న ఈ ఆదేశాలు జారీ చేయగా, నూతన నియామకాలకు డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చింది. పదోన్నతులపై వెళ్లే వారికి మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా, ప్రస్తుతం ఆరు నెలల వరకు గర్భం ఉన్న మహిళలు వివిధ షరతులకు లోబడి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.


ఎస్‌బీఐ జారీ చేసిన ఈ వివాదాస్పద ఆదేశాలపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమే కాకుండా, వివక్ష కూడా అని పేర్కొంది. ఈ మహిళా వ్యతిరేక ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్టు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

Updated Date - 2022-01-29T21:37:22+05:30 IST