సంక్షోభంలో సొసైటీలు

ABN , First Publish Date - 2020-08-03T10:19:58+05:30 IST

మార్కెటింగ్‌ సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్‌ వారి కాలం నుంచి రైతులకు, ప్రజలకు ..

సంక్షోభంలో సొసైటీలు

కళ తప్పిన డీసీఎంఎస్‌లు

ఆర్‌బీకేల ఏర్పాటుతో సమస్య

అధికారుల, సిబ్బంది జీతాలకూ కష్టమే

వైఎస్‌ హయాంలో వెలుగు.. జగన్‌ వచ్చాక..


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 2: మార్కెటింగ్‌ సొసైటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటీష్‌ వారి కాలం నుంచి రైతులకు, ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే సేవలను డీసీఎంఎస్‌లు నిర్వహిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం తీసుకున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు నిర్ణయంతో సంక్షోభంలో పడ్డాయి.


ఎరువులు కొనాలన్నా, పంట ఉత్పత్తులను మద్దతు ధరకు అమ్ముకోవాలన్నా ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ధర డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారానే రైతులకు లభించేదని, ప్రస్తుతం సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థల అధికారులు అంటున్నారు. డీసీఎంఎస్‌ కేంద్రాల అధికారులు, ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది. 


మూసేయక తప్పదా..?

ప్రజలకు నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించేందుకు బ్రిటీష్‌ వారి హయాంలో డీసీఎంఎస్‌లను ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా ప్రభుత్వం వీటి కార్యకలాపాలను తగ్గిస్తూ వచ్చింది. జిల్లాలో ఆదోని, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఆలూరు, బనగానపల్లె, డోన్‌, గూడూరు, కోడుమూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, పత్తికొండ, ప్యాపిలి, వెలుగోడు, ఎమ్మిగనూరు, దేవనకొండ కేంద్రాల్లో డీసీఎంఎస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అందిస్తున్నారు. మద్దతు ధరకు రైతల నుంచి పంట దిగుబడులు సేకరించే కార్యక్రమాన్ని కూడా సొసైటీల ద్వారానే మార్క్‌ఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌ సంస్థలు చేపడుతున్నాయి.


రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో డీసీఎంఎస్‌ కార్యకలాపాలు స్తంభించాయి. ఎరువులు, విత్తనాల అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. మార్కెట్‌ యార్డుల్లోని డీసీఎంఎస్‌ కేంద్రాలు మూతపడ్డాయి. కొన్ని కేంద్రాల్లో మాత్రమే నామమాత్రంగా ఎరువులు, విత్తనాలను రైతులు కొనుగోలు చేస్తున్నారు. 


ఉద్యోగుల్లో గుబులు

డీసీఎంఎస్‌ కేంద్రాలు మూతబడితే తమ పరిస్థితి ఏమిటని, ఇకపై జీతాలు చెల్లిస్తారో లేదోనని అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జీతాలు ఇస్తున్నారని, ఇకపై ఇచ్చే దారి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాల అమ్మకం, దిగుబడుల కొనుగోలు ద్వారా ప్రభుత్వం నుంచి డీసీఎంఎస్‌ రాష్ట్ర విభాగం కమీషన్‌ అందేది. వారు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేవారు. జిల్లాలో అధికారులు, ఉద్యోగులకు నెలకు రూ.5. లక్షల దాకా జీతం చెల్లిస్తున్నారు. ప్రస్తుతానికి తంటాలు పడి నిధులను సమీకరించి జీతాలను అందిస్తున్నామని, ఇకపై కమీషన్‌ రూపేణా ప్రభుత్వం నుంచి నిధులు అందే అవకాశం లేనందున ఇబ్బందులు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 


వైఎస్సార్‌ హయాంలో..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో డీసీఎంఎస్‌ కేంద్రాల నుంచి రైతులకు విత్తనాలు, ఎరువులను విక్రయించే కార్యక్రమం ఊపందుకుంది. మద్దతు ధరకు పంట దిగుబడులు కొనే కార్యక్రమాన్ని అప్పట్లోనే చేపట్టారు. ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం వల్ల వాటి మనుగడకు ముప్పు ఏర్పడింది. తమ పరిస్థితి ఏమిటని అధికారులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్‌ కేంద్రాలను మార్క్‌ఫెడ్‌ లేదా ఏపీ సీడ్స్‌ సంస్థల్లో విలీనం చేయాలని కోరుతున్నారు. 


సీఎం జగన్‌పై నమ్మకం ఉంది..పీపీ నాగిరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ 

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎవరికీ అన్యాయం చేయరనే నమ్మకం ఉంది. ఎప్పటి నుంచో ప్రజలకు, రైతులకు సేవ చేస్తున్న డీసీఎంఎస్‌ కేంద్రాలను కొనసాగిస్తారనే భావిస్తున్నాం. డీసీఎంఎస్‌ కేంద్రాల అధికారులు, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించే మార్గాన్ని చూపిస్తుంది. 


శాశ్వత ఉపాధి కల్పించాలి..షేక్షావలి, డీసీఎంఎస్‌ కేంద్రం ఉద్యోగి, ప్యాపిలి

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు వల్ల డీసీఎంఎస్‌ కేంద్రాల్లో అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి. రైతులకు విత్తనాలు, ఎరువులను అమ్మడం వల్ల వచ్చే కమీషన్‌తో మాకు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ వ్యాపారం లేకపోతే మాకు జీతాలు ఎలా ఇస్తారు..? ప్రభుత్వం  మా గురించి ఆలోచించి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా గుర్తించాలి. మా జీవితాలకు భరోసా కల్పించాలి.

Updated Date - 2020-08-03T10:19:58+05:30 IST