భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకా పరీక్షలకు కేంద్రం అనుమతి!

ABN , First Publish Date - 2020-08-03T18:54:08+05:30 IST

ఆక్స్‌ఫర్డ్ రూపొందిస్తున్న కరోనా టీకా‌పై ఫేజ్‌ 2.3 క్లీనికల్ ట్రయల్స్ జరిపేందుకు సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ అనుమతి లభించింది.

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకా పరీక్షలకు కేంద్రం అనుమతి!

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ రూపొందిస్తున్న కరోనా టీకా‌పై ఫేజ్‌ 2, ఫేజ్-3(రెండు, మూడు దశల పరీక్షలు) క్లీనికల్ ట్రయల్స్ జరిపేందుకు సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వ అనుమతి లభించింది. టీకాపై పరీక్షలకు సంబంధించి భారత్‌లో పరీక్షలు  నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి జారీ చేసింది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన సబ్జెట్ ఎక్సపర్ట్ కమిటీ సూచనల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ ట్రయల్స్‌‌లో పాల్గొన్న వారికి రెండు టీకా డోసులు ఇస్తారని, తొలి డోసు ఇచ్చిన తరువాత 29వ రోజున రెండో డోసు ఇస్తారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి తెలిపారు. ఆ తరువాత..టీకా కారణంగా అపాయమేదైనా ఉందా లేదా, కావాల్సిన స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను టీకా ప్రేరేపిస్తోందా లేదా అనే అంశాల్ని ఈ ట్రయల్స్‌లో నిర్ధారిస్తారని తెలిపారు. టీకాకు సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సీటి ఇచ్చిన ఫేజ్-1,2 సమాచారాన్ని పరిశీలించిన అనంతరం డీసీజీఐ ఈ అనుమతులు జారీ చేసిందన్నారు.  ప్రస్తుతం ఈ టీకాపై వివిధ దేశాల్లో జరుగుతున్న క్లీనికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో ఫేజ్-2, 3 దశల పరీక్షలు జరగుతుండగా బ్రెజిల్‌లో ఫేజ్-3, దక్షిణాఫ్రికాలో ఫేజ్-1,2 పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజలకు కరోనా టీకాను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ దశల పరీక్షలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. 


Updated Date - 2020-08-03T18:54:08+05:30 IST