6-12 ఏళ్ల పిల్లలకు 'కొవాగ్జిన్' ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి

ABN , First Publish Date - 2022-04-26T20:12:44+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరో ముందడుగు పడింది. 6 నుంచి 12 ఏళ్ల లోపు..

6-12 ఏళ్ల పిల్లలకు 'కొవాగ్జిన్' ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి

న్యూఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరో ముందడుగు పడింది. 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు అత్యవసర వినియోగం కోసం భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్‌'కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మంగళవారంనాడు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు బయోలాజికల్ ఇ 'కార్పొవాక్స్', 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి 'కొవాగ్జిన్' ఇస్తున్నారు. కోవిడ్ నాలుగో వేవ్ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో తాజాగా 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గత 2021 డిసెంబర్ 24న అనుమతి ఇచ్చింది. అలాగే 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ గత జనవరి 3న మొదలైంది. అనంతరం 12 నుంచి 14 ఏళ్ల లోపు వారికి మార్చి 16 నుంచి అనుమతి ఇచ్చింది. మరోవైపు, 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అదనపు డాటాను పంపాల్సిందిగా కొవాగ్జిన్ సంస్థను డీసీజీఐకు చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ గత వారం అడిగినట్టు సమాచారం. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గత ఏడాది జనవరి 16న మొదలైన విషయం విదితమే.

Updated Date - 2022-04-26T20:12:44+05:30 IST