బోగస్‌ రుణాలపై చర్యలేవి?

ABN , First Publish Date - 2022-05-26T05:46:18+05:30 IST

బోగస్‌ పంట రుణాల రికవరీ, దర్యాప్తులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సొసైటీ అధ్యక్షులు ధ్వజమెత్తారు.

బోగస్‌ రుణాలపై చర్యలేవి?
ప్రసంగిస్తున చైర్మన్‌ లాల్‌పురం రాము, వేదికపైన సీఈవో కృష్ణవేణి తదితరులు

రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..

డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో ధ్వజమెత్తిన అధ్యక్షులు

ఉద్యోగులకు బోనస్‌పై వ్యతిరేకత

 

గుంటూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): బోగస్‌ పంట రుణాల రికవరీ, దర్యాప్తులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌  అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సొసైటీ అధ్యక్షులు ధ్వజమెత్తారు. గుంటూరులోని బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం చైర్మన్‌ లాల్‌పురం రాము అధ్యక్షతన సమావేశం జరిగింది. సొసైటీ అధ్యక్షులు మన్నవ వీరనారాయణ, గల్లా రాధాకృష్ణ, లక్ష్మారెడ్డి, కట్టా వెంకట సుబ్బారావు, శివారెడ్డి, హైమారావు తదితరులు ఉద్యోగుల ఎక్స్‌గ్రేషియో, బోగస్‌ రుణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


బోగస్‌రుణాలపై చర్యలు తీసుకోలేదు...

ప్రత్తిపాడు బ్రాంచిలో బోగస్‌ రుణాలపై పాలకవర్గం  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చింతపల్లిపాడు సొసైటీ అధ్యక్షుడు మన్నవ వీరనారాయణ ప్రశ్నించారు. సొసైటీ అధ్యక్షుల ఆస్తులను జప్తు చేస్తామంటూ మండిపడ్డారు. నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ అధ్యక్షుడు గల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షులకు చైర్మన్‌, సీఈవోలు అండగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్‌ రుణాలిచ్చిన సొసైటీలలో కొన్నింటినే రద్దు చేసి, మరికొన్నింటికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని నిలదీశారు. సొసైటీ అధ్యక్షులకు పంట రుణాల పంపిణీపై అవగాహన కల్పించకుండా పదవుల నుంచి తొలగించటం సమసంజసం కాదన్నారు. లక్ష్మారెడ్డి, కట్టా వెంకటసుబ్బారావు మాట్లాడుతూ భూమి పత్రాలు పరిశీలించిన తరువాతనే రుణాల దరఖాస్తులు అధ్యక్షుల ఆమోదానికి వస్తాయన్నారు. దీనిలో అధ్యక్షులపై చర్యలు తీసుకోవటాన్ని తప్పుపట్టారు. 


ఎక్స్‌గ్రేషియోపై వ్యతిరేకత...

ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియోపై పలువురు సొసైటీ అధ్యక్షులు నిరసన తెలిపారు శివారెడ్డి, హైమారావు  మాట్లాడుతూ సహకారశాఖ కమిషనర్‌ కార్యాలయం వ్యతిరేకించిని, నిబంధనలకు విరుద్ధంగా గత పాలకవర్గాలు ఎక్స్‌గేషియో ఇచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ మినిట్స్‌బుక్‌లో డీసెంట్‌ నమోదు చేశారు. కాగా ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాల్సిందేనని చైర్మన్‌ రాము స్పష్టం చేశారు. సొసైటీలలో సిబ్బంది కొరత, జీతాలు సకాలంలో ఇవ్వలేక ఇబ్బందులు పడుతుంటే ఎక్స్‌గ్రేషియో ఎలా ఇస్తారని పలువురు అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు.


చైర్మన్‌ ప్రసంగానికి అభ్యంతరం..

బోగస్‌ రుణాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను చైర్మన్‌ రాము ప్రస్తావించగా అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.500 కోట్లు అవకతవకలు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను రాము ప్రస్తావించారు. బ్యాంక్‌లో జరిగిన అవినీతిని గుర్తించి దోషులపై చర్యలు తీసుకొని స్వాహా అయిన సొమ్మును రికవరీ చేయకుండా ప్రతిపక్షాలపై ధ్వజమెత్తటం సమంజసంకాదని నిమ్మగడ్డవారిపాలెం సొసైటీ అధ్యక్షుడు గల్లా రాధాకృష్ణ అభ్యంతరం తెలిపారు.  సమావేశంలో సీఈవో కృష్ణవేణి, జీఎం భాను, పాలకవర్గ సభ్యులు హరిబా బు, ఎన్‌.రామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:46:18+05:30 IST