డీసీసీబీలో అక్రమ నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2022-08-09T05:29:17+05:30 IST

డీసీసీబీలో అక్రమ నిర్మాణ పనులు

డీసీసీబీలో అక్రమ నిర్మాణ పనులు

 అడ్డుకుని తాళాలు వేసిన బ్యాంకు సిబ్బంది

 లీజు రద్దు చేయాలని డిమాండ్‌..

 నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

 హనుమకొండ టౌన్‌, ఆగస్టు 8 : హనుమకొండ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) ఆవరణలో నిర్మాణ దశలో ఉన్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారని అధికార పార్టీకి చెందిన నేతల ఫిర్యాదుతో సీబీఐ విచారణ కొనసాగుతుండడంతో పాటు ఈ వివాదం కోర్టులో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా లీజు దక్కించుని కాంప్లెక్స్‌ నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ వివాదం విచారణ దశలో ఉండగానే కొద్ది రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా పనులు సాగిస్తున్నారు. నిర్మాణానికి సబంధించి వివాదం కోర్టులో ఉండటంతో గతంలో అధికారులు కాంప్లెక్స్‌కు తాళం వేశారు. సదరు కాంట్రాక్టర్‌ తాళాలు పగులగొట్టి యథేచ్ఛగా పనులు సాగిస్తున్నారు. 

సాగుతున్న పనులు నిలిపివేయాలని కోఆపరేటివ్‌ ఉద్యోగుల సంఘం నేతలు కాంట్రాక్టర్‌కు చెప్పినప్పటికీ స్పందన లేదు. బ్యాంకు పాలకవర్గం సైతం చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో అసహనానికి గురైన ఉద్యోగులు సోమవారం ధర్నాకు దిగారు. ఉదయం విధులకు హాజరైన బ్యాంకు సిబ్బంది, కోఆపరేటివ్‌ ఉద్యోగ సంఘ నేతలతో కలిసి కాంప్లెక్స్‌లోనికి వెళ్లి జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. వర్కర్స్‌ను బయటికి పంపి కాంప్లెక్స్‌కు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. బ్యాంకు ఆవరణలో చట్ట విరుద్ధంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సురేందర్‌, వరంగల్‌ జిల్లా సంఘం అధ్యక్షుడు బి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. కోఆపరేటివ్‌ వ్యవస్థ ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చిందన్నారు. బ్యాంకు స్థలాలు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లయితే బ్యాంకు లైసెన్స్‌ రద్దు అవుతుందన్నారు. లైసెన్స్‌ రద్దయితే ఉద్యోగులు రోడ్డున పడుతామన్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి కోర్టులో వివాదం కొనసాగుతుండగానే కాంట్రాక్టర్‌ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. 

గత పాలకవర్గం కాంట్రాక్టర్‌కు ఇచ్చిన లీజును రద్దు చేయాలని, నిర్మాణాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లీజు రద్దు అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అక్రమంగా సాగుతున్న నిర్మాణాలు నిలిపి వేయకుంటే మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని, కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. 

అనంతరం సీఈవో చిన్నారావు, ఉద్యోగ సంఘ నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్నాలో సంఘం నేతలు అజయ్‌, నాగరాజు, రాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-09T05:29:17+05:30 IST