డీసీసీబీ లీజు రద్దు

ABN , First Publish Date - 2022-08-11T05:14:03+05:30 IST

డీసీసీబీ లీజు రద్దు

డీసీసీబీ లీజు రద్దు

కమర్షియల్‌ భవన నిర్మాణ పనులకు బ్రేక్‌

కాంట్రాక్టర్‌కు సెటిల్‌ చేసి పంపాలి..

డీసీసీబీ అత్యవసర భేటీలో నిర్ణయం

నేడు టెస్కాబ్‌ దృష్టికి సమస్య

హనుమకొండ టౌన్‌, ఆగస్టు 10: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ఆవరణలో నిర్మిస్తున్న కమర్షియల్‌ భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. లీజు రద్దు చేయకుంటే బ్యాంక్‌పై వేటు పడే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లీజు రద్దు చేసి కాంట్రాక్టర్‌కు సెటిల్‌ చేసి పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గత పాలకవర్గం హయాంలో డీసీసీబీ ఆవరణలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం ఒక కాంట్రాక్టర్‌ (ప్రస్తుత పాలకవర్గంలో డైరెక్టర్‌) లీజ్‌ అగ్రిమెంట్‌ దక్కించుకున్నాడు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా లీజు అగ్రిమెంట్‌ ఇవ్వడంతో ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నాటి బ్యాంక్‌ సీఈవోను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు భవన నిర్మాణ పనులు నిలిపి వేశారు. ఈ వివాదం కోర్టులో విచారణ దశలో ఉంది. 

ఈ క్రమంలో నాటి సదరు కాంట్రాక్టర్‌ ప్రస్తుత పాలకవర్గంలోకి డైరెక్టర్‌గా వచ్చి పనులు ప్రారంభించారు. ఒక ప్రైవేటు సంస్థకు రెంట్‌ ఇచ్చిన కాంట్రాక్టర్‌.. గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఆర్‌బీఐ నిబంధనలు విస్మరించి నిర్మిస్తున్న భవన నిర్మాణ లీజు వ్యవహారం తమ ఉ్యద్యోగాలకు ఎసరు వస్తుందని డీసీసీబీ అధికారులు ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ ఇవేమీ లెక్క చేయకుండా పనులు సాగిస్తుండటంతో సీఈవో చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేసి పనులు నిలిపివేయించారు. 

ఈ వివాదం ముదరడంతో బుధవారం డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ (బ్యాంక్‌ పాలకవర్గ సభ్యుడు)ను లీజుపై చర్చించే సమయంలో బయటికి పంపినట్లు తెలిసింది. ఆయనుంటే నిర్ణయాల విషయంలో వివాదం తలెత్తే అవకాశం ఉన్నందున ఆయన లేకుండా పనులు నిలిపివేయాలని తీర్మానం చేసినట్లు సమాచారం. 

ఈ వివాదం విషయాన్ని రాష్ట్ర కోఆపరేటివ్‌ శాఖ అధికారులతో చర్చించేందుకు గురువారం సీఈవో, చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు హైదరాబాద్‌ వెళ్లనున్నారు. కాంట్రాక్టర్‌ వెచ్చించిన మొత్తం సెటిల్‌చేసే విషయమై ప్రధానంగా చర్చించనున్నారు. హైదరాబాద్‌లో జరిగే చర్చల అనంతరం ఈనెల 16న డీసీసీబీ పాలకవర్గం అత్యవసర సమేశం ఏర్పాటు చేసుకుని వివాదం పరిష్కారంపై ఒక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. 

కాగా, కాంట్రాక్టర్‌ అయిన ప్రస్తుత డైరెక్టర్‌ సైతం మొండిగానే ఉన్నట్లు సమాచారం. తనకు ఉన్న పరపతిని ఉపయోగించి ఎలాగైనా లీజు అగ్రిమెంట్‌ రద్దు కాకుండా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి చెందిన సదరు కాంట్రాక్టర్‌కు జిల్లాకు చెందిన ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నట్లు సమాచారం. 

 డీసీసీ బ్యాంకు మూసివేతకు కుట్ర

నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్‌ పనులు

చోద్యం చూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వరద రాజేశ్వర్‌రావు 


ఓరుగల్లు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)  : హనుమకొండ నడిబొడ్డున ఉన్న డీసీసీ బ్యాంకు మూసివేతకు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, వర్ధన్నపేట కోఆపరేటివ్‌ సొసైటీ  మాజీ చైర్మన్‌  ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు ఆరోపించారు.  హనుమకొండలోని తన  స్వగృహంలో  బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  జిల్లా  కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో నిర్మిస్తున్న కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిబంధనలకు విరుద్దమన్నారు. గత పాలకవర్గం తప్పిదం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని రాజేశ్వర్‌రావు అన్నారు. ఈ నేతల ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరిపి అప్పటి చైర్మన్‌పై కేసు నమోదు చేసి సీఈవోను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేయాలని ఆదేశించారన్నారు. 

అయితే డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు ఆధ్వర్యంలోని  కొత్త పాలకవర్గం మాత్రం కాంట్రాక్టర్‌ యధేచ్చగా పనులు జరుపుకోవడానికి అనుమతులు ఇచ్చారన్నారు. ఇదే అంశం మీద న్యాయస్థానంలో విచారణ కూడా జరుగుతోందన్నారు.  గత మూడు నెలలుగా కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులను కొనసాగిస్తున్న విషయం అదే భవనానికి రోజూ వెళ్ళే చైర్మన్‌ రవిందర్‌రావుకు తెలియదంటే విచిత్రంగా ఉందని అన్నారు. ఇందులో ఏదో ముడుపుల మాయాజాలం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయన్నారు. 

ఇంత జరుగుతున్నా మంత్రి దయాకర్‌రావుకు ఎలాంటి సమాచారం లేదంటే ఎలా నమ్ముతామని రాజేశ్వర్‌ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అయినప్పటికీ కాంట్రాక్టర్‌ లెక్క చేయకుండా తాళాలు పగుల కొట్టీ మరీ పనులు చేయడం, పోలీ్‌సలు చేష్టలుడిగి చూడడం విచిత్రంగా ఉందన్నారు. కాంట్రాక్టర్‌కు అధికార పార్టీ నేతల మద్దతు లేక పోతే అంత సాహసం చేయగలడా అని రాజేశ్వర్‌ రావు ప్రశ్నించారు. 

కో అపరేటివ్‌ బ్యాంకు ఆవరణలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అవకాశం ఇవ్వొద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇదే విధంగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు అవకాశం ఇస్తే బ్యాంకు లైసెన్స్‌ రద్దయ్యే అవకాశం ఉంటుందని,  బ్యాంకు మూత పడితే వందలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులే కాకుండా రైతాంగం మొత్తం రోడ్డున పడాల్సి వస్తుందని అన్నారు.  

ఆరోపణలు అస్థిత్వం కోసమే:

డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌ రావు

డీసీసీ బ్యాంకు విషయంలో కాంగ్రెస్‌ నాయకుడు వరద రాజేశ్వర్‌రావు చేసిన ఆరోపణలపై  డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌ రావును వివరణ కోరగా...  రాజకీయాల కోసమే అనవసరమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.  డీసీసీ బ్యాంకు అక్రమాలను వెలుగులోకి తెచ్చి బ్యాంకును కాపాడేందుకు కృషి చేసిన మంత్రి   దయాకర్‌రావుపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని రవిందర్‌రావు అన్నారు.  కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు సంబందించిన లీజు అగ్రిమెంట్‌   కాంగ్రెస్‌ పార్టీ పాలకవర్గ కాలంలోనే జరిగిందన్న విషయం తెలుసుకోవాలన్నారు. గత కాంట్రాక్టర్‌ పనులు చేసేందుకు అనుమతించకపోతే అతని కాంట్రాక్ట్‌ పరికరాలు, యంత్రాలు మాత్రమే గత కొన్ని రోజులుగా ఖాళీ చేస్తున్నారన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న కాంట్రాక్టర్‌, మరో కాంట్రాక్టర్‌కు లీజ్‌కు ఇవ్వడమే కాకుండా బలవంతంగా డీసీసీ భవన్‌లోకి చొరబడితే పోలీ్‌సలకు తామే ఫిర్యాదు చేశామన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయొద్దని  హితవు చెప్పారు. 

Updated Date - 2022-08-11T05:14:03+05:30 IST