ఉద్దానంలో ఎలుగులు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-08-09T04:36:59+05:30 IST

మందస మండలం ఉద్దాన ప్రాంతంలో ఎలుగులు హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి. హరిపురం, బీఎస్‌పురం పరిసర ప్రాంతాల్లో ఒక తల్లి, రెండు పిల్ల ఎలుగులు సంచరిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వద్ద సంచరిస్తూ స్థానికులకు భ

ఉద్దానంలో ఎలుగులు హల్‌చల్‌
బీఎస్‌పురంలోని ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌లో సంచిరిస్తున్న పిల్లల ఎలుగుబంటి

పట్టపగలే సంచారం

భయాందోళనలో జనం

హరిపురం, ఆగస్టు 8: మందస మండలం ఉద్దాన ప్రాంతంలో ఎలుగులు హల్‌చల్‌ సృష్టిస్తున్నాయి. హరిపురం, బీఎస్‌పురం పరిసర ప్రాంతాల్లో ఒక తల్లి, రెండు పిల్ల ఎలుగులు సంచరిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వద్ద సంచరిస్తూ స్థానికులకు భయాందోళనకు గురిచేశాయి. దీంతో ఎప్పుడు ఎలా దాడి చేస్తాయోనని స్థానికులు భయపడుతున్నారు. రెండేళ్ల కిందట సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఎలుగుబంట్లు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలంలో పట్టపగలు దాడిచేసిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలుగుల సంచారం అధికమవడంతో ఉద్దానం ప్రాంతీయులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. 


కొండలను తవ్వేస్తుండడంతో..

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి.  కొన్నేళ్లుగా ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ఉన్న కొండలను అక్రమార్కులు పిండేస్తున్నారు. ప్రధానంగా ఉద్దానంలోని కొండల్లో కంకర తవ్వకాలు చేపట్టారు. ఇళ్ల స్థలాలుగా మార్పు చేశారు. దీంతో ఎలుగుబంట్లు తలదాచుకునేందుకు వీలు లేకపోతోంది. దీనికితోడు నాలుగేళ్ల కిందట తితలీ విపత్తు ఉద్దానం ప్రాంతాన్ని దారుణంగా దెబ్బతీసింది. దీంతో అటవీ జంతువులు జనావాసాల్లోకి వస్తుండటంతో ఇటు ప్రజలు, అటు అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అటవీ శాఖాధికారులు వీటి సంరక్షణకు చర్యలు తీసుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో రాత్రి వేళల్లో సంచరించే ఎలుగులు ప్రస్తుతం పట్టపగలే గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరముంది. 



Updated Date - 2022-08-09T04:36:59+05:30 IST