దినదిన గండం!

ABN , First Publish Date - 2020-03-30T07:58:31+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి 13న నెల్లూరులో మొదటి కేసు నమోదవగా 28నాటికి మొత్తం కేసులు...

దినదిన గండం!

  • నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు 
  • మార్చి 17నుంచి జోరందుకున్న వైరస్‌ 
  • శనివారం అత్యధికంగా 6 పాజిటివ్‌లు 
  • 2వారాల్లో 550మందికి నిర్ధారణ పరీక్షలు 

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి 13న నెల్లూరులో మొదటి కేసు నమోదవగా 28నాటికి మొత్తం కేసులు 19కి చేరుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. వీరితోపాటు అనుమానితుల సంఖ్య 500కు చేరింది. ముందుగా ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తి పాజిటివ్‌ వచ్చింది. మార్చి 8న రాష్ట్రంలో అడుగుపెట్టిన అతను దగ్గు, జ్వరంతో ఇబ్బందిపడుతూ 9న నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి చేరారు. పరీక్షలు నిర్వహించిన అధికారులు అతనికి కరోనా సోకినట్లు 13న గుర్తించారు. ఆ తర్వాత 18వరకూ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 19న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి(23)కి పాజిటివ్‌ వచ్చింది. లండన్‌  నుంచి బయలుదేరిన ఆయన 15న ఒంగోలు చేరుకున్నారు. అదేరోజు కరోనా లక్షణాలతో ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం 17న పాజిటివ్‌గా నిర్ధారించారు. తర్వాత మూడో కేసు విశాఖపట్నంలో నమోదైంది. మదీనా నుంచి వచ్చిన 65ఏళ్ల వ్యక్తికి 18న కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం రాజమండ్రి వ్యక్తి(22)కి వైరస్‌ సోకింది. 17న లండన్‌లో బయలుదేరిన అతను దుబాయ్‌ మీదుగా 18న హైదరాబాద్‌ చేరుకున్నారు. అక్కడినుంచి కారులో రాజమండ్రి వచ్చారు.


కరోనా లక్షణాలతో 20న ఆస్పత్రిలో చేరారు. 21న వ్యాధి నిర్ధారణ అయింది. ఇక 5వ కేసు విజయవాడలో నమోదైంది. ఈ నెల 15న పారిస్‌లో బయలుదేరిన వ్యక్తి 17న విజయవాడ చేరుకున్నారు. 19న కరోనా లక్షణాలు కనిపించాయి. 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. కరోనా ఉన్నట్లు 21న తేలింది. అప్పటినుంచి రాష్ట్రంలో రోజూ పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో తొలుత విశాఖపట్నంలో కరోనా రెండోదశకు చేరుకుంది. మదీనా నుంచి వచ్చిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది. అతని కుమార్తెకు నెగటివ్‌ రావడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. తర్వాత గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారినుంచి వారి భార్యలకు వైరస్‌ సోకింది. కరోనా మూడోదశకు చేరేలోపే ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం కావాలని పలువురు కోరుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిపై ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టిపెట్టాల్సి ఉందంటున్నారు.. వెంటనే వారిని క్వారంటైన్‌ చేస్తే వైరస్‌ ప్రభావాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.


Updated Date - 2020-03-30T07:58:31+05:30 IST