Abn logo
Oct 12 2021 @ 00:03AM

’సద్దులు‘ ఎల్లుండే!

9వ రోజు నిమజ్జనం చేయడమే సంప్రదాయం
పర్వదినంపై శాస్త్రపరంగా ఎలాంటి ఆధారాలు లేవు
మెజారిటీ పండితుల మనోగతం
13,14 తేదీలను ఆప్షనల్‌ సెలవు దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం


వరంగల్‌ కలెక్టరేట్‌/జనగామ కల్చరల్‌/భూపాలపల్లి టౌన్‌/కొడకండ్ల, అక్టోబరు 11: తెలంగాణ సాంస్కృతిక  ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను ఏ రోజు జరుపుకోవాలనే విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. పండితులు రెండు రకాలుగా చెబుతుండటంతో మహిళల్లో అయోమయం నెలకొంది. 13న(బుధవారం) జరుపుకోవాలని కొందరు,  14న(గురువారం) జరుపుకోవాలని మరికొందరు చెబుతున్నారు. అయితే మెజారిటీ పండితులు సంప్రదాయం పక్రారం 14నే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహణపై శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఎక్కడా చెప్పలేదని కొందరు సిద్ధాంతులు అంటున్నారు. నవరాత్రి వేడుకల్లో దుర్గాష్టమి రోజున బలి ప్రదానం ఇచ్చే సంప్రదాయం ఉంది. పుష్పగౌరీ వ్రతం ఆచరించుకొనే వారు పూలతో బతుకమ్మను పేర్చి అందులో గౌరమ్మను ఉంచి పుష్పగౌరి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు.  దుర్గాష్టమి రోజున బలి ప్రదానం చేయడం వల్ల ఆ రోజే బతుకమ్మను నిమజ్జనం చేయాలని విధ్వత్‌ సభలో పండితులు, సిద్ధాంతులు తమ నిర్ణయాలను తెలిపినట్లు తెలిసింది. సాధారణంగా అమావాస్య రోజు ప్రారంభమైన తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటారు. పితృ అమావాస్య రోజు నుంచి చూస్తే 14వ తేదీకి తొమ్మిదో రోజు అవుతుండటంతో అదే రోజు సద్దుల బతుకమ్మను జరుపుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ఈసారి సద్దుల మర్నాడే దసరా పండుగను ఆచరించుకుంటారు.

బ్రాహ్మణ పరిషత్‌ నిర్ణయం
సద్దుల బతుకమ్మ పండుగను ఈ నెల 14న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ జనగామ జిల్లా కమిటీ సూచించింది.   సోమవారం జనగామలో జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకొంది. జనగామ జిల్లా బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడు, యాదగిరిగుట్ట ఆస్థాన సిద్దాంతి కృష్ణమాచార్య సిద్ధాంతి పంచాంగం ప్రకారం 14న సద్దులు,  15న దసరా పండుగలు జరుపుకోవాలని కమిటీ తీర్మానించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పల గిరిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి త్రిపురారి మనోహర్‌ శర్మ తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలను ఈనెల 14నే నిర్వహించాలని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అర్చక, పురోహిత సంఘం అధ్యక్షుడు డింగరి మురళీ కృష్ణమాచార్యులు కూడా పేర్కొన్నారు.

అయోమయం వద్దు...

గత 60 సంవత్సరాల పంచాంగాలను, పండుగల నిర్ణయాలను పరిశీలించి పెద్దలతో చర్చించిన తర్వాత ఈసారి సద్దుల బతుకమ్మను ఈ నెల 14న (గురువారం) జరుపుకోవడమే సరైనదని నిర్ణయించినట్టు కొడకండ్ల సిద్ధాంతి పాలకుర్తి గౌతమ్‌ శర్మ స్పష్టం చేశారు. ‘బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది... శాస్త్రాల్లో పుష్పగౌరీ వ్రతంగా అభివర్ణించినా శాస్త్రపరంగా ఎలాంటి ప్రత్యేక వివరణలు, ఆధారాలు లేవు... తెలంగాణలోనే వేర్వేరు ప్రాంతాల్లో 5, 7, 9 రోజులు బతుకమ్మను ఆడుకుంటారు.. ఈ నెల 13న దుర్గాష్టమి, 14న మహర్నవమి, 15న విజయ దశమిని జరుపుకోవాలి..’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, సద్దుల బతుకమ్మ సెలవు ఎప్పుడనే విషయమై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పండితుల్లోని భిన్నాభిప్రాయాల దృష్ట్యా ఈసారి సద్దులు  13, 14 తేదీల్లో జరిగే పరిస్థితులు ఉండటంతో ఈ రెండు రోజులను ఆప్షనల్‌ సెలవు దినాలుగా ప్రకటించింది.  

తొమ్మిదో రోజునే నిమజ్జనం చేయాలి...
- సముద్రాల సుదర్శనాచార్యులు, ప్రముఖ పండితుడు, వరంగల్‌

సద్దుల బతుకమ్మకు ప్రాంతీయ ఆచారమే ఆధారం. ఈ పండుగకు తిథులతో నిమిత్తం ఉండదు. పెత్రమవాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి 9 రోజులు ఆడి, 9వ రోజున సద్దుల బతుకమ్మను ఆడి నిమజ్జనం చేసుకోవాలి. కొందరు పండితులు దుర్గాష్టమికి లంకె పెట్టి సద్దుల బతుకమ్మ రోజును చెబుతున్నారు. ఇది సరికాదు. దుర్గాష్టమికి, సద్దులకు సంబంధం లేదు. హిందువులు జరుపుకునే అన్ని పండుగలకు ఉన్నట్టుగా, సద్దుల బతుకమ్మకు ఎటువంటి నిఘంటువు, ఆధారం, మంత్రం లేదు.  వందల సంవత్సరాల నుంచి పెద్దల ద్వారా వచ్చిన తొమ్మిది రోజుల సంప్రదాయాన్ని అలాగే కొనసాగించాలి. ఈ విషయాన్ని గతంలోనే కొడకొండ్ల పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి, తాండ్ర పిచ్చయ్య శాస్ర్తి, మట్టెపల్లి వెంకటేశ్వర శర్మ, గంగు సత్యం తదితర మహా పండితులు స్పష్టం చేశారు.  ఈ లెక్కన ఈసారి సద్దుల బతుకమ్మను 14వ తేదీ గురువారమే నిర్వహించుకోవాలి. మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే సద్దుల బతుకమ్మపై ఎలాంటి గందరగోళానికి తావు లేదు. 13న జరుపుకోవాలనే ప్రచారాన్ని నమ్మవద్దు. దసరా పండుగను శుక్రవారం జరుపుకోవాలి.

విద్వత్‌ సభ ప్రకారం 13న జరుపుకోవాలి..
- అనంత మల్లయ్య సిద్ధాంతి

హనుమకొండ కల్చరల్‌ /పరకాల,  అక్టోబరు 11: సద్దుల బతుకమ్మ పండుగను ఈ నెల 14న జరుపుకోవాలని ఒక వర్గం పండితులు చెబుతుండగా, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి అనంత మల్లయ్య శర్మ మాత్రం 13న జరుపుకోవాలని సూచిస్తున్నారు. నాలుగేళ్ళ కిత్రం జరిగిన విద్వత్‌ సభలో సద్దుల బతుకమ్మ పండుగను ఎవరు ఎన్ని రోజులు ఆడినా దుర్గాష్టమి లోపే పూర్తి చేయాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. దుర్గాష్టమి రోజున రాత్రి వేళలో బలిప్రదానాలు ఇచ్చే సంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో ఉన్నందు వల్ల దుర్గాష్టమి రోజు బతుకమ్మను నిమజ్జనం చేయకుండా ఉండటం శ్రేయస్కరమని సభ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్లవనామ సంవత్సరంలో జరిగిన విద్వత్‌ సభలో కూడా పండితులు ఈ నెల 13వ తేదీన సద్దుల  బతుకమ్మను ఆచరించాలని నిర్ణయించారని అనంతమల్లయ్య తెలిపారు.  
కాగా, సద్దుల బతుకమ్మపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో పరకాలలో సోమవారం  పట్టణ పురోహితుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 13న సద్దులను జరుపుకోవాలని నిర్ణయించారు. పెద్దలు, పండితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోమాళ్ళపల్లి సంపత్‌కుమార్‌ శర్శ తెలిపారు.