పేదరికంతో పోరాటం.. రోజుకు 10 గంటల చదువు.. కూరగాయలమ్మే ఆ వ్యక్తి కూతురు సాధించిన ఘనత ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-05T23:07:27+05:30 IST

అతను పేదవాడు.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించాడు..

పేదరికంతో పోరాటం.. రోజుకు 10 గంటల చదువు.. కూరగాయలమ్మే ఆ వ్యక్తి కూతురు సాధించిన ఘనత ఏంటంటే..

అతను పేదవాడు.. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించాడు.. కూతురు తమలా పేదరికంలో మగ్గిపోకూడదని కష్టపడి చదివించాడు.. అప్పులు తెచ్చి ఫీజులు కట్టాడు.. ఆ యువతి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించింది.. తల్లిదండ్రులకు సహాయం చేస్తూనే కష్టపడి చదువుకుంది.. ఏకంగా సివిల్ జడ్జ్ అయిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అంకిత ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 


ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల యువతి మూడేళ్లుగా అకుంఠిత దీక్షతో సివిల్ జడ్జ్ పరీక్షలకు సిద్ధమైంది. ఆ పరీక్షలో ఏకంగా ఐదో ర్యాంకు దక్కించుకుని తన తల్లిదండ్రుల కలలు నెరవేర్చింది. విషయం తెలుసుకున్న అంకిత తల్లిదండ్రులు ఆనంద భాష్పాలతో సంబరాలు చేసుకున్నారు. అంకిత తల్లిదండ్రులు ఆమె చిన్నప్పటి నుంచి ఇండోర్ మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అంకిత సోదరుడు కూలి పని చేస్తుంటాడు. అంకిత బాగా చదువుతుండడంతో తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు. అప్పులు చేసి మరీ అంకిత ఫీజులు కట్టేవారు.  


తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న అంకిత రోజుంతా పుస్తకాలకు అంకితమయ్యేది. చిన్న గదిలో కూర్చుని పరీక్షలకు సిద్ధమైంది. వర్షం పడితే ఆమె ఇల్లంతా కారిపోయేది. అయినా అంకిత చదువు ఆపేది కాదు. అంకిత 2017లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. అనంతరం 2021లో ఎల్‌ఎల్‌ఎమ్ పట్టా పొందింది. అనంతరం సివిల్ జడ్జ్ పరీక్షల కోసం ప్రిపేర్ కావడం మొదలు పెట్టింది. రెండుసార్లు విఫలమైనా.. మూడోసారి ఏకంగా ఐదో ర్యాంకు సాధించింది. ఆ ప్రాంతంలో వారందరికీ స్ఫూర్తిగా నిలిచింది. 

Read more