మీ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఇంటికెళ్లి చూస్తారా?.. అంటూ అల్లుడు అడిగాడని ఆ తండ్రి వెళ్తే..!

ABN , First Publish Date - 2021-08-29T14:22:35+05:30 IST

ఆ రోజు సాయంత్రం సడెన్‌గా అల్లుడు ఫోన్ చేశాడు. ‘‘మీ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఇందాకటి నుంచి లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి ఇంటికెళ్లి ఏమైందో చూడండి’’ అని చెప్పాడతను. ..

మీ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. ఇంటికెళ్లి చూస్తారా?.. అంటూ అల్లుడు అడిగాడని ఆ తండ్రి వెళ్తే..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోజు సాయంత్రం సడెన్‌గా అల్లుడు ఫోన్ చేశాడు. ‘‘మీ అమ్మాయికి ఫోన్ చేస్తుంటే ఇందాకటి నుంచి లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి ఇంటికెళ్లి ఏమైందో చూడండి’’ అని చెప్పాడతను. ఆ మాటలు విన్న అత్తమామలకు భయమేసింది. పడుతూ లేస్తూ కుమార్తె ఇంటికెళ్లారు. ఫోన్ వచ్చిన 15 నిమిషాల్లో కుమార్తె ఇంటికెళ్లి తలుపు తట్టారు. తీరా చూస్తే వాళ్ల కూతురు అక్కడే నేలపై పడిపోయి ఉంది. స్పృహ కూడా లేదు. అత్తమామలు అక్కడకు వచ్చిన 5 నిమిషాలకే అల్లుడు కూడా ఇంటికొచ్చాడు. నేలపై పడున్న భార్యను చూసి ఏమైంది? అంటూ గాభరా పడ్డాడు. ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించింది. ఆస్పత్రి రూల్స్ ప్రకారం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోస్టుమార్టం చేసిన అనంతరం ఆమె శరీరాన్ని కుటుంబానికి అప్పగించారు. పోస్టుమార్టంలో ఆమె గొంతు పిసికిన గుర్తులున్నాయని, ఆమెను ఎవరో చంపేశారని తేలింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని మానసరోవర్ ప్రాంతంలో వెలుగు చూసింది.


స్థానికంగా నివసించే శిఖ (32) అనే యువతిని రుషిరాజ్ శర్మ(34) అనే ప్రాపర్టీ డీలర్‌కి ఇచ్చి వివాహం చేశారు. వీళ్ల పెళ్లి 2015లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. పెళ్లయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉండేవి. ఆగస్టు 25న కూడా వీళ్లిద్దరి మధ్య అలాగే గొడవ జరిగింది. కాసేపటికి కోపం పట్టలేని రుషిరాజ్.. భార్య పీక పిసికి చంపేశాడు. ఈ ఘటన సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఆ వెంటనే ఇంటి నుంచి పరారైన రుషిరాజ్.. 5 గంటల ప్రాంతంలో అత్తమామలకు ఫోన్ చేసి ‘‘మీ అమ్మాయి ఫోన్ ఎత్తడం లేదు. ఒకసారి ఇంటికెళ్లి చూడండి’’ అని చెప్పాడు. వాళ్లు తన ఇంటికొచ్చిన ఐదు నిమిషాల్లోనే తాను కూడా ఇంటికొచ్చేశాడు. భార్య చలనం లేకుండా పడి ఉండటం చూసి గాభరా నటించాడు. అయితే కుమార్తెది హత్యే అని తేలడంతో శిఖ తండ్రి.. అల్లుడిపైనే కేసు పెట్టాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో తనకు హత్యతో సంబంధం లేదని బుకాయించిన రుషిరాజ్.. ఆ తర్వాత నిజం ఒప్పుకోవడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2021-08-29T14:22:35+05:30 IST