అత్తాకోడళ్లు అంటే ఉప్పు, నిప్పులా ఉంటారని, వారిద్దరికీ ఎప్పుడూ పడదని, కారణం లేకపోయినా ఇద్దరూ గొడవపడుతుంటారని తరచుగా వింటూ ఉంటాం. అయితే హర్యానాకు చెందిన ఓ కోడలు మానవత్వం మరిచి అత్త పట్ల క్రూరంగా వ్యవహరించింది. ఒక్క చపాతీ ఎక్కువగా తిన్నందుకు అత్తని మూడ్రోజుల పాటు కొట్టింది. స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కోడలు మరింత రాక్షసత్వం ప్రదర్శించింది.
హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని సందల్ఖుర్ధ్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు ఇంట్లో ఉంటోంది. ఆమెకు కోడలు మనీషా ఆహారంగా రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో చపాతీ మాత్రమే ఇస్తుండేది. మూడ్రోజుల క్రితం మనవడు మరో చపాతీని నాయనమ్మకి ఇచ్చి తినమని బలవంతం చేశాడు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చపాతీ తినేసింది. అత్త మరో చపాతీ తినడం చూసిన కోడలు ఉగ్రరూపం దాల్చింది. ఒక్క చపాతీ సరిపోలేదా అంటూ వృద్దురాలిపై దాడి చేసింది. ఇష్టం వచ్చినట్టు కొట్టింది. వరుసగా మూడ్రోజులు అత్తను కొట్టింది.
కోడలు టార్చర్ భరించలేకపోయిన అత్త చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనీషా మరింత రాక్షసత్వం ప్రదర్శించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న వృద్ధురాలి కొడుకు, మనీషా భర్త అడ్డుపడ్డాడు. తన భార్యపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. వీడియోలు పరిశీలిస్తున్న పోలీసులు మనీషాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.