13ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఇదే నా చివరి ఆశ అంటూ కూతురి ఫేస్‌బుక్ పోస్ట్.. NRIలు ఎంట్రీ ఇవ్వడంతో చివరకు..

ABN , First Publish Date - 2022-07-10T14:54:12+05:30 IST

ఉపాధి కోసం వెళ్లి దేశం కాని దేశంలో తప్పిపోయిన తండ్రి కోసం ఆ కూతురు 13 ఏళ్లుగా ఎదురుచూస్తునే ఉంది. ఏదో ఒకరోజు తన తండ్రి తమ చెంతకు రాకపోతాడా? అని. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న తండ్రి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అసలు ఏం అయ్యాడో కూడా తెలియదు. తల్లి రోజువారీ కూలీ పనులకు వెళ్లి ఆమెను చదివిస్తోంది.

13ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఇదే నా చివరి ఆశ అంటూ కూతురి ఫేస్‌బుక్ పోస్ట్.. NRIలు ఎంట్రీ ఇవ్వడంతో చివరకు..
ఎడమ నుంచి రెండో వ్యక్తి చంద్రన్..

మనామా: ఉపాధి కోసం వెళ్లి దేశం కాని దేశంలో తప్పిపోయిన తండ్రి కోసం ఆ కూతురు 13 ఏళ్లుగా ఎదురుచూస్తునే ఉంది. ఏదో ఒకరోజు తన తండ్రి తమ చెంతకు రాకపోతాడా? అని. అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్న తండ్రి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అసలు ఏం అయ్యాడో కూడా తెలియదు. తల్లి రోజువారీ కూలీ పనులకు వెళ్లి ఆమెను చదివిస్తోంది. దాంతో ఆ కుటుంబానికి అతడి అవసరం చాలా ఉంది. అప్పటికే చాలాసార్లు తండ్రి గురించి ఆ కూతురు తెలిసిన వారి ద్వారా వాకాబు చేసింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరిసారిగా సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిద్దామని అనుకుంది. అకున్నదే తడువుగా ఫేస్‌బుక్ (Facebook)లో ఓ పోస్ట్ పెట్టింది. "13 ఏళ్ల క్రితం తప్పిపోయిన నా తండ్రిని వెతికిపట్టుకోవడంలో మీరు నాకు సహాయం చేస్తారా? ఇదే నా చివరి ఆశ" అనేది ఆ పోస్ట్ సారాంశం. 


కేరళ రాష్ట్రం కులథుర్‌కు చెందిన అంజూ అనే అమ్మాయి.. 13 ఏళ్ల క్రితం బహ్రెయిన్ ఉపాధి కోసం వెళ్లి, తిరిగి రాని తన తండ్రి ఆచూకీ కోసం ఇలా ఈ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన బహ్రెయిన్‌లోని మలయాళీలు వెంటనే ఆమెను సంప్రదించారు. ఆమె తండ్రి గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అతని పేరు కే చంద్రన్ అని, 2009 ఆగస్టులో బహ్రెయిన్ వెళ్లడంతో పాటు ఇతర అన్ని వివరాలను ఆమె నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత వాటి ఆధారంగా రంగంలోకి దిగిన మలయాళీ సామాజిక కార్యకర్తలు, నివాసితులు రోజుల వ్యవధిలోనే చంద్రన్‌ను వెతికి పట్టుకున్నారు. అనంతరం ఆ విషయాన్ని అంజూకు తెలియజేశారు. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. 13 ఏళ్ల తర్వాత తొలిసారి తండ్రితో మాట్లాడి ఆమె మురిసిపోయింది. అక్కడి ఫార్మాటీస్ పూర్తి చేసి వెంటనే రామచంద్రన్ స్వదేశానికి పంపిస్తామని మలయాళీలు తెలిపారు.


ఇక చంద్రన్ బహ్రెయిన్ వెళ్లిన రెండేళ్లకే అతడి వీసా, పాస్‌పోర్ట్‌ల గడువు ముగిశాయి. అయితే, వాటిని రెన్యువల్ చేయించకుండా అక్కడే ఓ గృహా నిర్మాణ సంస్థలో చట్టవిరుద్ధంగా పని చేస్తున్నట్లు తెలిసింది. సామాజిక కార్యకర్త సుధీర్ తిరునిలత్ మాట్లాడుతూ.. రామచంద్రన్ వివరాలను ఎంబసీకి పంపిచినట్లు పేర్కొన్నారు. అతడి ఔట్‌పాస్ రాగానే తిరిగి స్వదేశానికి పంపిస్తామన్నారు. అయితే, ప్రస్తుతం రామచంద్రన్ వద్ద అతని పాస్‌పోర్ట్ కాపీ లేదు. దాంతో అతని జాతీయతను నిరూపించడానికి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అతని పేరు మీద ఇప్పటి వరకు కొన్ని పత్రాలు సేకరించారు. అలాగే ఇప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అతని స్వస్థలం నుండి గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంది. అది అందిన వెంటనే మిగతా ప్రక్రియను పూర్తి చేసి, ఔట్‌పాట్ రాగానే రామచంద్రన్ స్వదేశానికి పయనం అవుతాడు. 

Updated Date - 2022-07-10T14:54:12+05:30 IST