Online Loan Apps: కూతురు చేసిన పనికి తల్లికి వేధింపులు.. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి..

ABN , First Publish Date - 2022-09-05T21:59:42+05:30 IST

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లోన్ యాప్స్ (Loan Apps) వేధింపులు పెరిగాయి.

Online Loan Apps: కూతురు చేసిన పనికి తల్లికి వేధింపులు.. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి..

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లోన్ యాప్స్ (Loan Apps) వేధింపులు పెరిగాయి. కస్లమర్లకు సులభంగా లోన్లు ఇచ్చి, రికవరీ కోసం వేధింపులకు పాల్పడుతున్నాయి. ఎంతో మందిని బాధితులుగా మారుస్తున్నాయి. వాటి వేధింపులను తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని అజ్మీర్‌లో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యువెలరీ షోరూమ్ సేల్స్ మేనేజర్ భార్యను లోన్ యాప్ ప్రతినిధులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ విషయమై ఆదివారం ఉదయం క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది.




29 ఏళ్ల బాధితురాలిని సుమారు 15 రోజులుగా ఆన్‌లైన్ లోన్ యాప్ ప్రతినిధులు వేధిస్తున్నారు. ఆమె కూతురు కొన్ని రోజుల క్రితం ఓ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ అనుకోకుండా కొన్ని ఆన్‌లైన్ లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసింది. వాటికి అనుమతులు కూడా ఇచ్చేసింది. వారు ఆ ఫోన్‌ను హ్యాక్ చేసి ఆ మహిళను వేధిస్తున్నారు. తన ఫోన్‌ను హ్యాక్ చేసి, ఫోటోలు, కాంటాక్ట్ నంబర్లు అన్నీ తీసుకున్నారని బాధిత మహిళ తెలిపింది. తన ఫొటోను అసభ్యకరంగా మార్చి రుణం వాయిదా త్వరగా జమ చేయాలని, లేదంటే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ ఫొటోలు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. 


నిజానికి బాధిత మహిళ ఏ యాప్ నుంచీ రుణం తీసుకోలేదు. అయినా బాధితురాలికి వివిధ నంబర్‌ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి వేధిస్తున్నారు. అలాగే బాధితురాలి ఫొటోలను అసభ్యకరంగా మార్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో ఆ మహిళ తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు.. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-09-05T21:59:42+05:30 IST