డేటా.. భద్రత డౌట్‌!

ABN , First Publish Date - 2022-09-21T09:05:38+05:30 IST

‘పెగాస్‌స’పై అంత రచ్చ చేసిన వైసీపీ... ఆ సంగతే తేల్చలేదు! ‘టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగింది’... అని చెప్పడమే తప్ప... ఆ డేటా ఎవరికి వెళ్లిందో నిర్ధారించనేలేదు.

డేటా.. భద్రత డౌట్‌!

కొత్త సందేహాలు లేవనెత్తిన వైసీపీ

టీడీపీ హయాంలో ‘లీక్‌’ అంటూ సభా సంఘం నివేదిక!

మరి ఇప్పుడేం జరుగుతుందో?

అదే వ్యవస్థ, అవే సర్వర్లు

ఐటీ సలహాదార్లుగా ముగ్గురు సొంతవాళ్లు

డిజిటల్‌ కార్పొరేషన్‌లోనూ వాళ్లే ప్రభుత్వ యాప్‌లు.. ప్రైవేటు డెవలపర్లు

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వివరాలపై గోప్యత యాప్‌లో ‘ప్రైవసీ డాక్యుమెంట్లు’ మాయం

‘చాట్‌బోట్‌’పై వాట్సాప్‌తో ఒప్పందం

వలంటీర్ల వద్ద అన్ని కుటుంబాల డేటా

కొత్తగా విద్యార్థుల కుటుంబాల డేటా సేకరణ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘పెగాస్‌స’పై అంత రచ్చ చేసిన వైసీపీ... ఆ సంగతే తేల్చలేదు!

‘టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగింది’... అని చెప్పడమే  తప్ప... ఆ డేటా ఎవరికి వెళ్లిందో నిర్ధారించనేలేదు. 


‘టీడీపీ వాళ్లకే పోయింది’ అని చెప్పడమే తప్ప... వాళ్లు ఎవరో చెప్పనే లేదు. 

ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం వచ్చినా ‘గూగుల్‌’ను అడుగుతారు. కానీ... వైసీపీ జరిగిందంటున్న డేటాచోరీపై గూగుల్‌ కూడా ‘మాకేం తెలియదు’ అని చెప్పేసింది. 


అప్పుడు ఏం జరిగిందో తెలియదుకానీ, ‘ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రాష్ట్ర ప్రజల సమాచారానికి భద్రత లేదు’ అనే అంశాన్ని వైసీపీ సర్కారు తెరపైకి తెచ్చింది. అంతేకాదు... ఇప్పుడు అనేక మార్గాల్లో సేకరిస్తున్న సమాచార భద్రతపై కొత్త సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయి డేటాబేస్‌ సర్వర్లతోపాటు... గత రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అనేక యాప్‌ల ద్వారా, వలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూనే ఉంది. ఇంకా... సంక్షేమ ప్రచారం పేరిట వాట్సా్‌పతో చాట్‌బోట్‌పై ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో టెన్త్‌, ఇంటర్‌ చదువుతున్న 10 లక్షలమంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టబోతోంది. మరి ఈ డేటా ఎంత భద్రం? ఎందుకంటే... అదే డేటా సెంటర్‌, అవే సర్వర్లు, అదే యంత్రాంగం, అప్పటిలాగే నిర్వహణ! కానీ వైసీపీ సొంత మనుషులే సలహాదారుల హోదాలో ప్రభుత్వ డేటా సర్వర్లపై అజమాయిషీ చెలాయిస్తున్నారు. శ్రీనాథ్‌ దేవిరెడ్డి, జె.విద్యాసాగర్‌ రెడ్డి, కె. రాజశేఖరరెడ్డి ఐటీ సలహాదారులుగా ఉన్నారు. ఇక... డిజిటల్‌ కార్పొరేషన్‌లో వారి సొంత మనుషులే ఉన్నారు. మరి... ప్రజల డేటాకు భద్రత ఉందా?


మహిళల సమాచారం భద్రమేనా?

మహిళల భద్రత కోసం ప్రభుత్వం ‘దిశ ఎస్‌ఓఎస్‌’ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ఇది రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాప్‌. సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ మాత్రం... ‘సావుత్రిక టెక్నాలజీస్‌’ అనే ప్రైవేటు సంస్థ. ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీ, గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్‌ లిస్టు సహా పలు పర్మిషన్లు ఇస్తేనే ఈ యాప్‌ పనిచేస్తుంది. పైగా ఈ యాప్‌ ద్వారా తీసుకునే డేటా థర్డ్‌పార్టీ కంపెనీలకు ఇస్తామని డెవలపర్‌ తన ప్రైవసీ పాలసీలోనే పేర్కొన్నారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ... ‘భద్రత సరే... మరి బాధ్యత?’ శీర్షికన దిశ యాప్‌లోని లోపాలతో ఈ ఏడాది మార్చి 26న ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై పోలీసు శాఖ స్పందించి డేటాను థర్డ్‌పార్టీకి ఇవ్వబోమని చెప్పింది. కానీ ప్రైవసీ పాలసీలోని అంశాలపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఈ పరిణామం తర్వాత ప్రభుత్వ శాఖలు నిర్వహించే పలు యాప్‌ల నిర్వహణలో పలు మార్పులు వచ్చాయి.  ప్రతీ యాప్‌ను ఆయా శాఖలు సమర్పిస్తున్నట్లుగా చూపిస్తున్నారు. కానీ యాప్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఎవరన్న వివరాలను అటు ఆండ్రాయిడ్‌, ఇటు ఐఓఎస్‌ (యాపిల్‌ ఐఫోన్‌) ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించారు.


అన్నిటికీ మించి పౌరుల డేటా నిర్వహణ, భద్రతపై కీలకమైన ప్రైవసీ పాలసీ డాక్యుమెంట్‌లను తొలగించడం గమనార్హం. దిశ ఎస్‌ఓఎస్‌ అండ్రాయిడ్‌ యాప్‌ డేటాను థర్డ్‌ పార్టీకి ఇవ్వబోమని, డేటాను కూడా సేకరించబోమన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను యాప్‌నుంచి తొలగించారు. యూజర్‌ డే టా సేకరించకుండా, స్టోర్‌ చేయకుండా యాప్‌ ఎలా పనిచేస్తుంది? ఈ విషయంపై ఆరా తీసిన సాంకేతిక నిపుణులకు ‘ఎర్రర్‌’ అనే సమాధానమే వస్తోంది. ఇదొక్కటే కాదు.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇతర ఆండ్రాయిడ్‌ యాప్‌ల్లోనూ డెవలపర్‌ కంపెనీ, ప్రైవసీ పాలసీ డాక్యుమెంట్‌లను చూపించడం లేదు. ఎన్‌ఐసీ నిర్వహిస్తోన్న సంక్షేమ పథకాలు, ఆర్‌టీజీఎస్‌ నడుపుతున్న స్పందన, ముఖ్యమంత్రి యువనేస్తం, మాతా శిశు సంరక్షణ, వ్యవసాయ శాఖకు చెందిన వైఎస్సార్‌ యాప్‌లకు సంబంధించిన ప్రైవసీ పాలసీ డాక్యుమెంట్లు ఆండ్రాయిడ్‌లో లేవు.


వైసీపీ తన రాజకీయ అవసరాలకోసం వాట్సాప్‌ చాట్‌బోట్‌ కోసం విఫల ప్రయత్నం చేసింది. రాజకీయ పార్టీలు, రాజకీయ అవసరాలకోసం చాట్‌బోట్‌ను అనుమతించలేమని వాట్సాప్‌ స్పష్టం చేసింది. దీంతో... ఈసారి వ్యూహాత్మకంగా ప్రభుత్వం తరఫున పావులు కదిపారు. ‘సంక్షేమ పథకాల ప్రచారం’ పేరిట ప్రభుత్వమే చాట్‌బోట్‌పై వాట్సా్‌పతో ఒప్పందం కుదుర్చుకుంది.


ఈ చాట్‌బోట్‌ను రాజకీయ అవసరాలు, ప్రచారం కోసం వాడుకోరనే గ్యారెంటీ ఎవరు ఇస్తారు? వైసీపీ అధికారంలోకి  రాగానే... వ్యూహాత్మకంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమించింది. ఆ 50 కుటుంబాల ఫోన్‌ నంబర్లు, పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ వారి వద్ద ఉన్నాయి. ఓటర్ల జాబితా పనినీ వలంటీర్లకు అప్పగించేశారు.  వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించినా పట్టించుకోవడంలేదు. ఈ వ్యవస్థ అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అది పక్కదారి పట్టదన్న గ్యారంటీ ఏమిటి!? ఈ డేటాను వైసీపీ తన రాజకీయ అవసరాలకోసం ఎన్ని రకాలుగా వాడుకుంటుందో!?


ఈ డేటాను ఏం చేస్తారు?

ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రజాసాధికారిక డేటా ఉంది. ఇది ఉండగానే, వివిధ యాప్‌ల ద్వారా సేకరిస్తున్న డేటా సర్కారు వద్ద ఉన్న సర్వర్లలో అందుబాటులో ఉంది. కీలక సంక్షేమ పథకాలన్నీ ‘ఆధార్‌’తో అనుసంధానమయ్యాయి. అయినా సరే... ఇప్పుడు కొత్తగా పది, ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్ల రూపంలో 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని సేకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో 10 లక్షల కుటుంబాల డేటా సేకరణతో ఏం చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - 2022-09-21T09:05:38+05:30 IST